సాహిత్యంతో పాటు సాంస్కృతిక రంగంలోనూ అసమాన ప్రతిభ కనబర్చిన ప్రజ్ఞాశాలి దోరవేటి. పద్య గద్య రచనల్లో అనితరసాధ్యంగా రచనాప్రవాహాన్ని కొనసాగిస్తోన్న సాహితీవేత్త ఆయన. ఊరిపేరునే కలం పేరుగా మార్చుకుని, స్వగ్రామానికి ప్రత్యేకతను అందించిన కలం ఆయనది. దోరవేటిగా ప్రసిద్ధుడైన వి. చెన్నయ్య కవిత్వం, కథ, నాటకాలు, నవలలు, గేయాలు, రూపకాలు మొదలైనవెన్నో తెలుగు సాహిత్యానికి అందించారు. ప్రదర్శన కళల్లో రచయితగా, దర్శకుడిగా, నటుడిగా రాణించారు. పలు జానపద కళారూపాలను స్వయంగా ప్రదర్శించారు. చిత్రకారుడిగానూ తనదైన ముద్ర వేస్తున్నారు.
హరికథ, ఒగ్గుకథ, బుర్రకథ, ఏకపాత్ర, సంవాదం మొదలైనవాటిని రూపొందించడంతో పాటు ఆయా కళారూపాల్లో ప్రదర్శనలిచ్చిన ఘనత దోరవేటిది. వినియోగదారుల హక్కులపై ‘వినియోగం’, ఆకాశవాణి ప్రత్యేకతలపై ‘ఏఐఆర్’ మొదలైన బుర్రకథలను ఆయన రాశారు. ‘దుర్యోధన-భీష్మ’, శివాజీ-సమర్థ రామదాసు’ మొదలైన సంవాదాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘శకుని’, ‘కర్ణ’ తదితర ఏకపాత్రలను కూడా ఆయన రాశారు. బుర్రకథలు, ఏకపాత్రలు, సంవాదాలను ఆయన ప్రదర్శించడంతో పాటు దర్శకత్వం వహించడం విశేషం. జానపద కళాకారుడైన తండ్రి అడివయ్య గ్రామాల్లో యక్షగానాలను, భాగవత గాథలను ప్రదర్శించేవారు. వాటిలోని కథాకథన పద్ధతి బాల్యం నుండే దోరవేటిని ఆకర్షించింది. అందువల్లే సహజంగా జానపద కళలతో పాటు కథ మొదలైన ప్రక్రియలపై కూడా దోరవేటికి ఆకర్షణ పెరిగింది. ఆయన రచించిన అభినయ గేయాల సంఖ్య యాభైకి పైమాటే. ‘వివేకానంద’, ‘సోదరి నివేదిత’ మొదలైన గేయనాటికలు ఆయన రాసినవే.
స్వయంగా చిత్రకారుడు కూడా అయిన దోరవేటి పలు పాఠ్యపుస్తకాల కోసం చక్కటి బొమ్మలు గీశారు. తన గ్రంథాలు కొన్నింటి కోసం స్వయంగా చిత్రాలు వేశారు. ఆంధ్రనాట్యంలో నటరాజ రామకృష్ణ శిష్యుడిగా చక్కటి ప్రతిభ కనబర్చారు. నృత్య సంప్రదాయంలో వచ్చే వినాయక కౌతమ్, శివ కైవారం, దశావతారాలు, తిల్లానా మొదలైన అంశాలలో పలువురికి శిక్షణ ఇచ్చారు. నాట్యాచార్యుడిగా కూడా పేరుపొందారు. తబలా, మురళి, హార్మోనియం, తాళాలు మొదలైన సంగీత వాద్యాలను ఉపయోగించి, వివిధ ప్రదర్శనల్లో తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు.
దోరవేటి వెలువరించిన సాహిత్యం అమూల్యం. ఇప్పటివరకు 11 కథా సంపుటాలు, ఎనిమిది నవలలు, నాలుగు శతకాలు, నాలుగు ఖండకావ్యాలు, నాలుగు వ్యాస సంపుటాలు, మూడు శైవ వచన రచనలు, రెండు బుర్రకథలు, ఒక జీవిత చరిత్ర, ఒక లేఖా సాహిత్య సంపుటి, ఒక గేయాల సంపుటి, ఒక కీర్తనల సంపుటి వెలువరించిన లేఖిని ఆయనది.
‘నేస్తం’, ‘బసవ పంచశతి’, ‘సాంబశివ శరణం’, ‘విరుల బాట’ దోరవేటి రచించిన శతకాలు. వీటితో పాటు ‘అంజలి-1’, ‘అంజలి-2’ తదితర ఖండకావ్యాలను కూడా ఆయన వెలువరించారు. అంతేకాకుండా ‘హృదయస్పందన’ అనే గేయసంపుటి, ‘శ్రీసాయి శతక సంకీర్తనావళి’ అనే కీర్తనల సంపుటి ఆయన కలం నుండి వెలువడ్డాయి. దోరవేటి పద్యాల్లో సరళ సుందర పదాల పోహళింపు కనబడుతుంది. పద ప్రయోగంలో విలక్షణత గోచరిస్తుంది. ‘సాంబశివ శరణం’ శతకంలోని కింది పద్యంలో ఈ విషయాలను పరిశీలించవచ్చు.
నిండ భుజించలేము, కను నిండుగ నిద్రను పోనులేము, కూ/ ర్చుండగ లేము, హాయి పరుండగ లేము, గమింపలేము, యెం/ తుండిన నేమి భాగ్యము, మహోగ్రరూజమ్మలు క్రుంగజేసెనో/ యండజధారి కావుమని సాంబశివా శరణంబు వేడెదన్ / అలతి పదాల కూర్పుతో అనల్పార్థాన్ని ఇవ్వగల కవి సమర్థత ఈ పద్య పాదాల్లో కనబడుతుంది. బిందు పూర్వక డకార ఆవృత్తి పఠితులకు ఆనందాన్ని చేకూరుస్తుంది. పద్య విశిష్టతను తెలియజేసే కింది పద్యం దోరవేటి పద్యరచనానైపుణ్యానికి అద్దం పడుతుంది.
