మొబైల్ యూజర్లకు ఇప్పటికీ వికసిత్ భారత్ పేరుతో వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయి. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది. వాట్సాప్‌లో వికసిత్ భారత్ పేరుతో మెసేజ్‌లను తక్షణమే ఆపాలని గురువారం ఐటీ మంత్రిత్వశాఖకు ఆదేశాలు జారీ చేసింది. పారదర్శకతను నిర్ధారించేందుకు తాము తీసుకుంటున్న చర్యలో ఇదో భాగమని ఎన్నికల సంఘం పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కొద్ది గంటల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా,
ప్రధాని మోడీ లేఖతో ఉన్న వాట్సాప్ సందేశాలను కేంద్రం పంపింది. ‘వికసిత్ భారత్ సంపర్క్’ పేరిట అవి వస్తున్నాయి. నెట్‌వర్క్ పరిమితుల కారణంగా మార్చి 16 న పంపిన సందేశాలు కొందరికి ఆలస్యంగా డెలివరీ అవుతున్నాయని ఈసీకి ఐటీ శాఖ వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసే మెసేజ్‌లు వస్తున్నాయని ఈసీకి ఫిర్యాదులు అందాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. కోడ్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ క్రమం లోనే ఈసీ నుంచి తాజా స్పందన వచ్చింది.