Friday, November 15, 2024

బ్రిటన్ ఆర్థిక సంక్షోభం మూలాలు!

- Advertisement -
- Advertisement -

Stock market collapsed over Britain's financial crisis

 

ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ దేశాలు నిత్యం సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాయి. అనేక దేశాల్లో వ్యాపార మార్కెట్ల కోసం, ఆధిపత్యం కోసం పోటీ, గుత్త పెట్టుబడి ఎగుమతి, హీన స్థితి పేదల జీవన ప్రమాణాలు అందుకు కారణాలుగా ఉన్నాయి. 2008లో ప్రపంచ ఏర్పడిన పెట్టుబడిదారీ సంక్షోభం ఆ వ్యవస్థ మేడిపండు రూపాన్ని బయటపెట్టటమే కాకుండా అది సృష్టించిన సంక్షోభం ఆ దేశాల ప్రజలను అతలాకుతలం చేసింది. పైకి అమెరికా సామ్రాజ్యవాదం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. నేడు బ్రిటన్‌లో ఏర్పడిన ఆర్థిక, రాజకీయ సంక్షోభం కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభ ఫలితమే.

ఆర్ధిక స్థిరత్యానికి నిలయంగా బ్రిటన్ చెప్పుకుంటూ వస్తూ తన డొల్లతనాన్ని కప్పిపెడుతూ వచ్చింది. నేడు తన డొల్లతనాన్ని బయటపెట్టుకుంటూ తీవ్రమైన ఆర్ధిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఆర్ధిక విధానాల ఫలితంగా బ్రిటన్‌లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం, రాజకీయ సంక్షోభానికి దారితీసి రెండు నెలల కాలంలో ముగ్గురు ప్రధాన మంత్రులు మారారు. పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించిన ఆర్ధిక సంక్షోభం బ్రిటన్ ప్రజల జీవితాలను కల్లోల పరుస్తున్నది. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల, ఆయిల్ ధరలు పెరగటం వలన కుటుంబ జీవన వ్యయం పెరగటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పాల ధర 2021 సెప్టెంబర్ నుంచి 2022 సెప్టెంబర్ మధ్య 42.1% పెరిగింది. గోధుమ, మొక్కజొన్న వంటి పంటల ధరలు 29%, జామ్ 28.1%, ఆలుగడ్డలు 19.9%, చికెన్ 17.2% పెరిగాయి. ఆహార వస్తువుల ధరలే కాకుండా ఇంధన ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. లీటరు పెట్రోల్ ధర 167 రూ. (162.81పెన్స్)కి, డీజిల్ 187 రూ. (181. 86 పెన్స్) పెరిగింది. కరెంట్ చార్జీలు విపరీతంగా పెరిగాయి.

ఆహార పదార్థాల ధరలు పెరగటంతో సగం మంది ప్రజలు ఆహారం విషయంలో జాగ్రత్త పడుతున్నారు. భోజనాల రోజు వారీ సంఖ్యను కూడా తగ్గిస్తున్నారని కన్జూమర్ గ్రూప్ పేర్కొంది. దీనిపై విచ్ సంస్థ 3 వేలపై సర్వే జరపగా సంక్షోభం ముందుతో పోలిస్తే ప్రజలు తినటం చాలా తక్కువని వెల్లడించింది. 80% ప్రజలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని, ఇంధన ధరలను ఫ్రీజ్ చేయటంతో తమ ఇళ్ల వాటర్లను వాడుకోలేకపోతున్నామని ప్రజలు తెలియచేసినట్లు సర్వే రిపోర్టు వెల్లడించింది. ఆహార పదార్ధాల ధరలు పెరగటంతో అవి తక్కువ రేటుకి ఎక్కడ దొరుకుయోనని ప్రజలు నాలుగైదు చోట్లకు తిరుగుతున్నారు. పెరుగుతున్న ఖర్చులను తట్టుకునేందుకు ఐదు ఉద్యోగాలు చేయటంతో పాటు బహిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకున్న డబ్బులను బయటకు తీస్తున్నారు. బ్యాంకులను లోన్లు అడుగుతున్నారు. ఆహారం కోసం ప్రభుత్వ ఫుడ్ బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు.

బ్రిటన్‌లో నేడు ఆర్ధిక మాంద్యం కొనసాగుతున్నది 2020 జిడిపి 11.1% నుండి 2021కి 7.5% పడిపోయింది. డాలర్‌తో పౌండ్ విలువ తగ్గుతూ వస్తున్నది. తయారీ, సేవా రంగాలు తగ్గుముఖం పట్టం వలన నిరుద్యోగం పెరగటం, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోయింది. ఫలితంగా ప్రభుత్వ ఖర్చులు ఎక్కువై, ఆదాయం తగ్గటం వలన ద్రవ్యోల్బణం ఏర్పడింది. దీన్ని కష్టడి చేయటానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లను పెంచింది. అంతే కాకుండా పొదుపు చర్యలు పాటించాలని ప్రజలకు చెప్పింది. 2008లో ఏర్పడిన పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్ధిక సంక్షోభం బ్రిటన్ లో నేటి సంక్షోభానికి దారి తీసింది.

