న్యూఢిల్లీ : వందేభారత్ రైళ్లపై దేశంలో పలుచోట్ల రాళ్లు రువ్విన సంఘనలు చోటు చేసుకోవడంతో రైల్వేశాఖకు ఇప్పటివరకు రూ. 55. 60 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2019 నుంచి ఇప్పటివరకు వందే భారత్ రైళ్లపై అల్లరి మూకలు రాళ్లు రువ్వడంతో రైల్వే శాఖకు జరిగిన ఆస్తి నష్టం వివరాలను మంత్రి బుధవారం లోక్‌సభకు వెల్లడించారు.
ఈ సంఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 151 మందిని అరెస్టు చేసినట్టు వివరించారు. అయితే ఈ సంఘటనల్లో ఎవరూ చనిపోవడం కానీ, చోరీ, ప్రయాణికుల వస్తువులు ధ్వంసం కావడం కానీ జరగలేదన్నారు. ఈ విధ్వంసాన్ని అడ్డుకోడానికి రైల్వే ఆస్తులను కాపాడడానికి ఆర్‌పిఎఫ్ అధికారలు జీపీఆర్/జిల్లా పోలీస్/ అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని పనిచేస్తున్నట్టు చెప్పారు. రైలు మార్గాలను అనుసరించి నివాసాలు ఉంటున్న ప్రజల్లో రాళ్లు రువ్వడానికి వ్యతిరేకంగా చైతన్యం తీసుకురాడానికి ఆపరేషన్ సాథీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.