పద్యము ప్రాణము జిహ్వకు/ పద్యమె నా తెలుగు జాతి ప్రజ్ఞాయశముల్/ పద్యమె బాయని సంపద
పద్యకవిత హృద్వికాసపథమగు నేస్తం / దోరవేటి శతకాల్లోనూ పద్యాల్లోనూ ఇదే ధోరణి కనబడుతుంది./ దోరవేటి వెలువరించిన కథాసంపుటాలను సామాజిక కథలు, గ్రామీణ నేపథ్య కథలు, చారిత్రక కథలు, ఉపాధ్యాయ కథలు గా విభజించవచ్చు. ‘అమృత ఝరి’, ‘జెరజూస్కో’, ‘నాన్నకు జేజే’ మొదలైనవి సామాజిక కథాసంపుటాలు. ‘పల్లె’ గ్రామీణ నేపథ్య కథా సంపుటి. ‘చరితార్థులు’ చారిత్రక కథాసంపుటి. ‘ఆచార్య దేవోభవ’ ఉపాధ్యాయకథాసంపుటి. వీటితో పాటు ‘మన కవులు-మహా కవులు’ అనే పేరుతో కవులకథాసంపుటిని కూడా ఆయన వెలువరించారు. దోరవేటి తన కథావస్తువులను నిత్యజీవిత అనుభవాల నుండే తీసుకోవడాన్ని గమనించవచ్చు.
ఈ కథల్లో ఎక్కడా అసహజత్వం, అతిశయాలు ఉండవు. మానవవిలువలు, జాతీయతాభావాలు ఈ కథల్లో కనబడతాయి. ఈ కథలు ఒక్కోటి ఒక్కో ఇతివృత్తంతో విభిన్నంగా ఉండడం విశేషం. సిగరెట్టును ‘పొగరాక్షసి’గా పేర్కొనడం వంటివి ఆయన కథల్లో ఆకర్షిస్తాయి. ‘వయస్సు కళ్ల కింద నలిగిపోయింది’, ‘ఏట్లో పచ్చిపులుసు పిసికినట్టు’, ‘ఆకల్ని పెనవేసుకున్న కోపం’ మొదలైన ప్రయోగాలు కథలను చివరిదాకా చదివిస్తాయి.
చారిత్రక, సామాజిక ఇతివృత్తాల నవలలతో పాటు పిల్లల కోసం కూడా ప్రత్యేక నవలారచన చేశారు దోరవేటి. ‘బూచాడొచ్చాడు’, ‘మరో శివాజీ’, ‘అసమాన వీరుడు-అనురాగ దేవత’, ‘జీవనది’ మొదలైనవి ఆయన నవలలు. వీటిలో ‘జీవనది’ సాంఘిక నవల. తెలంగాణ గ్రామీణ వాతావరణం ఈ నవలలో కనబడుతుంది. నిజమైన ప్రాణ మిత్రుడిగా శర్మ పాత్రను చిత్రించిన తీరు పాఠకులను ఆకర్షిస్తుంది.
‘పయనమెచటికోయి’, ‘కలల కాసారం’, ‘శంఖారావం’, ‘నవభారతం’ మొదలైనవి దోరవేటి వివిధ పత్రికలకోసం రాసిన ధారావాహికలు. ‘పద్యం-రసనైవేద్యం’, ‘చదవేస్తే’, ‘భారతీయ కళలు’ మొదలైనవి ఆయన రాసిన వ్యాసాల సంపుటాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు పాఠ్యపుస్తక రచయితగానూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతర కాలంలో తెలంగాణ రాష్ట్ర పాఠ్యపుస్తక రచయితగానూ పిల్లల కోసం అత్యుత్తమ పాఠాల రూపకల్పనలో తనవంతు పాత్ర పోషించారు. విద్యార్థుల కోసం రేడియో, టీవీ పాఠాలను కూడా రూపొందించారు.
వివిధ రంగాలలో అసమాన ప్రతిభ కనబరుస్తోన్న దోరవేటి సాహిత్య సాంస్కృతిక ప్రస్థానంపై ఈ వ్యాస రచయిత సంపాదకత్వంలో ‘విపంచి’ అనే పేరుతో ఒక వ్యాస సంకలనాన్ని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక వెలువరించింది. దోరవేటి సమగ్ర సాహిత్యంపై కాకతీయ విశ్వవిద్యాలయంలో సాగర్ల సత్తయ్య పిహెచ్.డి. పూర్తి చేశారు. ‘దోరవేటి కథలు-పరిశీలన’ అనే అంశంపై వేముల మమత ఎం. ఫిల్. చేశారు. ‘దోరవేటి కానుక కథల సంపూర్ణ విశ్లేషణ’ అనే అంశంపై మురహరి రాథోడ్ ఎం.ఫిల్. చేశారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభామూర్తిగా పేరుపొందిన దోరవేటి ‘అభినవ దాశరథి’ బిరుదుతో పాటు అనేక పురస్కారాలు స్వీకరించారు. పద్య గద్య రచనలతో పాటు సాంస్కృతిక రంగంలోనూ అభినివేశాన్ని ప్రదర్శిస్తున్న దోరవేటి తన ప్రత్యేకతను నిలుపుకుంటున్నారు. బహుముఖ ప్రతిభామూర్తి దోరవేటి.
డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు- 9441046839