Sunday, December 22, 2024

లక్ష్మీపతి కథలెప్పుడూ నాలుగో కోణమే!

- Advertisement -
- Advertisement -

ప్రపంచీకరణ వల్ల విశ్వవిపణిలో దేశం అంగడి సరుకు అవుతుంది. బలిసిన కంపెనీలు భూమండలమంతా విస్తరించి వనరులను కబళిస్తూ, శ్రామికుల, ఉద్యోగుల రక్తాన్ని పీల్చి సామాన్యుల బతుకులను దుర్బరం చేస్తాయి. ఈ సునామీని తట్టుకొనేవా డు తట్టుకుంటాడు, కొట్టుకుపోయేవాడు కొట్టుకుపోతాడు అన్నట్లు ప్రభుత్వాలు చేష్టలుడికిన ట్లు చూస్తుంటాయి. అలాంటి సంక్షుభిత కాలం జనజీవన, ఆర్థిక పరిస్థితులతో పాటు కళలను కూడా ప్రభావితం చేస్తుంది. ఏడుస్తున్న మనిషి ని ఏ అద్దం నవ్వుతున్నట్లు చూపించలేదు. చూ పిస్తే అది అబద్దమే అవుతుంది. అలాంటి కష్టకాలాన్ని చూస్తూ ఉండలేక, పరిసరాల ఉక్కబోతను భరించలేక ఆడెపు లక్ష్మీపతి తన పరిశీలనను, సాహిత్య ప్రజ్ఞను జుగల్ బందీగా మేళవించి కథలుగా అల్లారు. ఆ కథలు పచ్చి వాస్తవాలను ముదురు రంగులతో విశాల కాన్వాసుపై వేసిన బొమ్మ ల్లా ఉంటాయి. కేవలం పాత్రలు, వాటి చింతనలే కాకుండా పరిసరాల మైదానమంతా పటాలు పటాలుగా విస్తరించడం వాటి ప్రత్యేకత.

తొలి కథ రాసి యాభై ఏళ్లయినా లక్ష్మీపతి ఇప్పటికి రాసిన కథలు 26 మాత్రమే. లెక్కకు తక్కువనుకున్నా వాటి వల్ల ఆయనకొచ్చిన పేరు, కథకుడిగా గుర్తింపు తక్కువేమీ కాదు. వీటిలో సగానికి పైగా కథా వార్షిక సంపుటాల్లో చోటు చేసుకోవడమే దీనికి నిదర్శనం. ఆయన కథనశైలిని, కథావరణ పరిజ్ఞానాన్ని గమనించిన కథల, నవలల పోటీల నిర్వాహకులు లక్ష్మిపతిని న్యాయనిర్ణేతగా ఎంచుకోవడం మరో రుజువు.ఒక ప్రోడక్ట్ కు టెస్టెడ్ అని ముద్ర పడటానికి ఎంతకాలమైనా పట్టవచ్చు. ఇక ఏది కలిపినా ఇమడదు అనేదే సంతృప్త ద్రావకం. తన రచనలకు తుది రూపమీయడానికి ఆడెపు లక్ష్మీపతి పై రెండు సూత్రాలను ఉపయోగించారనాలి. అందుకే ఆయన కథలు సంఖ్యాపరంగా తక్కువైనా సాంద్రతపరంగా ఘనమైనవి. ’రచయిత తన జీవితకాలంలో నిలిచే ఒకే రచన చేస్తాడు, మిగిలినవన్నీ ఆ రచనని ముక్కలుగా చేసి సాగదీసినవే’ అనే మాటలో నిజం పాలే ఎక్కువ. అందుకు భిన్నంగా లక్ష్మీపతి కథలు ఆయన మనసులో ఉన్న పెద్ద కథను విడి భాగాలుగా ఒక్కొక్కటి విడుదల చేస్తున్నట్లుంటాయి.

