Sunday, January 19, 2025

గడ్డిఅన్నారంలో కూల్చివేతలు ఆపండి

- Advertisement -
- Advertisement -

Stop the demolition in Gaddi annaram:ts highcourt

మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌లో కూల్చివేతలు ఆపాలని, వ్యాపారులు తమ వస్తువులు తీసుకునేందుకు అనుమతించాలని మంగళవారం నాడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పండ్ల మార్కెట్‌లో కూల్చివేతలు దురదృష్టకరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనం వ్యాఖ్యానించింది. నెల రోజులు మార్కెట్ తెరవాలన్న కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని, వందలాది పోలీసులను మోహరించి మార్కెట్ కూలుస్తున్నారని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. దీంతో గడ్డి అన్నారం మార్కెట్‌లో కూల్చివేతల తీరు దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యానిస్తూ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ లక్ష్మీబాయి హాజరు కావాలని ఆదేశాలు జరీ చేసింది. కాగా మార్కెట్‌లోని వ్యాపారులు తమ వస్తువులను బాటసింగారం తరలించేందుకు వీలుగా నెల రోజుల పాటు గడ్డి అన్నారం మార్కెట్ తెరవాలని గత నెల 8న హైకోర్టు ఆదేశించింది.

తమ ఆదేశాలను అమలు చేయడం లేదని ఉన్నత న్యాయస్థానం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఈనెల 4న హడావుడిగా మార్కెట్ తెరిచారు. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారుగత నెల 8న ఆదేశించినప్పటికీ ఈనెల 4 వరకు మార్కెట్‌లోకి అనుమతించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడటంతో పాటు కూల్చివేస్తున్నారని వ్యాపారుల తరఫు న్యాయవాది గంగయ్య నాయుడు హైకోర్టుకు తెలిపారు. వందలాది పోలీసులను మొహరించి అర్ధరాత్రి నుంచి మార్కెట్ కూలుస్తున్నారని వివరించారు. గడ్డి అన్నారం మార్కెట్‌లోని 106 మంది కమీషన్ ఏజెంట్లలో 76 మంది ఖాళీ చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై తదుపరి విచారణ ఈనెల 14కి వాయిదా వేసింది. ఇదిలావుండగా పండ్ల మార్కెట్ ఆవరణలో మార్కెటింగ్ శాఖ, రోడ్లు, భవనాలు శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాత షెడ్లు, భవనాలను తొలగిస్తున్నారు. కూల్చివేత సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎల్‌బీ నగర్ ఎసిపి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ సామగ్రి, ఇతర వస్తువులను కమీషన్ ఏజెంట్ల ట్రక్కులు, ఆటోల్లో తరలిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News