Sunday, December 22, 2024

సింగరేణి గనుల వేలం ఆపాలి: కోదండరాం

- Advertisement -
- Advertisement -

సింగరేణి గనుల వేలాన్ని ఆపాలని తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సింగరేణి ఉత్తర తెలంగాణకు గుండెకాయ అని ఆయనన్నారు. సోమవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రొఫెసర్ కొదండరామ్ మాట్లాడారు. ఉత్తర తెలంగాణలో సింగరేణి ద్వారా అనేక మంది జీవితాలు బాగు పడ్డాయని ఆయన తెలిపారు. సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో బొగ్గు గనుల వేలం గురించి చర్చ జరుగుతోందన్నారు. 1973లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం పార్లమెంట్ చట్టం ద్వారా బొగ్గు గనులను జాతీయం చేశారని కోదండరాం గుర్తుచేశారు. బొగ్గుగనులను జాతీయం చేయడానికి వేసిన కమిటీలో అధికారి శంకరన్ కార్యదర్శిగా ఉన్నారని, ఆ ఫైల్స్‌ను శంకరన్ తనకు చాలా సార్లు చూపించారని ఆయన గుర్తుచేశారు.

పర్యావరణ విధ్వంసం, విపరీతమైన దోపిడీ, తక్కువ జీతాల కారణంగా ఆ రోజుల్లో అన్ని బొగ్గు గనులను జాతీయం చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. బొగ్గు గనులను మాఫీయా గ్యాంగులు నిర్వహిస్తూ ఉండేవని, వాటి నుంచి విముక్తి కలిగించే లక్ష్యంతోనే అప్పటి ప్రభుత్వం ఓ కమిషన్ వేసి జాతీయం చేసిందని కోదండరాం తెలిపారు. తర్వాత సరళికరణ యుగం మొదలైన తర్వాత 1989 నుంచి చాలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేశారని, ఆ సమయంలోనే బొగ్గు గనులను కూడా ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పడం ప్రారంభమయ్యిందన్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసేవారికి గనులు అప్పజెప్పారని, ఈ క్రమంలోనే అక్రమాలు, అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయన్నారు. సుప్రీం కోర్టు ఈ కేటాయింపులను విశ్లేషించిన తర్వాత గనులను కేటాయించే టప్పుడు వేలం పద్దతిని పాటించాలని, ఎవరూ బహిరంగ టెండర్ వేస్తే వారికే ఇవ్వాలని తీర్పు చెప్పిందన్నారు.

ఆ తీర్పు ప్రకారం బొగ్గు గనులను వేలం వేయడానికి అవకాశం కల్పించారన్నారు. అది ప్రైవేటీకరణను నియంత్రించడానికి వచ్చిన చట్టమని చెప్పారు. ప్రైవేటీకరణ వల్ల కలిగే అక్రమాలు, అవినీతిని నిలువరించేందుకు వచ్చిన చట్టమని గుర్తుచేశారు. ఈ చట్టం వచ్చేనాటికి దేశంలో కోల్ ఇండియా, సింగరేణి ఉందన్నారు. అయితే గనులను కచ్చితంగా వేలం వేయాలని సుప్రీంకోర్టు చెప్పలేదని స్పష్టంచేశారు. కేంద్రం బొగ్గు గనులను ప్రైవేటుపరం చేస్తామంటే కుదరదన్నారు. తెలంగాణ అస్థిత్వాలు మరిచి నిర్ణయాలు చేయవద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సింగరేణి గనులను వేలం ఆపాలని, వీలైతే మరిన్ని గనులను సింగరేణికి కేటాయించి, సింగరేణికే బొగ్గును తవ్వే అధికారం ఇవ్వాలని ప్రొఫెసర్ కోదండరాం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News