Wednesday, January 22, 2025

ప్రతి మనసుకూ దగ్గరయ్యే..

- Advertisement -
- Advertisement -

హీ ఈజ్ .. బ్రాండ్ ఆఫ్ శాయరీ/ కవిత్వాన్ని ఇంత అందంగా చెప్పడం ఆయనకే సాద్యం/ మనిషితనం, యవ్వనం, గాయం జ్ఞాపకం అన్ని కవిత్వం చేస్తారు/ అది అత్మాశ్రయంలా కనపడుతుంది కానీ/ అత్యంతగా ప్రతి మదికి ఆశ్రయమిచ్చిన తత్వం…/ ఆయన తాజా కవిత్వ సంపుటి సైతం.. తన సహజశైళిలోనే మనసుల్ని పిండి దండెం మీద ఆరేసింది… ప్రతివాక్యం మనసుగుండా గుండెలోకి ఇంకింది…/ కవి ఏంచేస్తాడు అంటే తీరని వేదనను అన్వేషించి మనలో స్పందనను కలిగిస్తారు../ ఈ కవి అంతే / ప్రతి మజిలీని కవిత్వం చేస్తారు/ కుంచె కదిలితే చిత్రం అయినట్టు/ఈయన గాయం మనల్ని మెలిపెడుతుంది/బలే వుందే అనిపిస్తోంది/ఇంకాస్త ఉంటే బాగుండని/ ఇంతే ఉందా అని/ఇలా ఎలా రాస్తారని చాలా చాలా అనిపిస్తోంది…

మిగతా కవులకు/ఈయన కవిత్వానికి తేడా ఏమిటి అంటే/ లోపాల్ని కూడా లోపాయకారి గా చెప్పడం/ పసితనాన్ని వృద్ధాప్యాన్ని ఒకే తరాజులో తూయడం మనుషుల్ని ప్రేమించడం/బ్రతకడం/బ్రతికించడం/ మోసపోవడం/ మోసాన్ని తెలుసుకోలేక పోవడం/ఒక్కటేమిటి/ ప్రతిదీ ఆయన పదాల్లో ఒదిగిపోతుంది/ఈయనేమి మామూలు కవి కాదు నిబద్దత, దృక్పథాన్ని ఎరిగిన కవి… ఆయన కవిత్వంలో ఇంద్రధనస్సుని మించిన రంగులు ఉంటాయి/ కలలకు మించిన ఊహలు ఉంటాయి/ నిజాన్ని మించిన నిట్టూర్పులు ఉంటాయి/ఆయన అంతలా నలిగిపోయినందుకేమో/ ఇంత అమృతాన్ని మనకు పంచి ఇస్తున్నారు… ఇంతకూ ఇదంతా ఏ పుస్తకం గురించి అనేగా మీ అనుమానం…

అవును ఈ మద్యే వచ్చిన ‘నన్ను నేను దగ్గరగా చూసాను‘ పుస్తకం గురించి ఈ సమీక్ష…. ‘రన్నింగ్ బస్ ఎక్కబోయి టిఫిన్ బాక్స్ పారేసుకున్న ఉద్యోగి పచ్చడి మెతుకుల్లా కిరణాల రంగు మెరిసి మెట్ల మీద ఒలికింది‘ (ఖాళీ సీసా లోడు)
‘పెంపుడు జంతువుల్లా యెప్పుడు ఈ కష్టాలు నా వెంటే ఉంటాయి‘ (రంగులోడు)/ ‘మనసుని తడిపే చినుకుల్ని ఇంకిపోకుండ ఏరుకోడం మంచిది ‘,(సీతాకోక చిలుకలు తిరిగే రాత్రి)‘ప్రయాణం దూరమైనా దగ్గరైనా/ దీపం లేని చీకట్లో/ జీవితం తీరాన్ని వెతుకుతుంది‘(ఆకురాలిన కాలం)/ ‘స్వేచ్ఛ ఉన్న చోటనే సౌందర్యముంటుంది/ ఊపిరి ఆడే దారిలోనే పరిమళం వీస్తుంది ‘(సగం సగం నీడలు)/ ‘బయటకు ఎంత విరగబడి నవ్వినా/ లోపలి బాధ తగ్గడం లేదు/ ఎన్ని గాయాలు చేస్తారో చేయనీ నవ్వుతూ బ్రతకడమే నాకున్న అందం‘(చెల్లా చెదురైన క్షణాలు) ‘నా మాతృ భాష ఒక ఆయుధం/అది నేను గెలవడానికి గొప్ప ధైర్యం నేను నడవడానికి ఒక అద్భుత దీపం ‘(,తల్లి దీవించు)

‘ఇంకా దీపం వెలిగించనే లేదు/ అప్పుడే బొంగురు గొంతుతో/ గాయం మాట్లాడటం మొదలు పెట్టింది‘(గిఫ్ట్)/ ‘తాగిన నిషాలో/ దీపాలు పడేసేవాళ్ళతో భయం లేదు / ఇంకా నిషా కోసం దీపాలు ఆర్పేసే వాళ్ళతో జాగ్రత్తగా వుండాలి ‘(నాకు మామూలుగా చదువే సరిగా రాదు)

