న్యూయార్క్: శృంగార తారతో సంబంధం వెల్లడి కాకుండా ఉండేందుకు ఆమెకు డబ్బు చెల్లించి అనైతిక ఒప్పందం చేసుకున్న కేసులో డొనాల్డ్ ట్రంప్‌పై నేరారోపణలు దాదాపు రుజువయ్యాయి. అయితే ఆయన అరెస్టుకు కోర్టు ఆదేశాలు ఇచ్చేందుకు ముందే తానే స్వచ్ఛందంగా కోర్టులో లొంగిపోవాలని, ఆరోపణలపై విచారణకూ హాజరు కావాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ట్రంప్ తరఫు లాయర్(అటార్నీ) జోయ్ టాకోపినా ఓ ప్రకటన చేశారు. ట్రంప్ వచ్చే వారం మాన్‌హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయంలో లొంగిపోయే అవకాశం ఉందని జోయ్ తెలిపారు. మరోవైపు ట్రంప్ లీగల్ టీమ్ కూడా ప్రాసిక్యూటర్‌తో టచ్‌లో ఉందని వినికిడి.
లైంగిక స్కాండల్ కేసులో దోషిగా తేలినప్పటకీ 2024 అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్ వేసిన బిడ్‌పై అనర్హత వేటు పడదు. ఎందుకంటే గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికలకు ట్రంప్ తన అభ్యర్థిత్వ పత్రాలను దాఖలు చేశారు కనుక. అయితే ఇది ఆయన కెరీర్‌లో మచ్చగా మిగిలిపోవచ్చని విశ్లేషకులంటున్నారు.
తనతో ఉన్న లైంగిక సంబంధాన్ని బహిరంగపర్చకుండా ఉండేందుకు స్టార్మీ డేనియల్స్ అలియాస్ స్టెఫానీ క్లిఫార్డ్ అనే అశ్లీల నటితో ట్రంప్ ఒప్పందం చేసుకున్నాడు. అందుకు ఆమె లక్షా 30 వేల డాలర్లను ముట్టజెప్పాడు. ఇది 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగిన విషయం. అయితే రెండేళ్ల తర్వాత ఆమె మీడియా ముందు ట్రంప్‌తో తనకు శారీరక సంబంధం ఉందని, తమ మధ్య ఉన్న నాన్ డిస్‌క్లోజర్ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ లాస్ ఏంజెల్స్ కోర్టులో ఆమె దావా వేసింది. దీనిపై ఉన్నత దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఆరోపణలు రుజువు కావడంతో, ట్రంప్‌పై ఇప్పుడు నేరారోపణలు నమోదయ్యే అవకాశాలున్నాయి.
2018లో ‘ఫుల్ డిస్‌క్లోజర్’ అనే పుస్తకం ద్వారా ట్రంప్‌తో తనకున్న పరిచయం, ఇతర విషయాలను స్టార్మీ డేనియల్స్ వెల్లడించింది. 2018లో ఓ అంతర్జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూ ద్వారా అనేక సంచలన విషయాలు ఆమె వెల్లడించింది. ఇదిలావుండగా ఈ ఆరోపణలను ట్రంప్ రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. దీనిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.