విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. బకాయిలు చెల్లించకపోవడం వల్లే నెట్ వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేసినట్లు సమాచారం. ఆరోగ్యశ్రీ సిఈవో లక్ష్మీ షా తో ఏపి స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
రూ. 2500 కోట్ల బకాయిలకుగాను రూ. 200 కోట్లు తక్షణమే చెల్లిస్తామన్న లక్ష్మీ షా మరో రూ. 300 కోట్లు సోమవారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ మొత్తం బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తామని అసోసియేషన్ స్పష్టం చేసింది. అయితే చర్చలు విఫలం కావడంతో అత్యవసర సేవలు మినహా ఆరోగ్యశ్రీ సేవలను ఆసుపత్రులు నిలిపేశాయి. రేపు(శుక్రవారం) స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తో మంత్రి సత్యకుమార్ చర్చించనున్నారు. పేద, మధ్యతరగతి వారికి ఉపయోగపడే ఆరోగ్యశ్రీ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదిలావుండగా కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్నే ప్రజలు వినియోగించుకోవాలంటూ టిడిపికి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అంటున్నారని తెలిసింది.