‘ఎన్నిసార్లు చదివానో/ఎన్నిసార్లు మూసిపెట్టానో/తల్వార్ లాంటి వాక్యం/నా కళ్ల మీద వేలాడుతూనే ఉంది‘/ (మడిచి పెట్టిన పేజీ)/‘అప్పుడప్పుడు ఎవరూ లేనప్పుడు/ తెగిపోయిన సితారు తీగల మీద /ఎండిన రక్తం మరకల్ని కడిగేస్తుంటాను‘ /(పహాడీ రాగంలో కొట్టుకుపోతాను) ‘బండరాళ్ల కన్నా/ కోరికల బరువే ఎక్కువ/తక్కువ మూట కట్టుకోవాలి/అలసిపోయినప్పుడు/మధ్యలో దించుకోవటానికి వీలుంటుంది‘/ (ఒక వచ్చి పోయే దారి)/ ‘కిటికీ తెరచి చూసాను/ఎప్పటి నుండి నిలుచుందో ఆమె/మసక మసక గా కనిపిస్తోంది ‘/(ఇన్ని యుగాల రాత్రి)/‘గాయం కట్టు విప్పినా/గిల్లుకోవద్దునుకుంటూనే /మిగిలిన మచ్చను/ పదిసార్లు తడుముకుంటాం/‘ (మరచిపోయి)/ ‘అంతా కుదుట పడ్డాక/ ఒంటరి ప్రయాణం మరచిపోయి/విరగబడి నవ్వుకోవడానికి/ఒక మనిషి కావాలి ‘/ (ఇప్పుడు ఇక్కడ)/ ‘నిన్ను చూపెట్టమని/ఎవరైనా సభలో లేచి అడిగితే/నా కళ్ళలో ఉన్న నిన్ను/ఇంతమందికి ఎట్లా చూపించాలి‘/(నీవు నాకు గుర్తుంటావూ)/ ‘ఎంత దూరం నుండీ వస్తుందో/ఈ సమయానికి అలుపు ఉండదు ‘

(నిలకడలేని నిమిషాలు)
పైనదంతా వచన కవిత్వం/ కవిత్వం జీవితం నుండే పుడుతుందని చెప్పడానికి ఈ వాక్యాలు మనకు ఎన్సైక్లోపీడియాలు అవుతాయి…
ఆయన కవిత్వంలో గోడల్లేని కిటికీలు ఉంటాయి, రెక్కల్లేని రాత్రులు ఉంటాయి, గరుకుగా ఒరుసుకునే గాలులు ఉంటాయి, తడితడి స్వప్నాలు ఉంటాయి, అడ్రస్ పోగొట్టుకున్న ప్రేమికుడు ఉంటాడు, చాయ్ తాగే సమయాలుంటాయి, ఎవరైనా పిలిస్తే పలికే సందర్భాలు ఉంటాయి… వచ్చిపోయే దారులుంటాయి, చుడువావాలాలుంటారు, బాసండ్లామెలు ఉంటారు… ఎండలో తడిసిపోయే నీడలు ఉంటాయి…

మొత్తంగా కవిత్వం వుంటుంది, జీవితం వుంటుంది. జీవిత పరమార్ధం ఉంటుంది,బ్రతకడం ఎలాగో వుంటుంది…
1998 లో వచ్చిన తడిగీతాన్ని చదివిన నేను, ఆయన పుస్తకాలు ఇదేదో నెమలి నీడలా ఉంది, షాయర్ సాబ్, నన్ను నేను దగ్గరగా చూసాను పుస్తకాలూ చదివాను…

ఆయన వయసు పైబడింది కానీ ఒక్క వాక్యం కూడా ముసలిది అవ్వలేదు…
అదే పడుచు దనం, అదే చురుకుదనం ….అదే ఆత్మపరిశీలన.. అదే అద్భుతమైన అంతర్వాహిని … ఆయన కవిత్వం ఎప్పుడు శిథిలం కానీ ప్రేమ గీతమే/జనం కళ్ళలో స్వేచ్ఛని చూడడమే జీవితం అనే ఈ కవి తాపత్రయం అంతా మానవత్వమే…/ఆయన ప్రేయసికి వీడ్కోలు పలికినా వర్షానికి ఆహ్వానం పలికినా అంతే అందంగా ఉంటుంది…/అలాంటి కవి ఆయన్ను అయన దగ్గరగా చూసుకొని రాసుకున్న కవిత్వం ఇది.. అందుకే చాలా బావుంది.. /ఇంకా ఎన్నో కవిత్వ సంపుటిలు రావాలని కోరుతూ /107 కవితలని బహు నిర్వచనీయం గా రాసిన వారికి అభినందనలు తెలుపుతూ…

సుభాషిణి తోట- 9502818774

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News