మహారాష్ట్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణ … అచల్‌పూర్‌లో కర్ఫూ
ముంబై : మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని అచల్‌పూర్‌లో ఆదివారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మతపరమైన జెండాల తొలగింపు నేపథ్యంలో రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. వెంటనే పోలీసులు రంగం లోకి దిగి భాష్పవాయు గోళాలు ప్రయోగించి ఆందోళన కారులను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. హిందూ, ముస్లిం పండగల సందర్భంగా అచల్‌పూర్ ప్రధాన ప్రవేశం వద్ద ఉండే ఖిడ్కీగేట్, దుల్హాగేట్‌పై మతపరమైన జెండాలను స్థానికులు ఏర్పాటు చేయడం పరిపాటిగా వస్తోంది. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మతపర జెండాలను ఆదివారం అర్ధరాత్రి వేళ ఒక వర్గం వారు తొలగించడానికి ప్రయత్నించడంతో ఘర్షణ తలెత్తింది. రెండు వర్గాలకు చెందిన 22 మందిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు గాయపడినట్టు ఎస్పీశశికాంత్ సతవ్ తెలిపారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఆ ప్రాంతంలో కర్ఫూ విధించారు.