Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్ అవతరణ క్రమం

- Advertisement -
- Advertisement -

Story about CM KCR launches national party

‘జాతీయ పార్టీని ప్రారంభించాలన్నది తొందరపాటు నిర్ణయం కాదు’ అని టిఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ప్రకటించారు. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయికి విస్తరించడంతో పాటు, త్వరలోనే జాతీయ స్థాయి పార్టీగా గుర్తింపు పొందే ఉద్దేశంతో విజయ దశమి పర్వదినం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ‘భారత రాష్ట్ర సమితి’ గా మారుస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఆయన ఈ మాటలన్నారు.. కెసిఆర్ అన్న మాటలు నూటికి నూరు పాళ్లు నిజం. భారత రాష్ట్ర సమితి అవతరణకు ముందు జరిగిన పరిణామాల క్రమం ఈ విషయాన్ని నిరూపిస్తుంది. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న కెసిఆర్ కృతనిశ్చయం కొంతమంది అంటున్నట్లుగా రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు, దాదాపు నాలుగున్నరేళ ్లక్రితం వచ్చిన గంభీరమైన ఆలోచనకు ఇచ్చిన కార్యరూపం అది. 2018 మార్చి 3న ప్రగతి భవన్‌లో తన అధికారిక క్యాంప్ కార్యాలయంలో పెద్ద సంఖ్యలో హాజరైన మీడియా ప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతూ ప్రధాన జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బిజెపిల పట్ల ప్రజల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా రగులుకుంటోందని, ఫలితంగా స్తబ్దుగా మారిన దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని మొట్టమొదటిసారిగా ఆయన బలంగా వాదించారు.

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు ఆ సందర్భంగా కెసిఆర్ స్పష్టమైన సంకేతాలనిచ్చారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ఉంచడానికి తాను త్వరలోనే ఒక జాతీయ అభివృద్ధి అజెండాతో ముందుకు వస్తానని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఈ దిశగా ముందుకు వెళ్లడం కోసం సిఎం కెసిఆర్ వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపుణులతో, జాతీయ స్థాయిలో రాజకీయ ప్రముఖులతో వర్చువల్‌గా, ముఖాముఖి పలు సంప్రదింపులు జరిపారు. వివిధ సంస్థలు, సంఘాలు, వ్యక్తులు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్‌లాంటి రిటైరయిన ఆలిండియా సర్వీస్ అధికారులు, న్యాయ కోవిదులు, న్యాయవాదులు, రైతు సంఘాలు, అన్ని రాష్ట్రాలకు చెందిన ఉద్యోగ సంఘాలు, ఆర్థిక వేత్తలు, మాజీ ఆర్థిక కార్యదర్శులు, మీడియా సంస్థలు, జర్నలిస్టులు, పారిశ్రామిక సంస్థలు, కార్మిక సంఘాలు లాంటివి వాటిలో ఉన్నాయి. భావసారూప్యం కలిగిన బిజెపియేతర, కాంగ్రెసేతర పార్టీల నేతలను కలవడం కోసం, దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావలసిన అవసరాన్ని వివరించి మద్దతు కూడగట్టడం కోసం కెసిఆర్ పలు రాష్రాలకు వెళ్లారు. ఫలితంగా త్వరలోనే రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కెసిఆర్ ఇచ్చిన పిలుపు ప్రజల ఆకాంక్షల్లో ప్రతిధ్వనించడం మొదలైంది.

మేధావులు, రాజకీయ వేత్తలు, మీడియా తదితర వర్గాల్లో జాతీయ స్థాయి చర్చకు తెరదీసింది. విజయవంతమైన తెలంగాణ తరహా అభివృద్ధిని తన ఆలోచనల్లో కలిగి ఉన్న కెసిఆర్ ఒక రాజనీతిజ్ఞుడుగా భారత్‌ను కూడా అదే రీతిలో గొప్ప దేశం గా అభివృద్ధి చేయాలని కలలు కన్నారు. కెసిఆర్ చెప్పినట్లుగా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం, దేశం ఎక్కడ వెనుకబడిందో అర్థం చేసుకోవడానికి ఒక విధానపరమైన విధి విధానాలను రూపొందించడం ఇప్పుడు అత్యవసరం. సామాజిక, న్యాయ, చట్టసభలు, పరిపాలనా రంగాల్లో నిర్మాణాత్మక మార్పులు అవసరం. ‘ప్రజలను సంఘటితం చేయడం నిర్మాణాత్మక మార్పు కోసం ప్రచారం చేసే బృందం ముందుండాల్సిన జాతీయ అభివృద్ధి అజెండా అయి ఉండాలి’ అని కెసిఆర్ స్పష్టం చేశారు. రోజులు గడిచే కొద్దీ అవకాశం వచ్చినప్పుడల్లా కెసిఆర్ వివిధ వేదికలపై జాతీయ స్థాయి అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే వచ్చారు. సమాఖ్య స్ఫూర్తి, సహకార ఫెడరలిజం, కేంద్రం రాష్ట్రాల సంబంధాలు, కేంద్ర స్థాయిలో అధికార రాజకీయాల్లో యథాతథ స్థితి, రైతు సమస్యలు, విచ్ఛిన్నకర రాజకీయాలు, నిధుల వికేంద్రీకరణ తదితర అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టం చేస్తూనే వచ్చారు. అంతేకాదు, బిజెపి, కాంగ్రెస్‌లలో ఏదో ఒక దాన్ని ఎంచుకోక తప్పని స్థితిలో దేశాన్ని ఉంచిన దురదృష్టకర పరిస్థితి గురించి వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను చైతన్యం చేస్తూనే వచ్చా రు. కొత్త జాతీయ పార్టీ నాయకత్వంలో కేంద్రంలో బిజెపియేతర, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరాన్ని కూడా ప్రతిపాదిస్తూనే వచ్చారు.

ఉమ్మడి అజెండాతో దేశాభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాల్లోని అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేయడమే నిర్మాణాత్మక మార్పు కోసం జాతీయ ప్రత్యామ్నాయాన్ని తయారు చేయాలన్న తన ఆలోచన అని 2018 మార్చి చివరి వారంలో రాష్ట్ర అసెంబ్లీలో అనుబంధ పద్దులపై జరిగిన చర్చలో పాల్గొంటూ కెసిఆర్ స్పష్టం చేశారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై ఆయన స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు. ప్రజల ప్రస్తుత, భావి అసరాలను తీర్చడం కోసం, దేశం, దేశ ఆర్థిక వ్యవస్థకున్న పూర్తి శక్తి సామర్థాల్ని సద్వినియోగం చేసుకోవడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఆయన ముందస్తు ఆలోచన. భారీ మొత్తం లో పేరుకుపోయిన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మెరుగైన ప్రోత్సాహకాలతో కూడిన పన్ను విధానం, పార్లమెంటు ఆధిపత్యం (సుప్రీమసీ), న్యాయ, ఎన్నికలు, పరిపాలన, తదితర రంగాల్లో సంస్కరణలు, లభ్యమయ్యే నదీ జలాలను సమానంగా పంపిణీ చేయడంతో పాటుగా పూర్తిగ్గా సద్వినియోగం చేసుకోవడం, ‘ప్రతి ఎకరాకు నీరు.. ప్రతి భూమికి నీరు.. ప్రతి రైతుకు నీరు’, శాశ్వత ఫైనాన్స్ కమిషన్, సంస్కరణలతో కూడిన వ్యవసాయ విధానం, చిన్న, సన్నకారు ఉద్యోగులకు కనీస వేతనాలు తదితరాలు ప్రతిపాదిత బ్రహ్మాండమైన జాతీయ అజెండాలో కొన్ని.

2018 ఏప్రిల్ 27న జరిగిన 17వ టిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీలో కెసిఆర్ మాట్లాడుతూ ‘మన దేశ ప్రగతి దిశగా పని చేయడానికి నేను ఏ అవకాశాన్ని వదులకోను, ఇందుకోసం భగవంతుడు ఇచ్చిన శక్తినంతా ధారపోస్తా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడానికి, దాన్ని బంగారు తెలంగాణగా తీర్చి దిద్దడానికి ఏ శక్తి, స్ఫూర్తులను చూపించానో అవే స్ఫూర్తి , శక్తియుక్తులను మళ్లీ చూపుతాను’ అని స్పష్టంగా, నిర్దంద్వంగా ప్రకటించారు. అంతేకాదు తానుహైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తానని, ఏకకాలంలో గులాబీ పూల సుగంధాలను దేశమంతటా చిలకరిస్తానని, ఈ దేశాన్ని బిజెపి, కాంగ్రెస్ పార్టీల కబంధ హస్తాల నుంచి విముక్తం చేస్తానని ఆయన విస్పష్టంగా చెప్పారు. తన ప్రసంగాన్ని ముగిస్తూ కెసిఆర్ ‘జై తెలంగాణ.. జై భారత్’ అంటూ నినదించారు. 2018 డిసెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ దేశ రాజకీయాల్లో కీలక వ్యక్తి కావాలన్న తన కృతనిశ్చయాన్ని, అలాగే దేశంలో అతి త్వరలోనే కొత్త జాతీయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటానని మరోసారి స్పష్టం చేస్తూ “హమే ఏక్ కాంగ్రెస్ ముక్త్, ఔర్ బిజెపి ముక్త్ భారత్ చాహియే’ (మనకు కాంగ్రెస్ లేని, బిజెపి లేని భారత దేశం కావాలి) అని ప్రకటించారు.