2008లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం వలన బ్రిటన్‌లోని అనేక సంస్థలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. దాని నుంచి వాటిని రక్షించటానికి ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బులు ఉంచాలని భావించింది. అందుకు అనుగుణంగా గృహ రుణ రేట్లను 6.3% నుంచి 2.5% తగ్గించింది. వడ్డీ రేట్లు 2.24 శాతానికి పడిపోయింది. దీని వలన ప్రజలకు ద్రవ్య లభ్యత లభించి వారి కొనుగోలు శక్తి పెరిగింది. ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బులు ఉండటం వలన ద్రవ్యోల్బలానికి కారణంగా బ్రిటన్ ప్రభుత్వం చెప్పటం వాస్తవాన్ని మరుగు పర్చటమే. దేశంలో ఏర్పడి ఆర్ధిక సంక్షోభానికి పెట్టుబదారీ వ్యవస్థ అన్న వాస్తవాన్ని మరుగు పర్చటానికి కరోనాను సంక్షోభానికి కారణంగా బ్రిటన్ ప్రభుత్వం ప్రచారం చేసింది. కరోనా సంక్షోభం మనేది పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టి మాత్రమే. కరోనా పేరుతో భయంకరమైన పరిస్థితులను సృష్టించి కార్మికుల, పేదలకు ఉపాధి లేకుండా చేసి ఆకలి మరణాలకు గురిచేయటమే కాకుండా సామాన్య ప్రజలను ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రజల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో బడా మందుల కంపెనీలు, పరిశ్రమాధిపతులు కరోనాను అడ్డం పెట్టుకుని వేల కోట్లు లాభాలు గడించారు.

చమురు ధరలు పెరగటానికి ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా బ్రిటన్ ప్రభుత్వం చెప్పటం విచిత్రంగా ఉంది. అమెరికా నాయకత్వాన ఉన్న నాటో కూటమి ఉక్రెయిన్ నేత జెలెన్ స్కీని రెచ్చగొట్టి రష్యాపై యుద్ధానికి తలపడేలా చేసింది. ఉక్రెయిన్ తరపున తను నిలబడింది. అందువలన యుద్ధానికి కారణ దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. చమురు ధరలు పెరగటంలోనూ దీనికి బాధ్యత ఉంది. ఉక్రెయిన్‌కు మద్దతుగా నాటో కూటమి దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించి రష్యాని ఆర్ధిక దిగ్బంధానికి గురిచేయ పూనుకోవటంతో రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు ఆగిపోయాయి. ఫలితంగా రష్యా నుంచి బ్రిటన్‌కు వచ్చే 40% గ్యాస్ సరఫరా ఆగిన ఫలితంగా ఆ దేశంలో గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగటానికి కారణమైంది. అందువలన దేశంలో గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగటానికి బ్రిటనే బాధ్యత వహించాలి. గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగి ప్రజలు అవస్థలు పడుతుంటే బ్రిటిష్ పెట్రోలియం సంస్థ 2021లో 910 కోట్ల డాలర్లు లాభాలు గడించగా ఈ సంవత్సరం అంతకు మూడు రెట్లు లాభాలు గడించింది. దీన్ని గమనిస్తే ఉక్రెయిన్, రష్యా యుద్ధం బ్రిటన్ చమురు కంపెనీలకు పెద్దఎత్తున లాభాలు చేకూర్చింది.

పాలకుల విధానాల ఫలితంగా ఏర్పడిన సంక్షోభం రెండు నెలల్లో ముగ్గురు ప్రధానులు మారారు. నెల క్రితం ఎర్పడిన లిజ్ ట్రస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి బదులు కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ప్రకటించింది. ధనవంతులపై ఉన్న 45% పన్నును గణనీయంగా తగ్గించింది. కార్పొరేట్ల పై పన్నును 18% కుదిస్తానని ప్రకటించింది. పేద, ధనిక వ్యత్యాసం లేకుండా విద్యుత్ ధరను మెగావాట్ హవర్ పై 520 పౌండ్లకు పెంచారు. ఈ విధానాల వలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిన ఫలితంగా లిజ్ ట్రస్ రాజీనామాతో రిషి సునాక్ ప్రధాని బాధ్యతలు చేపట్టాడు. పెట్టుబడిదారీ సంక్షోభాన్ని నివారించటానికి ఈయన విధానాలు ఎలా ఉంటాయో చూడవలసి ఉంది.

బ్రిటన్ ప్రజలు ఆర్ధిక, రాజకీయ సంక్షో భం నుండి బయటపడాలంటే పాలకులు అనుసరిస్తున్న పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగాను, అమెరికా యుద్ధ వ్యూహం లో బ్రిటన్ భాగస్వామ్యం ఉండగూడదని, సంపద కేంద్రీకరణ రూపు మాపాలని ఐక్యం గా ఉద్యమించాలి.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News