ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు ఆదేశం
28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని సూచన
అనుమతి లేకుండా కుడికాలువకు నీటి విడుదలపై ఆగ్రహం
ఒప్పందానికి కట్టుబడి నీళ్లను వాడుకోవాలని హితవు
తెలంగాణ వాదనతో ఏకీభవించిన కేంద్రం
ప్రాజెక్టుకు ఇరువైపులా కేంద్ర బలగాల మోహరింపు
ఎపిపై తెలంగాణ పోలీసుల కేసు నమోదు
నేడు ఢిల్లీలో సిడబ్లుసి, కెఆర్‌ఎంబి చైర్మన్ల ఆధ్వర్యంలో భేటీ
రెండు రాష్ట్రాల సిఎస్‌లు, సిఆర్‌పిఎఫ్, సిఐఎస్‌ఎఫ్ డిజిలకు పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్/నాగార్జున సాగర్: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాలువకు నీటి విడుదలను నిలిపివేయాలని కృష్ణానదీయాజమాన్యబోర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. శుక్రవారం ఇచ్చిన ఆదేశాలను తక్షణం అమల్లో పెట్టాలని హెచ్చరించింది. దీంతో ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. కృష్ణానదీజలాల వినియోగానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల మద్య తలెత్తిన జలవివాదం కేంద్ర ప్రభుత్వం జో క్యంతో తాత్కాలికంగా సద్దుమనిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి దౌర్జన్యంగా ఏపి నీటి విడుదలకు పాల్పడ్డ సంఘటనలో తలెత్తిన ఈ వివాదం ఏపి తెలంగాణ రాష్ట్రాల మధ్య పెద్ద దూమారమే లేపింది. రెండు రాష్ట్రాల మధ్య పరిస్థితుల ఎటు మలుపు తిరుగుతాయో, ఎంతకు దారి తీస్తాయో అన్న భయాందోళనల మధ్య శుక్రవారం సమస్యకు శాంతియుతంగా పరిష్కారం లభించింది.
నాగార్జున సాగర్ జలాల విడుదల విషయంలో నవంబర్ 28వ తేదీకి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగిస్తూ సిఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలన్న కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి ప్రతిపాదనలకు తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రా ష్ట్రాలు అంగీకరించాయి. నాగార్జున సాగర్ డ్యామ్ నుండి నవంబర్ 29 న ఆంధ్ర ప్రదేశ్ ఏకపక్షంగా సాయుధ పోలీసులను మోహరించి కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన సందర్బంగా తలెత్తిన వివాదంపై శుక్రవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర జలవనరుల మం త్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర జల సం ఘం, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, నవంబర్ 29 న రాత్రి ఆంధ్రప్రదేశ్ కు చెందిన దాదాపు 500 మంది సాయుధ పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ పైకి వచ్చి సీసీ కెమెరాలను ద్వంసం చేయడంతోపాటు 5 , 7 గేట్ల వద్ద వున్నా హెడ్ రె గ్యులేటర్లను తెరిచి దాదాపు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని పే ర్కొన్నారు. తెలంగాణ శాసన సభ ఎన్నికల నిర్వహణలో ఉండగా ఏపీ ప్రభు త్వం చేసిన చర్య తమ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధమైన అతిక్రమణలకు పాల్పడడం ఇది రెండవసారి అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఈ చర్య వల్ల హైదరాబాద్ నగరంతోపాటు పరిసర ప్రాంతాల రెండు కోట్ల ప్రజల తాగునీటి అవసరాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని శాంతి కుమారి ఆందోళన వ్యక్తం చేశారు. 2014 నుండి కొనసాగుతున్న మాదిరిగానే స్టేటస్-కో ని కొనసాగించాలని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. కాగా, నాగార్జున సాగర్ డ్యాం పై గతంలో ఉన్న మాదిరిగానే స్టేటస్-కో కొనసాగించాలని, ఈ డ్యామ్ ను తాత్కాలికంగా కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాల పర్యవేక్షణలో ఉంటుందని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నట్లు భల్లా పేర్కొన్నారు.