2019 మార్చి 17న కరీంనగర్‌లో టిఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ లోక్‌సభ ఎన్నికల తర్వాత తాను జాతీయ పార్టీని ఏర్పాటు చేయడానికి ఏ మాత్రం వెనకాడనని కెసిఆర్ గట్టిగా ప్రకటించారు. 2022 మార్చిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నాయకత్వ లక్షణాలపై కెసిఆర్ మాట్లాడుతూ తనకు ‘రాజకీయం ఒక టాస్క్, ఆట కాదు’ అంటూ ఒక చైతన్యవంతమైన వ్యాఖ్య చేశారు. 2022 ఏప్రిల్ 27న జరిగిన టిఆర్‌ఎస్ ప్లీనరీ సందర్భంగా కెసిఆర్ దేశానికి ‘ప్రత్యామ్నాయ అజెండా’ అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పారు. 2022 డిసెంబర్‌లో భావ సారూప్య రాజకీయ నేతలను కలిసేందుకు జరిపిన పర్యటనల సందర్భంగా ‘త్వరలోనే జాతీయ రాజకీయాల్లో సంచలనం ఉంటుంది’ అని ప్రకటించారు. 2022 జూన్ 2న రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో దేశ ప్రయోజనాలను కాపాడడానికి విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడడం తన విధి అని ప్రకటించారు.

2022 ఆగస్టు 29న పెద్దపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో దేశ రాజకీయాల్లోకి తన క్రియాశీల ప్రవేశాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తూ, 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో రైతు ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని స్పష్టం చేశారు. దేశాన్ని ప్రమాదకర విద్వేష శక్తుల నుంచి కాపాడడానికి మొట్టమొదటిసారి కెసిఆర్ ‘బిజెపి ముక్త్ భారత్’ కోసం తిరుగులేని పిలుపునిస్తూ ఈ ప్రక్రియలో భాగంగా కేంద్రంలో రైతుల ప్రభుత్వం ఏర్పడుతుందని అంచనా వేశారు. అలా గత కొంత కాలంగా జాతీయ పార్టీ కోసం నాటిన బీజాలు మొలకలు, మొక్కలు, చెట్లు అయ్యాయి. వాటి శాఖలు దేశ వ్యాప్తంగా విస్తరించాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. కెసిఆర్ వంటి రాజనీతిజ్ఞుడు తన దేశానికి సంబంధించిన వివిధ సమస్యలను వెలుగులోకి తెచ్చి తన జాతీయ అజెండా ద్వారా వాటికి పరిష్కారాలు చూపించినప్పుడు, ఒక జాతీయ పార్టీకి నాయకత్వం వహించినప్పుడు దాన్ని సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం ఉంది. అలాగే ఆయన అందరినీ ఒప్పించేలా మాట్లాడినప్పుడు అది ఆటంబాంబుల వర్షం కురిసినట్లుగా ఉంటుంది.

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడిచిపోయినందున దేశానికి కొత్త మార్గదర్శకత్వం అవసరం. భారత దేశానికి సమూలమైన మార్పు అవసరం ఉంది. రాజకీయ వ్యవస్థ మారినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే జాతీయ పార్టీలుగా చెప్పుకొంటున్న రెండు ప్రధాన పార్టీలు, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ దేశంలో దారుణంగా విఫలమైనాయి. దేశంలో సరయిన నాయకత్వానికి సంబంధించి లోటు ఉన్నప్పుడు కెసిఆర్ స్థాయి రాజనీతిజ్ఞుడి నాయకత్వం అత్యంత ఆవశ్యకమవుతుంది. అందుకే బిఆర్‌ఎస్ అవసరమయింది.

వనం జ్వాలా నరసింహారావు- 8008137012

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News