1997 లో ఆయన కథలు మొదటిసారిగా ’నాలుగు దృశ్యాలు’ పేరిట పుస్తకంగా వచ్చాయి. ఆ సంపుటికి 4 పురస్కారాలు లభించాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ ’త్రిభుజపు నాలుగో కోణం’ మరో కథా సంపుటి. ఇందులో 13 కథలున్నాయి. వీటిలో 10 కథలు వివిధ ’వార్షిక’ కథాసంకలనాల్లో పునర్దర్శనమిచ్చాయి. అసందిగ్ద కర్తవ్యం అనే కథ మూడు పుస్తకాల్లో వచ్చింది. ఎద్దు పుండు 1990-19 కాలపు రెండు దశాబ్దాల ఉత్తమ కథల్లో స్థానం పొందింది. బంద్ కథ నూరేళ్ళ తెలుగు కథలు లో ఒకటైంది. ఈ ఎంపికే ప్రామాణికం కాకున్నా ఇవి విశేష లక్షణాలున్న కథలు అని చెప్పడానికి ఉదహరించవచ్చు.
ఈ సంపుటిలోని కథలు 1990-2021 మధ్య కాలంలో రాసినవి. 1990 నుండి మన దేశంలో సరళీకృత ఆర్థిక విధానం, పెట్టుబడుల ఉపసంహరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నడకలు మొదలయ్యాయి. ప్రభుత్వాల సాంకేతిక గణాంకాలు ఎలా ఉన్నా వాటి వల్ల దేశంలో ఆర్థిక అసమానతలు,

కొన్ని కుటుంబాల ఆస్తులే కొండల్లా పెరగడం, గ్రామీణ జీవన దుర్భరం, అప్పుల భారంతో ఆత్మహత్యలు, నిరుద్యోగిత లాంటి దుర్లక్షణాలు పుట్టుకొచ్చాయి. వాటి ప్రభావం సామాన్యుడి, మధ్యతరగతి ప్రజల బతుకులపై ఎంత ఘోరంగా ఉందో ఈ కథలు వివరిస్తాయి. ఏ కథను తట్టి చూసినా దిగజారిపోతున్న సామాన్యుల ఆర్థిక పరిస్థితి, కనీస మానవ ధర్మాన్ని మరిచిపోతున్న పెద్దల వైనం, తీపి గుళికల అబద్దాల పాలన మొదలైనవి సుస్పష్టంగా తెలిసిపోతాయి. కథాంశంపై లోతైన అవగాహన, కథా రచనపై దృఢపట్టు రచయితకున్న బలాలు. నగలో అమర్చేప్పుడు ఒక్కో రాయిని తిప్పి తిప్పి చూసినట్లు ఒక్కో పదాన్ని ఎంపిక చేసుకుంటూ కథను పొందించిన విధానం ఆయన శైలి. ఇలా రాస్తే ఫలానా పత్రిక వేసుకుంటుంది అనే అధమ స్థాయి ఆలోచన చేయని లక్ష్మీపతి రచయితగా తన సంతృప్తికే తొలి ప్రాధాన్యతనిచ్చి రాసిన కథలివి. ఇలా గతకాలపు కథకుల విశిష్టతను కొనసాగిస్తున్న మేలిమి రచయితల్లో వీరొకరు.

కాలానుగుణంగా చూస్తే 1990 లో రాసిన కథ ’బంద్’. పారిశ్రామిక ప్రాంతంలో బంద్ రోజున ఓ చిన్న హోటల్ వాడి పరిస్థితి, వాడిపై పోలీసుల జులుం ఎలా ఉంటుందో తెలిపే రచన ఇది. ఇప్పుడు బంద్ లకు కాలం చెల్లింది కాబట్టి కథ రచనాకాలాన్ని దాటి రాలేదు.సర్దుకు బతుకుతున్న పల్లెటూరి రైతు జీవితాల్లో తిరుగుబాటుకు సిద్దమైన యువతరం రాజ్యాగ్రహానికి గురైన తీరు, కొడుకు సత్తయ్యను పోలీసులు మాయం చేసిన గుండె కోతను అణచుకోలేని అశక్త తండ్రి వెంకటి నిరసన ’ఆక్రోశం’ కథాసారం. పంట నూర్పుల్ల వేళ శారదకాండ్ల ప్రవేశం, వారి సంభాషణలు కథకు సహజత్వానికి అద్దుతాయి. సత్తయ్య ప్రేమించిన సుశీల పెళ్లి వేరొకరికిచ్చి చేయక తప్పని పరిస్థితి విని వెంకటి గుండె మూగగా రోదిస్తుంది. తన క్రోధాన్ని ఒక మూగజీవిపై చూయించి ఏదో ఉపశమనం పొందినట్లుగా వెంకటి బీడీ దమ్ము లాగడంతో కథ ముగుస్తుంది. ’నిశ్చలనచిత్రం’ ఓ ఆధునిక జీవితాల వింత కథ. మిగితా వాటితో భిన్నంగా కనబడే కథ ఇది. 1992 లో రాసిన ఈ కథ ఆ రోజుల్లో మారుతున్న జీవన శైలి, అభిరుచులకు అద్దం పడుతుంది. ఫోటోగ్రఫీ నేపథ్యంతో సాగే కథకు తగ్గ ఇంగ్లిష్ పదాలు, వర్ణన, పాత్రల వ్యవహార శైలి రచయితను కొత్తగా పరిచయం చేస్తాయి.