ఢిల్లీలో శనివారం జల్‌శక్తి శాఖ అధ్యర్యంలో నిర్వహించబోయే ఈ సమావేశానికి తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సిఎస్‌లు, నీటిపారుదల శాఖల కార్యదర్శులు ,ఈఎన్సీలు, సిఐఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్ డిజిలు హాజరు కావాలని హోంశాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాలను కోరారు.ఈ వీడియో కాన్ఫరెన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు డీజీపీ అంజనీ కుమార్, నీటి పారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అడిషనల్ డీజీ ఎస్.కె.జైన్, ఐజి షా నవాజ్ కాశీం, నీటిపారుదల శాఖ సలహాదారు మురళీధర్, ఓ.ఎస్.డి శ్రీధర్ దేశ్ పాండే లు పాల్గొన్నారు.
ఎపి ప్రభుత్వానికి కెఆర్‌ఎంబి లేఖ
నాగార్జునసాగర్ ప్రాజెక్టు రైట్ కెనాల్ కి తక్షణమే నీటిని విడుదల ఆపివేయాలని కృష్ణ రివర్ బోర్డు మేనేజ్ మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాగార్జునసాగర్ నుండి ఏపీకి 15 టీఎంసీల నీటిని విడుదలకు ఒప్పందం కుదిరింది. నవంబర్ 30 వరకు ముందు అడగకుండా ఎలా నీటిని విడుదల చేస్తారని కేఆర్‌ఎం బీ ప్రశ్నించింది. అక్టోబర్ 10 నుండి 20 వరకు ఐదు టీఎంసీలు, జనవరి 8 నుండి 18 వరకు 5 టీఎంసీలు,ఏప్రిల్ 8 నుండి 24 వరకు ఐదు టీఎంసీలు వాడుకునే విధంగా రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి.ఈ ఒప్పందం అనుసరించి నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శికి కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి లేఖ రాశారు. అక్టోబర్ నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. నవంబర్ 30వ తేదీ తర్వాత నీటి విడుదలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి అందలేదని స్పష్టం చేశారు. మరో వైపు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్‌పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏపీ వైపు భారీగా పోలీసులు మోహరించారు. ఆ రాష్ట్రానికి చెందిన సుమారు 1200 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. కృష్ణా బోర్డు అధికారులు సాగర్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
వివాదానికి కారణమేంటి?
రాష్ట్ర విభజన సమయంలో కృష్ణా, గోదావరి నదీ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలనే నిర్ణయం వెలువడింది. ఈ నిర్ణయం సరిగా అమలు కాలేదు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్తు కేంద్రం, తదితరాలను తెలంగాణ రాష్ట్రమే నిర్వహించుకుంటోంది. అటువైపు ఆంధ్రప్రదేశ్ అధికారులను రానివ్వడం లేదు. అదే సమయంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంటాయి. కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు కూడా తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. గతంలో కృష్ణా బోర్డు ఆదేశాలు ఇచ్చినా నీళ్లు విడుదల చేయని సందర్భాలు ఉండేవి. తాజాగా ఇలాంటి సమస్యలేవీ తలెత్తలేదు. ఈ నెలలో సాగర్ కుడికాలువ నుంచి నీళ్లు విడుదల చేయాలని తెలంగాణ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ఇండెంటు పంపిన దాఖలాలూ లేవు. నీటి విడుదలకు ఈ రెండు నెలల్లో ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తోంది. ఈ పరిస్థితుల వల్లనే వివాదం తలెత్తినట్టు బోర్డు అధికారులు పేర్కొన్నారు.
