కృష్ణానదిలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను రక్షించండి
డిపిఆర్ సన్నాహకాల పేరిట ఏపి ప్రాజెక్టుల పనులే చేస్తోంది
దానికి సచిత్ర ఆధారాలు ఇదిగో చూడండి
పోతిరెడ్డిపాడు విస్తరణ పరిశీలనకు నిజనిర్ధారణ కమిటినీ పంపించలేకపోయారు
ఎన్‌జిటి ఆదేశాలకే దిక్కులేకపోతే ఎలా?
ఏపి ప్రభుత్వ చర్యలతో హైదరాబాద్‌కు తాగునీటి గండం
కృష్ణానది యాజమాన్య బోర్డుకు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదిపైన ఏవిధమైన అనుమతుల్లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణ పనులు చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ రాష్ట్ర తాగునీటి అవసరాలపైన తీవ్రమైన ప్రభావం చూపేవిధంగా ఏపి చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను వెంటనే ఆపాలని బోర్డును కోరింది. కృష్ణానదిపైన అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టు పనులకు సంబంధించి పలు చిత్రాలతో కూడిన ఆధారాలతో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ మంగళవారం నాడు కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు లేఖ రాశారు.రాయల సీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విస్తరణ పనులపై పిర్యాదు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ ప నులు కొనసాగించవద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) స్టే విధించిందని లేఖలో బోర్డుకు గుర్తు చేశారు.
అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయకుండా పనులు చేస్తోందని తెలిపారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విస్తరణ పనులు చేస్తున్న వైనాన్ని పలు మార్లు బోర్డు దృషిక్టితెచ్చినప్పటికీ కృష్ణాబోర్డు కూడా వాటిని అడ్డుకోలేకపోయిందని లేఖలో పే ర్కొన్నారు. డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టుకు సంబంధించి సన్నాహకాలు మాత్రమే అని తెలిపిన ఏపి ప్రభుత్వం ఏకంగా ప్రాజెక్టు పనులనే చేస్తోందని ఆరోపించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలమేరకు పోతిరెడ్డిపాడు విస్తరణ పనుల పరిశీలనకోసం కృష్ణా నది జాయమాన్య బోర్డు కనీసం నిజనిర్ధారణ కమిటీని కూడా పనులు జరుగుతున్న ప్రాంతాలకు పంపలేకపోయిందని తెలిపారు. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపైన నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల వ్యవహారంపై తీవ్రమైన నిరశన వ్యక్తం చేసినట్టు లేఖలో పేర్కొన్నారు.
ఏపి ప్రభుత్వ చర్యలతో తెలంగాణ రాష్ట్రం పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో కరువులు ఏర్పడతాయని రజత్ కుమార్ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలతోపాటు , హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుందని లేఖలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిపైన అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాలని , కృష్ణానదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన నీటి వాటాలను పరిరక్షించాలలని కృష్ణారివర్ బోర్డు ఛైర్మన్‌ను కోరారు. రాయల సీయ ఎత్తిపోతల పధకం పనుల చిత్రాలను కూడా లేఖక జతపరిచిన నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ ఈ మేరకు బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌కు లేఖ రాశారు.
ప్రజాప్రతినిధుల ఆందోళనలు:
కృష్ణానదిపై ఏపి ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగే అన్యాయంపై రాష్ట్ర మంత్రులు సైతం ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్ప వర్షపాత ప్రాంతంగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా ఏపి అక్రమ ప్రాజెక్టుల వల్ల ఎడారిగా మారే ప్రమాదం పొంచివుందని ఆ జిల్లాకు చెందిన మంత్రలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. అదే జిల్లాలకు చెందిన మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఏపి అక్రమ ప్రాజెక్టుల పట్ల తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. ఏపి ప్రభుత్వం కృష్ణానదీ జలాలను అక్రమంగా తీసుకుపోతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఎగువ భాగాన తెలంగాణ రాష్ట్రం ఉందని గుర్తు చేశారు. చుక్కనీరు కూడా దిగువకు పోకుండా మళ్లించే వ్యూహం ఆమలు చేయాల్సి వస్తుందన్నారు.
ఇప్పటికైనా ఏపి సర్కారు తన తీరును మార్చుకోవాలని సూచించారు. తాగునీటి అవసరకాలకోసం తెలుగుగంగకు తాము ఎంతో ఉదారంగా వ్యవహరించామని గుర్తు చేశారు . ఏపి ప్రభుత్వం ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సైతం కృష్ణానదిపై ఏపి ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల పట్ల ఆందోళనలు వెలిబుచ్చుతున్నారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనులు వెంటనే ఆపకపోతే పాలమూరు జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశాన్ని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార లేఖ ద్వారా కృష్ణాబోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌కు వివరించారు.