Sunday, December 22, 2024

భద్రాచలం స్థల పురాణ కథ..

- Advertisement -
- Advertisement -

Story About Bhadrachalam Temple History

మన తెలంగాణ/హైదరాబాద్: దక్షిణాది అయోద్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీరామనవమి సందర్భంగా భక్తులతో పోటెత్తనుంది. అందుకు రెండు శాస్త్రీయ కారణాలున్నాయని అర్చకులు చెబుతున్నారు. అవే రాములవారిపై ప్రజలకున్న భక్తి, భద్రాచల స్థల పురాణ శక్తి. దైవ దర్శనానికి సుదూర ప్రాంతాలకు భక్తులు తరలిరావడం వల్ల ఆయా దైవ స్థలాలలో మంత్రోఛారణ హోరు వల్ల సానుకూల శక్తి ఏర్పడుతుంది. ఆ దివ్యశక్తి భక్తుల జీవితంపై శుభ పరిణామాలు కలిగే విధంగా ప్రభావం చూపిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు తెలిపారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో వచ్చే శుక్లపక్ష నవమిని శ్రీరామనవమిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా తెలంగాణలో భద్రాచలం రాములవారి ఆలయంలో సీతారామకళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. అక్కడికి దేశ విదేశాల నుండి భక్తజనం భారీగా తరలి వచ్చి సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుండి భద్రాచలం రావడానికి కారణం అక్కడి స్థల పురాణ మహిమ అని చెప్పవచ్చు. వాల్మీకి రామాయణంలో భీజ ప్రాయంగా భద్రాచల స్థల పురాణాన్ని వేదవ్యస మహర్షి బ్రహ్మపురాణంలో వివరించారు. ఆ స్థల పురాణ కథను అర్చకులు క్లుప్తంగా తెలిపారు.
వనవాసానికి వచ్చిన సీతారాములకు లక్ష్మణుడు అటవీ ప్రాంతంలో దొరికిన వెదురు కర్రలతో అందమైన కుటీరాన్ని నిర్మించాడు. ఆ కుటీరమే ‘పర్ణశాల’గా ప్రాచుర్యం పొందింది. కొద్దిరోజుల పాటు ఆ పర్ణశాలలో సీతారాములు సంతోషంగా నివసించారు.. శ్రీరాముని వనవాస సమయంలోనే భద్రుడనే భక్తుడు జన్మిస్తాడు. భద్రుని తపః ప్రభావం వల్లనే భద్రాద్రి క్షేత్రం వెలసిందిని పురాణాలు చూబుతున్నాయి. భద్రుడు విష్ణుమూర్తికి పరమ భక్తుడు. ఆయన సాక్షాత్కారం కోసం కఠోరమైన తపస్సు ఆచరిస్తే, శ్రీరాముని రూపంలో విష్ణుమూర్తి భద్రుడికి దర్శనమిస్తాడు. తదనంతరం భద్రుడు గోదావరీ నదికి అభిముఖంగా ఒక ప్రదేశంలో పర్వత రూపంగా మారిపోతాడు. ఆ స్థలమే భద్రాచలం. తన హృదయ స్థానంలో రాముడు కొలువయిన ఆ పర్వతానికి భద్రాద్రి అనీ, ఆ స్థలానికి భద్రాచలం అనీ పేరు వచ్చింది.
భద్రాద్రిలో భారీ ఏర్పాట్లు:
ఈఏడాది ఏప్రిల్ 10న సీతారాముల కళ్యాణం, 11న పట్టాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 16 వరకు జరుగనున్న శ్రీరామనవమి మహోత్సవాలకు దేశ విదేశాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరానున్న సందర్భంగా భద్రత, వైద్య సదుపాయాలుండేందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా భద్రాచలం మిథిలా స్టేడియంలో షామియానాలు, చలువ పందిళ్లుతో పాటు భక్తులకు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఆరోగ్య భద్రత దృష్ట్యా పైప్ లైన్ల ద్వారా విరజిల్లే ఫోమ్ శానిటైజర్లను అధికారులు ఏర్పాటు చేశారు. మరోపక్క వాల్ రైటింగ్స్‌తో పాటు హోర్డింగ్‌లు, ప్లెక్సీలు, భద్రాచలం దగ్గరలో కూనవరం రోడ్డు, చర్ల రోడ్డు, బ్రిడ్జి సెంటర్ లలో స్వాగత ద్వారాలూ, భక్తులకు ఆన్‌లైన్ లో టిక్కెట్ల విక్రయం, బస చేయడానికి రూముల కేటాయింపు తదితర ఏర్పాట్ల మీద అధికారులు దృష్టి పెట్టారు. ఒక్కో టిక్కెట్ ధరను 150 రూపాయల నుంచి 7,500 రూపాయల వరకు నిర్ణయించి ఆన్ లైన్ లో అమ్మకాలు చేపడుతున్నారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి వల్ల భద్రాచలంలో సీతారామకళ్యాణ మహోత్సవం తక్కువ మంది భక్తులతో ఎన్నో ఆంక్షలకు లోబడి జరిగింది. అయితే ఈసారి కోవిడ్ తాకిడి తగ్గడం వల్ల శ్రీరామనవమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Story About Bhadrachalam Temple History

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News