మన తెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదాద్రి క్షేత్ర ఉద్ఘాటన మహోత్సవాల్లో భాగంగా గురువారం మహాకుంభ సంప్రోక్షణ పూజలు నిత్యశోభాయమానంగా జరిగాయి. ఉదయం బాలాలయంలో చతుస్థానార్చనలు, మూలమంత్ర, మూర్తిమంత్ర హావనములు నిర్వహించి పంచవిశంతి కలశస్నపనం, నిత్య లఘు పూర్చాహుతి నిర్వహించారు. సాయంత్రం నిత్యారాధనల అనంతరం శ్రీ విష్ణు సహాస్ర పారాయం, మూలమంత్రం, మూర్తిమంత్రం హావనములను చతుసానార్చనలు నిర్వహించి శిలమూర్తులకు జలాధివాసములను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏడు రోజుల పూజ మహోత్సవాల్లో భాగంగా నాల్గవరోజు అర్చకులు, యజ్ఞికులు, వేద పండితులు, పారాయణికులు శ్రీ పంచరాత్ర ఆగమశాస్త్రానుసారం ఉత్సవ పూజలను అత్యంత వైభవంగా జరిపారు. ఇదిలా ఉండగా.. ఆలయ సన్నిధిలో ప్రతిష్ఠింపచేసే శిలమయమూర్తులకు వేదమంత్రముల నడుమ పంచవిశంతి కలశ స్నపన అభిషేకాలు నిర్వహించి పవిత్ర ఔషధ తత్వములతో సుగంధ ద్రవ్యాలతో మంత్రపూతములైన జలములతో శిలమయమూర్తులను అభిషేకించారు. ప్రధానాలయంలో లోకకల్యాణార్థమై శిలమయమూర్తులకు జలాధివాస మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ప్రధానార్చకులు, పండితులు పాల్గొన్నారు.
యాదాద్రి భద్రతపై సిపి సమీక్ష
యాదాద్రి క్షేత్రం ప్రధానాలయం మహాకుంభ సంప్రోక్షణతో భక్తులకు దర్శన నిమిత్తం పునః ప్రారంభం కానున్న సందర్భంగా క్షేత్రంలో భద్రత చర్యల ఏర్పాట్లలో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆలయ ఈవో గీతతో సమావేశమై పలు అంశాలపై సమీక్ష జరిపారు. భద్రతాపరమైన చర్యలపై ఇప్పటికే పలు శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి తీసుకున్న నిర్ణయాల మేరకు గురువారం యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించి ఆలయ పరిసర ప్రాంతాలను పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. 28న మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవానికి సిఎం కెసిఆర్ రాకతోపాటు ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు అధికసంఖ్యలో వచ్చే అవకామున్నందున భద్రతపరమైన ఇ బ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలతో పాటు దేవస్థాన పరిధిలో ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసే అంశంపైనా చర్చించారు. ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు యాదాద్రి పట్టణంలో సిసి కెమెరాల ఏర్పాటు, పోలీసు బందోబస్తుపై పలు ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో ఆలయ ఈవో గీత, డిసిపి రామచంద్రారెడ్డి పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఆంజనేయస్వామికి బంగారు కవచం బహూకరణ
యాదాద్రి ఆలయంలో ఆంజనేయస్వామికి హెటిరో అధినేత బండి పార్థసారథి రెడ్డి బంగారు కవచాన్ని అందచేశారు. గురువారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని అనంతరం సుమారు రూ.11.5లక్షల విలువై బంగారు కవచాన్ని ఈవో గీతకు అందజేశారు. అదేవిధంగా స్వామివారిని ట్రాన్స్‌కో సిఎండీ ప్రభాకర్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.