ఈ సారి సాంకేతిక సమస్యతో అంతరాయం
ప్రయాణికులను వేరే రైలులో తరలింపు
బులంద్‌షహర్: రైల్వే శాఖ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వరస ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. గత రెండు రోజులుగా ముంబయి గాంధీనగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రెండు సార్లు పశువులను ఢీకొని ఆగిపోగా, తాజాగా మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. శనివారం న్యూఢిల్లీనుంచి వారణాసి బయలుదేరిన ఈ ఎక్స్‌ప్రెస్ రైలో ్లట్రాక్షన్ మోటార్ జామ్ కావడంతో మధ్యలోనే ఆగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ సమీపంలో ధన్‌కౌర్, వేర్ స్టేషన్ల మధ్య రైలు సి8 కోచ్‌కు సంబంధించిన ట్రాక్షన్ మోటారులో బేరింగ్ పని చేయలేదు. గ్రౌండ్ స్టాఫ్ దీన్ని గమనించిన వెంటనే రైల్వే ఆపరేషన్స్ కంట్రోల్ వ్యవస్థను అప్రమత్తం చేశారు. రైల్లోనే ఉన్న సాంకేతిక సిబ్బంది తనిఖీ చేసి రైలును 20 కిలోమీటర్ల నియంత్రిత వేగంతో ఖుర్దా రైల్వే స్టేషన్‌కు తీసుకు వచ్చారు.
అక్కడ 5 గంటలపాటు మరమ్మతులు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అందులోని ప్రయాణికులను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో గమ్యస్థానానికి చేర్చినట్లు రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదాలను ఎదుర్కోవడం వరసగా ఇది మూడో రోజు కావడం గమనార్హం. గురువారం ముంబయిగాంధీనగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అహ్మదాబాద్ సమీపంలోని పట్వా స్టేషన్ వద్ద గేదెలను ఢీకొనడంతో రైలు ముందు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో గేదెలు మృతి చెందాయి. అలాగే శనివారం మధ్యాహ్నం గాఃధీనగర్‌నుంచి ముంబయికి బయలుదేరిన రైలు ఆనంద్ స్టేషన్ సమీనంలో ఒక ఆవును ఢీకొంది. దీంతో మళ్లీ ముందుభాగం నొక్కుకు పోయి పది నిమిషాలు ఆగిపోయింది.