Tuesday, December 17, 2024

కులం అంతు చూద్దామా?

- Advertisement -
- Advertisement -

నేను విప్లవకారుణ్ణి. అన్ని దేశాలూ నావే. నిజమైన విప్లవకారుడు ఓ అద్భుతమైన ప్రేమికుడై వుంటాడని నేను చెప్తే మీకు కాస్త ఆశ్చర్యంగానే వుండొచ్చు. కాని, ప్రేమించే గుణాన్ని కోల్పోయిన వాడు ఎన్నటికీ గొప్ప విప్లవకారుడు కాలేదు. ప్రపంచంలో ఎక్కడ ఎవరికీ అన్యాయం జరిగినా మనం గాఢంగా ప్రతిస్పందించడం చాలా అవసరం. ప్రతి వారికీ వుండి తీరాల్సిన అద్భుతమైన లక్షణం అదే! చేగువేరా

కర్నూలు జిల్లాలో కులరక్కసి కరాళ నృత్యం చేస్తోంది. కెవిపిఎస్ ఆధ్వర్యంలో జరిగిన సర్వేలో వళ్ళు గగుర్పొడిచే నిజాలు బయటపడ్డాయి. సుమారు ఎనభై తొమ్మిది గ్రామాల్లో పదిహేను రకాల కుల వివక్షలు కనిపించాయి. అరవై నాలుగు గ్రామాల్లో దళితులకు దేవాలయ ప్రవేశం లేదు. ముప్పయి గ్రామాల్లో దళితులు రచ్చబండపై కూర్చోవడానికి వీల్లేదు. ఇప్పటికీ అక్కడ ఏడు గ్రామాల్లోని టీ కొట్లలో రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతూ వుంది. ఆరు గ్రామాల్లో దళితుల్ని హోటళ్ళలోకి అసలే అనుమతించరు. ఇరవై ఏడు గ్రామాల్లో చాకలి వారు దళితుల బట్టలు ఉతకరు. తొమ్మిది గ్రామాల్లో క్షురకులు దళితులకు క్షవరం చేయరు. ఈ పనుల కోసం వారు సమీపంలోని పట్టణాలకు వెళుతున్నారు.

“జుట్టు కత్తిరించడం మంగలి పవిత్రమైన ధర్మం కాదు. ఇది ఒక వ్యాపారం. చెప్పులు కుట్టడం మాదిగ వాడి పవిత్ర ధర్మం కాదు. అది కూడా వ్యాపారమే. ప్రదర్శించే పూజలు, హోమాలు, ఉత్సవాలలో కూడా అదే జరుగుతోంది. ఇది బ్రాహ్మణుడి పవిత్రమైన ధర్మమేమీ కాదు. అలా అనుకోవడం మన అజ్ఞానం. మన అజ్ఞానం మీదే బ్రాహ్మణుడికి తిని కూర్చునే పెద్ద వ్యాపారం జరుగుతూ వుంది!” అని అన్నారు మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఆధునికులుగా మనకు తోచికపోతే పోయింది. కనీసం కొందరు మహానుభావులు చెప్పిన దాంట్లోంచి సారాంశమైనా గ్రహించాలి కదా? ఇదే విషయం మీద డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఏం చెప్పారో గమనించండి “బ్రాహ్మణులు, క్షత్రియులు, షేక్‌లు, సయ్యద్‌లు పెద్ద కులాలకు చెందినవారు. కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, సాలె, మాల, మాదిగలు చిన్న కులాలవారు. వీరి సంఖ్య 90 శాతం దాకా వుంది.

కుల భేదాల వల్ల వీరి మేధస్సు బందీ అయిపోయింది. వీరికి పైకి తెస్తే తప్ప, దేశ పునర్నిర్మాణం జరగదు. కాళ్ళూ, చేతులూ కదిలించకపోతే శరీరానికి పక్షవాతం వచ్చినట్లు దేశానికీ పక్షవాతం వచ్చింది. దేశంలోని ఈ 90 శాతం ప్రజలకు రెండు వేల సంవత్సరాలుగా పక్షవాతం వచ్చింది. సమాజంలో వీరిని ఎక్కడికక్కడ పాతరవేసి స్థిరపరిచారు. కదలిక లేకుండా చేశారు. బానిసత్వానికి మూల కారణం ఇదే. ఇప్పటికైనా మారకపోతే మరోసారి బానిసలమయ్యే ప్రమాదముంది” ఇలాంటి హెచ్చరికల్ని మనం ఇప్పటికైనా పట్టించుకోవాలా? వద్దా? ఇరవై ఒకటవ శతాబ్దపు అత్యాధునికులమని గొప్పలు పోవడం కాదు, అందుకు తగిన విధంగా ఆలోచనా సరళిని మార్చుకోవాల్సి వుంది.

