మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అ నుమతులు పొందకుండానే అక్రమంగా వెలిగొం డ ప్రాజెక్టును నిర్మిస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం కృష్ణానదీయాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. వెంటనే వెలిగొండ పథకం పనులు నిలిపివేయించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇఎన్‌సి మురళీధర్ గురువారం కృష్ణాబోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించి అనుమతులు పొందకుండా, ఇటు కృష్ణానదీయాజమాన్య బోర్డు అనుమతులు కూడా తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పనులకు అనుమతులు ఇచ్చిందని లేఖ ద్వారా బోర్డు దృష్టికి తీసుకుపోయారు.
కృష్ణానదీలో వరదనీటి ఆధారంగా చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేకుండానే ఎత్తిపోతల నిర్మాణ పను లు, ఇతర అనుబంధ పనులకు పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చారని లేఖలో స్పష్టం చేశారు. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంతో ఏవిధంగాను సంబంధం లేని ప్రాంతాలకు కృష్ణానదీ నుంచి నీ టిని తరలించేందుకు అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు. బేసిన్ వెలుపలి ప్రాంతాలకు అక్రమంగా నీటిని తలించడం తగదని తెలంగాణ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులు చేపడుతున్నట్టు తెలిపింది. వరదనీటిపై ఆధారపడి నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రంలో సాగునీటితోపాటు తాగునీటి ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయని తెలిపింది.ఏపి ప్రభుత్వం చేపట్టిన చర్యలు తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం కలిగించే విధంగా ఉన్నాయని తెలిపింది. ప్రత్యేకించి ఫ్లోరైడ్ ప్రభావిత ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు, కరువు పీడిత ప్రాంతమైన పాలమూరు జిల్లాలకు అన్యాయం జరగుతుందని లేఖలో స్పష్టం చేసింది. ఇదే అంశాలపై ఇదివరకు కూడా పలు మార్లు బోర్డుకు లేఖల ద్వారా ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. బోర్డు అనుమతులు లేకుండా కొత్తపనులకు ప్రభుత్వం ఎలా అంగీకరిస్తుందని ప్రశ్నించింది.
వెలిగొండ ప్రాజెక్టు పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఈఎన్సీ లేఖలో కోరారు. ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు స్పందించలేదని ,అందువల్లే లేఖ రాయాల్సివచ్చిందని ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. అంతకు ముందు కూడా వెలిగొండ ప్రాజెక్టు పనులను అక్రమంగా కొనసాగిస్తున్న విషయంపై తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసింది. శ్రీశైలం జలాశయం నుంచి నల్లమల్ల కొండలను తొలచి సొరంగ మార్గాల ద్వారా 45టిఎంసీల నీటిని తరలించేందుకు ఏపి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును చేపట్టింది. ప్రకాశం ,కడప ,నెల్లూరు జిల్లాల పరిధిలో 4.5లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు సుమారు 15లక్షల మందికి తాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది.అయతే ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండానే పనులు కొనసాగిస్తొంది. కొండలను తొలచి సొరంగమార్గాలు నిర్మిస్తున్న క్రమంలో వెలువడే మట్టి ఇతర వ్యర్ధాలను శ్రీశైలం జలాశయంలో కలుపుతున్న విషయాన్ని కూడా తెలంగాణ కృష్టాబోర్డు దృష్టికి తీసుకుపోయింది.
ప్రకాశం జిల్లా పరిధిలో సాగుతున్న టన్నెల్ పనుల నుంచి వస్తున్న వ్యర్ధాలను శ్రీశైలం కుడిగట్టు వైపు డంప్ చేస్తున్నారని,ఇప్పటికే టన్నుల కొలది వ్యర్ధాలను రిజర్వాయర్‌లో నింపారని ,దీని వల్ల రిజర్వాయర్‌లో పూడిక పడి నీటినిలువ సామర్ధం తగ్గిపోతోందని బోర్డుకు తెలిపింది. వ్యర్ధాలను రిజర్వాయర్‌లో డంప్‌చేస్తుండటాన్ని తగిన ఆధారాలతో సహా బోర్డు దృష్టికి తీసుకుపోయింది. ఇప్పటికైనా కృష్ణానదీయాజమాన్యబోర్డు స్పందించి వెలిగొండ ప్రాజెక్టు పనులు వెంటనే నిలిపివేయించాలని ఈఎన్సీ మురళీధర్ బోర్డు చైర్మన్‌కు తాజా లేఖలో విజ్ణప్తి చేశారు.