భారీగా 1,276 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ఒక్క రోజే రూ.5.66 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై : గ్లోబల్ మార్కెట్లలో రికవరీ నేపథ్యంలో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ జంప్ చేశాయి. ఈ వారం రెండో ట్రేడింగ్ రోజు మంగళవారం మార్కెట్లో బుల్స్ జోరు కనిపించింది. సెన్సెక్స్ కీలక 58 వేల పాయింట్లను, నిఫ్టీ 17 వేల పాయింట్లను దాటాయి. మార్కెట్ ముగిసే సమయానికి 1,276 పాయింట్ల లాభంతో 58,065 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 386 పాయింట్ల లాభంతో 17,274 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 28 షేర్లు లాభపడ్డాయి. ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ.5.66 లక్షల కోట్లు పెరిగింది. బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం విలువ రూ.272.93 లక్షల కోట్లకు చేరుకుంది.
ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, టిసిఎస్, యుపిఎల్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫిన్‌సర్వ్, జెఎస్‌డబ్ల్యు స్టీల్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు నిఫ్టీ 50లో డాక్టర్ రెడ్డీ, పవర్ గ్రిడ్ టాప్ లూజర్లుగా మిగిలాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఇలోని 11 సెక్టోరల్ ఇండెక్స్‌లు పెరిగాయి. ప్రైవేట్ బ్యాంక్ రంగం అత్యధికంగా 3.16% లాభపడగా, మెటల్ 3.13% పెరిగింది. మరోవైపు బ్యాంకులు, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ రంగాలు 2 శాతానికి పైగా పెరిగాయి. ఎఫ్‌ఎంసిజి 2 శాతం వరకు, ఫార్మా 1 శాతం మేరకు పెరిగాయి. గ్లోబల్ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో భారత స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ నెల మొదటి ట్రేడింగ్ రోజున అమెరికా మార్కెట్లు భారీ లాభాలను చవిచూశాయి. డోజోన్స్ 765 పాయింట్లు పెరిగి 29,491 వద్ద, నాస్‌డాక్ 240 పాయింట్లు పెరిగి 10,815 వద్ద ఉన్నాయి. అమెరికా మార్కెట్ ప్రభావం ఆసియా మార్కెట్‌పై కూడా కనిపించింది.