మంత్రాలయ మఠంలో చదువుకొన్న దళితులైనా సరే, కేవలం ఊడ్చడానికే అర్హులు! ఆ పని తప్ప మరో పని చేయనివ్వరు. బిల్లులు రాయడానికి గానీ, రిసెప్షనిస్టులుగా పని చేయడానికి గాని వారికి అవకాశమివ్వరు. అక్కడ వారు చదువుకున్న చదువు వృథా కావాల్సిందే! కొన్ని ఊళ్ళలో దళితులు మోటారు వాహనాలపై తిరగకూడదు. పెళ్ళి ఊరేగింపులు సైతం వాహనాలపై చేసుకోగూడదు. కాలి నడకన వెళ్ళాల్సిందే. మంచి నీటి బావుల్లోకి సైతం దిగనివ్వరు. బావిలోంచి నీరే తోడుకో నివ్వనప్పుడు ఒక నీళ్ళలోకి దిగి పనులు చేయనిస్తారా? దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేయడమన్నది ఊహకు అందని విషయం.

మంత్రాలయ మండలంలోని బసాపురంలో పెత్తందార్ల కార్లు వెళుతూ వుంటే ఎంతటి విద్యావంతులైనా, దళితులైనా సరే టక్కున లేచి నిలబడి వంగి నమస్కారం పెట్టాల్సిందే. కర్నూలు మండలం దేవమడ గ్రామంలోనూ ఇంకా కొన్ని చుట్టు పక్కల గ్రామాల్లోనూ గ్రామ వాలెంటీర్‌లు దళితుల ఇళ్ళకు వెళ్లరు. వాళ్ళనే తమ ఇళ్ళకు పిలిపించుకొంటారు. ఊళ్ళని ప్రతి ఇల్లూ తిరగడమన్నది గ్రామ వాలంటీర్ల ఉద్యోగ ధర్మం. దాన్ని పక్కన పెట్టి వ్యవహరించడం ఎంత తప్పు? అయితే వారిని అడిగే వారు లేరు. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇంతటి వివక్ష కొనసాగుతూ వుందంటే మనుషులుగా మనమంతా తలవంచుకోవాలి. అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేస్తున్నామని గొప్పగా చెప్పుకొనే ప్రభుత్వోద్యోగులు, పరిపాలకులు సిగ్గుపడాలి!

కర్నాటకలో కొప్పల్ జిల్లా మయాపూర్ గ్రామంలో అగ్రవర్ణం వారు దళిత కుటుంబానికి ఇరవై అయిదు వేలు జరిమానా విధించారు. ఎందుకంటే ఒక దళితుడు గుడి బయట నిలబడి, కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకొంటున్నాడు ఆ సమయంలో వెంట వున్న అతని రెండేళ్ళ కొడుకు గబుక్కున గుళ్ళోకి వెళ్ళిపోయాడు. తను దళితుడినని, తను గుళ్ళోకి వెళ్ళకూడదని ఆ పసివాడికి తెలియదు. ఆ రోజు ఆ పసివాడి పుట్టిన రోజు. అందుకే వాణ్ణి తీసుకొని తండ్రి గుడికి వెళ్ళాడు. వాణ్ణి చల్లగా చూడమని కోరుకొంటూ ఆ దళితుడు దండం పెట్టుకుంటూ వుండగా.. ఆ “ఘోర ప్రమాదం” జరిగిపోయింది. ఒక దళితుడు గుళ్ళోకి జొరబడ్డాడని, గుడి మైల పడిందనీ, దాన్ని ప్రక్షాళన చేయాలని అందుకు రూ. 25 వేలు ఖర్చు అవుతుందనీ పూజారులు బెదిరించారు.

