ముంబై: భారత స్టాక్ మార్కెట్ ఈరోజు భారీ నష్టాలు చవిచూసింది. బిఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఈ ఒక్కరోజే రూ.5.3 లక్షల కోట్లు తగ్గింది. సెన్సెక్స్ ఏకంగా 1,017 పాయింట్లు క్షీణించి 81,183 వద్ద ముగియగా… నిఫ్టీ 292 పాయింట్లు నష్టపోయి 24,852 వద్ద స్థిరపడింది. అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు అంచనాలు, యూఎస్ ఉద్యోగ నివేదికకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. మార్కెట్ భారీ పతనం కారణంగా బిఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.5.3 లక్షల కోట్లు తగ్గి రూ.460.04 కోట్ల వద్ద ఉంది. నిన్న గురువారం నాడు మార్కెట్ ముగిసిన తర్వాత ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.465.3 లక్షల కోట్లుగా ఉంది.
సెన్సెక్స్-30 స్టాక్స్‌లో ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంకు, ఎన్టీపిసి, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, టాటా మోటార్స్, ఐటిసి, యాక్సిస్ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టి, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకీ, అల్ట్రా టెక్ సిమెంట్, విప్రో భారీగా నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌యూఎల్ లాభాల్లో ముగిశాయి.
మార్కెట్ అననుకూలత కారణంగా అన్ని రంగాల్లోనూ పెద్ద ఎత్తున అమ్మకాల ధోరణి కనిపించింది. ఆటో, పిఎస్‌యూ బ్యాంకులు, ఫిన్ సర్వీస్, మీడియా, ఎనర్జీ, ప్రైవేటు బ్యాంకులు, ఇన్‌ఫ్రా, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ సూచీలు అత్యధికంగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్-100 ఇండెక్స్ 946 పాయింట్లు, నిఫ్టీ స్మాల్ క్యాప్-100 ఇండెక్స్ 244 పాయింట్లు క్షీణించింది.