బేసిన్ వెలుపలికి నీటి తరలింపు
ట్రిబ్యునల్ తీర్పుకి విరుద్ధం కృష్ణ
నది ప్రాజెక్టులకు నష్టం రెండో
ట్రిబ్యునల్ వాటాలు తేల్చేవరకూ
హంద్రీ-నీవా నుంచి ఎపి నీటిని
తరలించకుండా ఆపాలి
కెఆర్‌ఎంబికి ఇరిగేషన్
ఇఎన్‌సి మురళీధర్ లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు విస్తరణ పనులు ఆపాలని తెలంగాణ రాష్ట్రం కృష్ణానదీయాజమాన్య బోర్డును కోరింది. ఎటు వంటి అనుమతి లేకుండానే ఎపి ప్రభుత్వం హంద్రీనీవా పథకం విస్తరణ పనులు చేపడుతోందని ఆరోపించింది. విస్తరణ పనులకు సంబంధించి టెండర్లు కూడా పిలిచిందని , విస్తరణ పనులను వెంటనే నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం నాడు కృష్ణానదీయాజమాన్య బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. ఎపి ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి 34టిఎంసిల నీటికి పైగానే వాడుకుంటోందని లేఖలో వివరించారు. మిగులు నీటి అధారంగా చేపట్టిన ప్రాజెక్టులు, అనుమతి లేని ప్రాజెక్టులకు సంబంధించి 3,850క్యూసెక్కుల నీటికి బదులు 6,300క్యూసెక్కుల నీటి వినియోగంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు పలు దఫాలుగా ఫిర్యాదులు చేసిందని వివరించారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులోని పలు అంశాలను లేఖ ద్వారా బోర్డు దృష్టికి తీసుకుపోయారు.
వందల కిలోమీటర్లు తరలిస్తునారు:
కృష్ణానదీజలాల వివాదాల రెండవ ట్రిబ్యునల్ నీటి వాటాలను తేల్చేవరకూ హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి ఎపి ప్రభుత్వం నీటిని తరలించకుండా నిలువరించాలని గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం బోర్డును కోరింది. ఇదే అంశాన్ని వివరిస్తూ గత ఆగస్ట్‌లో ఈఎన్సీ లేఖ ద్వారా బోర్డు దృష్టికి తీసుకుపోయారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు జలవిద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించనదేనని , అక్కడి నుంచి నీటిని బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరింలించేందుకు ట్రిబ్యునల్ అనుమతించదని తెలిపారు. వరదజలాలపై ఆధారపడి నిర్మించిన హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ఎపి ప్రభుత్వం కృష్ణాజలాలను బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తీసుకుపోతోందన్నారు. దీనివల్ల బేసిన్‌పరిధిలోని ప్రాజెక్టులు నష్టపోతాయన్నారు. నది ఒడ్డున ఉన్న తెలంగాణ ప్రాంతాలను కాదని బేసిన్ వెలుపల 700కి.మి దూరానికి నీటిని తరలించడం అన్యాయం అని లేఖలో పేర్కొన్నారు.
హంద్రీనీవా సుజల స్రవంతి నుంచి తుండభద్ర హైలెవల్ కెనాల్ తదితర ప్రాజెక్టులకు నీటిని తరలిస్తున్నందున బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు కూడా చేయలేదని ఈఎన్సీ గుర్తు చేశారు. ఆ విధంగా నీటిని తరలించడం ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకమని తెలిపారు. మిగులు జలాలపై ఆధారపడి బేసిన్ వెలుపలకు నీటిని తీసుకుపోయే హంద్రీనీవా ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తుంటే ,సామర్ధానికి మించి నీటిని 6300క్యూసెక్కులకు పెంచడం అక్రమం అని ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు. వరదజలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని , ఎపి మాత్రం అటువంటి విజ్ఞప్తులేవి చేయటం లేదన్నారు. వీటిన్నింటినేపధ్యంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటివాటాలు ఖరారు చేసే వరకూ హంద్రీనీవా నుంచి నీటిని తరలించకుండా ఎపిని నిలువరించాలని ఈఎన్సీ లేఖ ద్వారా బోర్డుకు విజ్ఞప్తి చేశారు.