తనకు అంత శక్తి లేదని, తను ఒక నిరుపేదనని దళితుడు ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది. అగ్రవర్ణ అహంకారం తగ్గలేదు. పెద్ద గలాటా జరిగింది. ప్రభుత్వాధికారుల చొరవతో విషయం సద్దుమణిగింది. ఇంగిత జ్ఞానం లేక, మనవత్వం లేక మనుషులు ప్రవర్తిస్తున్నప్పుడు గోరుతో పోయేది గొడ్డళ్ళ దాకా వస్తుంది. ఇది 2021 సెప్టెంబర్ సంఘటన. ఇలాంటి సంఘటనే తమిళనాడులో జరిగింది. ఒక గుళ్ళోకి దళిత మహిళను రానియ్యలేదు. ఆ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌కు తెలిసింది. వెంటనే ఆ గుడికి సంబంధించిన ఇరవై మంది పూజారుల మీద ఎస్‌సి, ఎస్‌టి చట్టం కింద కేసు పెట్టించి వారిని జైలుకు పంపాడు. ఇతర రాష్ట్రాలలో కూడా అలా చేయగలిగే అవకాశం ఆయా మంత్రులకు, ముఖ్యమంత్రులకు వుంటుంది. రాజ్యాంగం గురించి అందరూ గొప్పగా మాట్లాడుతారు కాని, ఎవరైనా అలా చేస్తున్నారా?

మహిళల అభ్యున్నతికై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్త్రీలకు బస్సు ప్రయాణం ఉచితం చేశాడు. ఒక రోజు కన్యాకుమారి జిల్లా వాణీయం కుడి గ్రామానికి చెందిన సెల్వం అనే డెబ్బయేళ్ళ మహిళ తన చేపల బుట్టతో బస్సు ఎక్కింది. చేపలు వాసన వస్తున్నాయంటూ కండక్టర్ బలవంతంగా ఆమెను బస్సు నుంచి దింపేశాడు. అవి నిలువ చేపలు కావని, ఆ రోజు పట్టినవేనని, చేపలన్నాక కొంచెం వాసననొస్తాయనీ, అయినా తను ఎక్కువ దూరమేమీ రావడం లేదని ఆ వృద్ధురాలు ఎంత మొత్తుకున్నా కండక్టర్ వినలేదు. ‘పాపం పోనీయండి’ అని తోటి ప్రయాణికులు చెప్పినా అతను వినిపించుకోలేదు. బలవంతంగా దింపేశాడు. ఆమె కుళచ్చళ్ బస్టాండ్‌లో అందరికీ తనకు జరిగిన అన్యాయం చెప్పుకొంది. ఆనోటా ఆనోటా అది సోషల్ మీడియా కెక్కింది. రవాణా శాఖ అధికారులకు, తర్వాత ముఖ్యమంత్రికీ తెలిసింది. ఆ వృద్ధురాలి హక్కును కాదన్నందుకు ఆ బస్సు కండక్టర్, డ్రైవర్‌లను సస్పెండ్ చేశారు స్టాలిన్.

అణగారిన వర్గాలకు ఎక్కడికక్కడ న్యాయం జరగాలంటే చిత్తశుద్ధి వున్న నాయకులు రావాలి. ఉట్టి ‘భాషణ్’లిచ్చే నాయకులు వృథా కదా మిత్రోఁ? మనుస్మృతి ప్రకారం మహిళలందరూ శూద్రులే. మహిళలకు పుట్టిన వారంతా శూద్రులే అవుతారు కానీ, మళ్ళీ అందులో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఎలా పుట్టగలరూ? పుట్టిన వాళ్ళందరూ శూద్రులే అయినప్పుడు అగ్ర నిమ్న వర్ణాలెందుకూ? ఇదంతా బుద్ధి తక్కువ వ్యవహారంగా అనిపించడం లేదూ? అది అలా వుండనిచ్చి మరొక విషయం చూద్దాం. హిందూ దేవుళ్ళలో బ్రాహ్మణులు లేరు. అధిక భాగం క్షత్రియులే. అలా అయినప్పుడు బ్రాహ్మణ వర్గానికి మొదటి స్థానం ఎవడిచ్చాడు? ఇదంతా కాదు మహిళలు శూద్రులయినప్పుడు, వున్న జనాభా అంతా శూద్రులే, అందరూ సమానులే. విజ్ఞాన శాస్త్రం అదే చెప్పింది.