’జీవన్మృతుడు’ అనే పెద్ద కథ రచయితకు గుర్తింపు తెచ్చినవాటిలో ఒకటి. మధ్యమపురుషలో చైతన్య స్రవంతి శైలిలో ఈ కథ సాగుతుంది. లక్ష్మీపతి తనే ప్రధానపాత్రగా జీవనానుభవాన్ని, కుదేలవుతున్న ప్రభుత్వ రంగ సంస్థల దీన దౌర్భాగ్య స్థితిని 360 డిగ్రీల కోణంలో ప్రదర్శించారు. చదివేవారు ఫ్యాక్టరీలో ఆ పరిసర కాలనిలో తిరిగినట్లుగానే ఉంటుంది. పాత్ర మానసిక సంఘర్షణలోకి పాఠకుణ్ణి తీసికెళ్ళేలా కథనం, పరిసరాల వర్ణనను కథా అంతర్గత అంశంగా నిలపడం ఈ కథ విశేషణాలు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూలిపోతుంటే వాటికి ముడిపడివున్న జీవితాల మునక ఎంత క్షోభను కలిగిస్తుందో ఈ కథ నిలువుటద్దంలా చూపుతుంది. 1996 లో రాసిన రెండు కథలు ’తిర్యగ్రేఖ’ మరియు ’విశిష్ట గురుత్వం’. ఊహించని ఘటన తర్వాత ఆ పర్యావరణంలో తిర్యగ్రేఖ కథ నడుస్తుంది. చుట్ట విప్పుకున్నట్లు ఈ కొస నుండి మొదలైన కథ మళ్ళీ అక్కడికే వచ్చి ముగుస్తుంది. సుమారు ముప్పై ఏళ్ల క్రితం రాసినా నేటికీ, బహుశ రేపటికి కూడా ప్రసంగికత కోల్పోని ఈ కథ దేశంలో మహిళల అభద్రతకు నెత్తుటి సంతకంలా నిలుస్తుంది.

ఎండలతో పాటు ధరలు మండిపోతున్న కథ ’విధ్వంశ దృశ్యం’. సగటు కుటుంబాల ఆర్థిక చిక్కులు, తద్వారా బరువెక్కి మానసిక స్థితిని ఒక పాత్ర చుట్టూ అనేక పాత్రలను తిప్పుతూ సహజంగా చిత్రించారు. మార్కెట్ లో రేట్లు, అమ్మేవాళ్ల మాటలు, కొనేవాళ్ళ అగచాట్లు వీటన్నిటి మాటున మధ్యతరగతి మహిళల జీవన పోరాటం ’ఇరుకిరుకు దారుల్లో నిప్పు కుంపట్లో నడుస్తున్నట్లుగానే ఉంటుంది.’ అదే వరుసలో నడిచే మరో కథ ’ఎద్దు పుండు’. ఇందులో అమ్మేవి మామిడి పండ్లు తప్ప ఎండ ఒకటే. ’అబ్బా ఏమెండ..ఏం తాపం.. ఎర్రగా కాలిన గుండ్రని కమ్ము, ఎర్రటి గుండం రామగుండం’. సీసాలో అమ్మే కృత్రిమ రసానికి అడిగిన ధర పెట్టి, చెట్టు మీది పండు కొనడానికి చేసే అర్థం లేని బేరానికి దెబ్బ తిన్న బతుకుల కథ ఇది. ఈ రెండు కథల్లో పాత్రలు స్వగతంలో వాడే మాటలు రచయిత కథన శైలిని ప్రతిభింబిస్తాయి. ముస్లిం అబ్బాయితో మరో మతం అమ్మాయి పెళ్లి ’ఇలా ఎందుకు జరగకూడదు’ అని కథ ద్వారా ప్రశ్నించారు లక్ష్మీపతి.

