బెయిల్ ఉత్తర్వులు అమలులో యుపి అధికారుల జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఉత్తర్వుల చేరవేతకు తామే ఒక వ్యవస్థను అమలు చేస్తామని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: తాము జారీ చేసిన బెయిల్ ఉత్తర్వుల అమలులో జాప్యం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర గ్రహం వ్యక్తం చేస్తూ, న్యాయస్థానాలు జారీ చేసే ఉత్తర్వులు అమలుకోసం ఎలాంటి జాప్యం లేకుండా అధికారులకు చేరేలా చూడడానికి ఒక పటిష్టమైన వ్యవస్థను తామే అమలు చేస్తామని స్పష్టం చేసింది. ‘ఈ డిజిటల్ యుగంలో కూడా ఉత్తర్వులను పంపడం కోసం పావురాల కోసం మనం ఇంకా ఎదురు చూస్తున్నాం’ అని కూడా ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలులో జాప్యానికి సంబంధించి ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తలపై స్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక ఈ నెల 8న తాము బెయిల్ మంజూరు చేసిన 13 మంది ఖైదీల విడుదలలో ఉత్తరప్రదేశ్ అధికారులు ఆలస్యం చేయడానికి సంబంధించిన వార్తలను ఇటీవల సూమోటోగా పరిగణనలోకి తీసుకున్న విషయం తెలిసిందే. నేరం జరిగిన సమయంలో జువనైల్(బాలనేరస్థులు)గా ఉన్న ఈ దోషులంతా ఒక హత్య కేసులో ఆగ్రా జైలులో 14 ఏళ్లనుంచి 22 ఏళ్ల వరకు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
సూమోటో కేసును విచారణకు స్వీకరించిన వెంటనే న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వర రావు, ఎఎస్ బోపన్నలు కూడా ఉన్న ధర్మాసనం కోర్టు ఉత్తర్వులను సంబంధిత అధికారులు ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేయడానికి వీలుగా ఆ ఉత్తర్వులు వారికి చేరేందుకు ఒక పథకాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ను ఆదేశించింది. ‘నెల రోజుల్లోగా అమలు చేయడానికి వీలుగా రెండు వారాల్లో ఒక నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ను ఆదేశిస్తున్నాను’ అని ప్రధాన న్యాయమూర్తి రమణ అన్నారు. అంతేకాదు బెయిల్ ఉత్తర్వులను ఎలాంటి జాప్యం లేకుండా పంపించడం కోసం దేశవ్యాప్తంగా జైళ్లలో ఇంటర్‌నెట్ సౌకర్యం లభ్యతకు సంబంధించి వివరాలు తెలియజేయాలని కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన విచారణ సందర్భంగా బెంచ్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. శుక్రవారం ఈ కేసు విచారణను చేపట్టిన వెంటనే బెంచ్ ఆగ్రా జైలులో ఉన్న 13 మందికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ జైలు అధికారులు వారిని విడుదల చేయడంలో జాప్యం చేయడాన్ని ప్రస్తావిసూ ్త‘పరిస్థితి ఇలా ఉంది.
ఇది ఏమాత్రం సరికాదు’ అని వ్యాఖ్యానించింది.‘ ఖైదీలను విడుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉత్తర్వు కాపీలు తమకు అందలేదని చెప్తూ వారు ఖైదీలను విడుదల చేయడం లేదు. ఇది ఎంతమాత్రం సహించరానిది’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈదశలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు ఉత్తర్వులను అమలు కాకుండా చేయడానికి కొంతమంది నిందితులు ప్రయత్నించిన సంఘటలను ప్రస్తావిస్తూ ఉత్తర్వులు కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే అధికారులు వాటిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై సిజెఐ రమణ స్పందిస్తూ ‘మనం ఐటి యుగంలో ఉన్నాం. అయినా కూడా ఇంకా మనం ఉత్తర్వులను చేరవేయడం కోసం పావురాల కోసం ఆకాశం వైపు చూస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుభద్రమైన కమ్యూనికేషన్ చానల్ ద్వారా సంబంధిత జైళ్లు , జిల్లా కోర్టులు, హైకోర్టులకు చేర వేయడానికి ‘ ఫాస్టర్’( ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్)పేరిట ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.ఈ పథకాన్ని అమలు చేయడంలో సెక్రటరీ జనరల్‌కు సహకరించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవేను అమికస్ క్యూరీ(సహాయకుడు)గా నియమించింది. హత్య జరిగిన సమయంలో తాము బాల నేరస్థులమని (జువనైల్స్) 2017ఫిబ్రవరినుంచి 2021 మార్చి మధ్య కాలంలో పలు సందర్భాల్లో జువనైల్ జస్టిస్ బోర్డు జారీ చేసిన స్పష్టమైన ఆదేశాలున్నాయని, అందువల్ల తమను ఇంకా జైలులో నిర్బంధించడం ‘చట్ట వ్యతిరేకం’ అని పేర్కొంటూ ఈ 13 మంది ఖైదీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Still looking for pigeons to communicate our orders