మానవ జాతి అంతా ఒక్కటే కాబట్టి, అందరూ సమానులే అని అంది. మనుధర్మ శాస్త్ర ప్రకారం కూడా మనుషులంతా సమానులే అని మనం అర్థం చేసుకోవాలి. మనమంతా బాల్యంలో బాలకులం. యవ్వనంలో యువకులం, వృద్ధాప్యంలో పండుటాకులం అంతే! మనువును తిరస్కరిస్తేనే ఎవరికైనా కాస్త బుద్ధి జ్ఞానం పెరుగుతుంది. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక పెద్దాయన పక్కనున్న యువకుణ్ణి ఊహించని ప్రశ్న అడిగాడు. మీ కేస్టు ఏమిటీ అని! యువకుడు అందగాడే కాదు తెలివైన వాడు కూడా. విషయం గ్రహించి వెంటనే ‘సాఫ్ట్‌వేర్’ అండీ అన్నాడు. “భలే జోకులేస్తావు బాబూ. నేను అడిగింది వేరు. నువ్వు చెప్పేది వేరు. పోనీ, మీ నాన్న గారి కులమేమిటీ” అని మళ్ళీ అడిగాడు పెద్దాయన.
“ఆయనా? ఆయన ఎలెక్ట్రికల్ అండీ” అన్నాడు యువకుడు.
“పోనీలే నీకు చెప్పాలని లేనట్లుంది! ఈ మధ్య ఏమిటో కుర్రవాళ్ళు చిత్రమైన జవాబులు చెపుతున్నారు. కులం చెప్పుకుంటే నామోషీయేమో” అని ముఖం మాడ్చుకొని, ముఖం కూడా తిప్పుకొన్నాడు. “మీరు పెద్దవారు. మీకు తిక్కతిక్కగా సమాధానాలు చెప్పాలని నాకు లేదు. విషయమేమిటంటేనండీ … భగవద్గీతలోని నాలుగో అధ్యాయంలో పదమూడవ శ్లోకం ఒకసారి నెమరు వేసుకోండి. మీకే అర్థమవుతుంది!” అన్నాడు.

“అవునూ ఏముంది అందులో?” ఈ కుర్రాడికి గీతలోని విషయాలు కూడా తెలుసా? అని ఆశ్చర్యపోతూ అడిగాడు.
“గుర్తు లేకపోతే ఫరవాలేదు. ఇంటికెళ్ళాక చూసుకోండి!” నవ్వుతూ బదులిచ్చాడు యువకుడు.
“సరే బాబూ చెబుదూ అందులో ఏముందో” అన్నాడు పెద్దాయన.
“ఏముందంటే కులమనేది పుట్టుకతో కాదు, చేసే వృత్తితో వస్తుంది అని వుంది. దాని ప్రకారమే చెప్పానండీ. అంతే మిమ్మల్ని ఆటపట్టించాలని కాదు మీకేమో కోపం వచ్చేసింది” అని నవ్వు కొనసాగించాడు. పెద్దాయనకు ఎక్కడో కలుక్కుమంది. ‘జ్ఞానం వయసు పెరిగితే రాదు బుద్ధి పెరిగి తేనే వస్తుందని అప్పుడే తెలుసుకొన్నాడు. పాత తరహాలో ఇక మాట్లాడకూడదని కూడా అనుకున్నాడు.

మనుస్మృతి ప్రకారం (త్రిన్ష: 9/93) పురుషులు 2430 ఏళ్ళ వయసులో 812 ఏళ్ళ వయసులో వున్న బాలికల్ని పెండ్లి చేసుకోవాలి ఇదే కాదు 34 ఏళ్ళ బాలికలకు 78 ఏళ్ళ బాలురకు కూడా పెళ్ళిళ్ళు చేసిన ఆచారం ఈ దేశంలో కొనసాగింది. మరి సమకాలీనంలో దాన్ని కొనసాగించడం లేదు కదా? అందుకే సంప్రదాయం ముసుగులో పనికి రాని ఆచారాల్ని వదిలేయాలి. అన్నీ ఆలోచించే డా. బి.ఆర్. అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చేశాడన్న విషయం గుర్తుంచుకోవాలి!

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News