విభజన చట్టాలకు కట్టుబడి ఉండాలి : తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం
కృష్ణానదీజలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టాలకు కట్టుబడి ఉండాలని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ఏపిని డిమాండ్ చేసింది. గురువారం తెలంగాణ రాష్ట్రం లో శాసనసభకు ఎన్నికలు జరుగురోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల అభివృద్ధి శాఖ అధికారులతోపాటు సుమారు 700 మంది ఆర్ముడు పోలీసులను నాగార్జునసాగర్ డ్యాం మీదకు పంపించి 13 స్పిల్వే గేట్లను దౌర్జన్యంగా అక్రమించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది. ప్రాజెక్టు పైన ఉన్న అన్ని బారికేడ్లను కూల్చి, సి కెమరాలను విధ్వంసం చేసి వారి స్వాధీనంలో తీసుకుని ఎలాంటి అనుమతులు లేకున్నా కుడి కాలువ స్లూయిస్ గేట్లను ఎత్తి నీటిని తీసుకెళ్ళడాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని తెలిపింది. ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అనుసరించి ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆధీనంలో ఉంచడం జరిగిందని తెలింపింది.
ఆంధ్ర అధికారులపై కేసు నమోదు
నాగార్జునసాగర్ డ్యామ్‌పై బుధవారం అర్థరాత్రి నుంచే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి విషయం తెలిసిందే.. ఏపీ ఇరిగేషన్ అధికారులు సుమారు 500 మంది పోలీసులతో బుధవారం అర్థరాత్రి ఆంధ్రా ప్రాంతం వైపు ఉన్న ఎంట్రెన్స్ నుంచి డ్యామ్ పైకి ప్రవేశించారు. ఆంధ్ర ప్రాంతం వైపు ఉన్న ఎంట్రెన్స్ నుంచి డ్యామ్‌పైకి అక్రమంగా ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్‌పిఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆంధ్రా పోలీసులు డ్యామ్ సెక్యూరిటీ గేట్ పై నుంచి దూకి గేట్ మోటార్‌ను ధ్వసం చేసి గేట్‌ను తెరుచుకొని ఎస్‌పీఎఫ్ సిబ్బందిపై దాడి చేశారు. ఆంధ్ర ఇరిగేషన్ పోలీస్ శాఖ అధికారులపై కేసు నమోదు చేసి తెలంగాణ పోలీసులు సాగర్ డ్యాంపై విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ అధికారులు ఇచ్చిన పిర్యాదుతో పాటు నీటి పారుదల శాఖ తెలంగాణ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్లు 441,448,427 క్రింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న తెలంగాణ పోలీసులు.
మా వాటాకు మించి ఒక్క నీటి చుక్క వాడుకోలేదు : అంబటి
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల విషయలో తలెత్తిన వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఇది చాలా సున్నితమైన అంశం, గొడవలు అవసరం లేదు.. సాగర్ పై ఏపీ పోలీసుల దండయాత్ర అని దుష్ప్రచారం చేశారు.. గతంలో చంద్రబాబు సర్కార్ ఫెయిలైతే.. ఇప్పుడు జగన్ సర్కార్ సక్సెస్ అయింది.. ఈ వివాదం చంద్రబాబు టైమ్ లోనూ ఉంది.. సాగర్ కుడి కెనాల్ ను కూడా తెలంగాణ ఆపరేట్ చేయడం చట్టవిరుద్ధం.. మా వాటాను మేము వాడుకునే స్వేచ్ఛ మాకు కావాలి.. పురంధేశ్వరి ఎందుకు దిగజారి మాట్లాడుతున్నారు.. ఏపీ హక్కుల్ని తెలంగాణకు తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు- అని మంత్రి మంత్రి అంబటి పేర్కొన్నారు. తెలంగాణలో ఒక పార్టీని గెలిపించి ఓక పార్టీని ఓడించాల్సిన అవసరం తమకు లేదన్నారు. చంద్రబాబుకు చెందిన కులసంఘాలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాయని ఆరోపింరారు. తెలంగాణ రాష్ట్రలో ఏ పార్టీతో తమకు సబంధం లేదని , ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వచ్చినా పొరుగు రాష్ట్రంగా ప్రభుత్వాన్ని గౌవరిస్తూ సఖ్యతగానే ఉంటామని అంబటి స్పష్టం చేశారు.