Thursday, January 23, 2025

బుల్ జోరు

- Advertisement -
- Advertisement -

ముంబై : గతవారం బుల్ రన్‌తో స్టాక్‌మార్కెట్లు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. ప్రారంభంలో సూచీలు కొంత తగ్గినప్పటి బుధవారం, శుక్రవారం ఈ రెండు రోజుల్లో జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. విదేశీ పెట్టుబడుల ప్రవాహం, అంతర్జాతీయంగా సానుకూల అంశాలు వెరసి సెన్సెక్స్ కీలక 64,000 పాయింట్లను, నిఫ్టీ 19,000 పాయింట్ల మార్క్‌ను ఎట్టకేలకు దాటాయి. సోమవారం సెన్సెక్స్ 62,982 వద్ద ప్రారంభించింది. ఇక వారాంతం శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,658 పాయింట్లు పెరిగి 64,718 పాయింట్ల వద్ద ముగిసింది.

వారం మొత్తంలో(సోమవారం నుంచి శుక్రవారం వరకు) సెన్సెక్స్ 1,723 పాయింట్లు పెరిగింది. గత వారంలో రెండోసారి మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. బుధవారం సూచీలు కీలక మార్క్‌లను తాకగా, శుక్రవారం నాడు జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకోవడమే కాదు, మరింత ముందు వెళ్లాయి. శుక్రవారం నిఫ్టీ 217 పాయింట్ల లాభంతో 19,189 పాయింట్ల వద్ద స్థిరపడింది. బిఎస్‌ఇ మార్కెట్ క్యాప్ రూ.296.45 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ఇప్పటి వరకు ఇది చారిత్రక రికార్డు స్థాయిగా ఉంది. కాగా బుధవారం సెషన్‌లో బిఎస్‌ఇ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.294.30 లక్షల కోట్లుగా ఉంది.

అంటే శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.2.15 లక్షల కోట్లు పెరిగింది. ఇక రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్, ఆటో, ఐటి, ఎఫ్‌ఎంసిజి, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్, ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఐటి స్టాక్స్‌లో కొనుగోళ్ల కారణంగా నిఫ్టీ ఐటి 720 పాయింట్లు (2.50 శాతం) జంప్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ 419 పాయింట్లు లేదా 0.95 శాతం పెరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 233 పాయింట్లు(0.66 శాతం) లాభంతో ముగియగా, స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా లాభపడ్డాయి.

30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 28 షేర్లు లాభాలతో ముగియగా, 2 షేర్లు మాత్రమే నష్టపోయాయి. 50 నిఫ్టీ స్టాక్స్‌లో 41 లాభాలతో ముగియగా, 9 నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 19,200 పాయింట్లను దాటింది. 2019 మేలో నిఫ్టీ 12,000 వద్ద ఉంది. అంటే కేవలం 4 ఏళ్లలో నిఫ్టీ ఇండెక్స్ 7,000 పాయింట్లు లాభపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News