ఆఫీసుల్లో కుల వివక్ష ఎంత భయంకరంగా, బాధాకరంగా ఉంటుందో చెప్పే కథ ’అసందిగ్ద కర్తవ్యం’. కులం ఆధారంగా అవకాశాలు ఎలా మారిపోతాయి, దాని కోసం మిగితా ఉద్యోగులపై ఒత్తిళ్లు ఎలా ఉంటాయి అనే అంశంపై రాసిన కథ ఇది. కుటుంబాలతో కలిసి సరదా ప్రోగ్రాంకు వెళ్లినా నరాల్లో పాకినట్లుగా వెంటాడే పై అధికారుల హుకుం ఉద్యోగులను ఎలా మానసిక హింసకు గురి చేస్తుందో ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులోని క్లిష్టమైన కథన రీతి రచయితకు సవాలుగా నిలుస్తోంది. బతుకు తెరువు కుంపటిలో కాలే ముగ్గురు కొడుకుల వెతలను జానమ్మ కేంద్రంగా నడిపిన కథ ’త్రిభుజపు నాలుగో కోణం’. చేద్దామన్నా కూలి దొరకని ఎండిన చెట్టులాంటి ఊరును విడిచి పక్షుల్లా ఎగిరిపోయే కుటుంబాల పరిస్థితుల వర్ణన, కథనం దారిద్య్రానికి చిరునామా చూయించినట్లున్నాయి. కథ చివర్లో మనవడు జానమ్మకిచ్చిన పది రూపాయలు తిరిగి తీసుకొనేప్పుడు అనసూయ దగ్గరున్న అయిదున్నర చిల్లర ఆమె చేతిలో పెట్టాలన్న ఆలోచన పాత్రలకు ఎందుకు తట్టలేదు అనే ప్రశ్న చదువరిలో మిగిలే అవకాశముంది. జెనిటిక్ మాడిఫికేషన్ లక్ష్యంగా సాగే ఫాంటసీ కథ ’అంతానికి ఆదికి నడమ’. 2040 లో మూడో యుద్ధంతో భూమండలం సర్వనాశనం అయ్యాక మంచి బుద్ది గల మనుషుల సృష్టి కోసం సాగే ప్రయోగమిది.

కథలను చాలా మంది చెబుతున్నట్లుగా రాస్తారు. కాని చూపించినట్లు రాసే కథలే నిలుస్తాయి. అదే విధంగా ఈ రోజుల్లో సునాయాసంగా సాగుతూ పొద్దు గడిపే కథలే ఎక్కువ. సగటు పాఠకుడు కూడా వాటికే అలవాటు పడిపోయాడు. ప్రతి పదాన్ని, వాక్యాన్ని కథాసారంలో ముంచి మళ్ళీ మళ్ళీ అలోచించి, పొదిగించి రాసినవి పఠితుని మెదడుని పదును పెడతాయి. వాటిని ఓపిగ్గా చదివితే మంచి కథ చదివామన్న తృప్తి దక్కుతుంది. పాఠకుడిగా స్థాయి కూడా పెరుగుతుంది. అలా కథల ఔన్నత్యాన్ని అందుకొనే దిశగా నడిచే పాఠకుడి అడుగులకు వెలుగు బాటగా నిలుస్తాయి ఆడెపు లక్ష్మీపతి కథలు.

త్రిభుజపు నాలుగో కోణం
ఆడెపు లక్ష్మీపతి కథలు
పేజీలు 220 , వెల : రూ.250/-
ప్రచురణ : అన్వీక్షకి పబ్లిషర్స్ ప్రై. లి. హైదరాబాద్.
ప్రతులకు: అన్వీక్షకి, 9705972222

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News