Monday, December 23, 2024

దానధర్మాలకు వీళ్లు దారిదీపాలు

- Advertisement -
- Advertisement -

దాతృత్వాన్ని మించిన సుగుణం లేదు. సాటి మనిషికి సాయపడడమే మానవ జీవిత ఉత్కృష్ట కార్యం. ఎందుకో గానీ సృష్టిలోని ప్రాణి కోటిలో బుద్ధి వికాసం పొందిన మనిషిలోనే స్వార్థం పెరిగింది. కాకికి కష్టమొస్తే అన్ని చుట్టూ చేరుతాయి. కోతికి దెబ్బ తాకితే గుంపుగా బాధపడతాయి. మనిషి మాత్రం సాటివాడి కష్టానికి స్పందించడం కోల్పోయాడు. అందుకే వేమన పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అని అందెశ్రీ పాట కట్టాడు. అయితే నూటికో కోటికో ఒక్కరు అన్నట్లు ఈ అపవాదును తొలగించుకొని ప్రయత్నం అక్కడక్కడా, అప్పుడప్పుడూ జరుగుతుంది. అలాంటి అరుదైన మహా దాతృత్వ, మానవీయ సంఘటనలు గత నెల ఈ భూమ్మీద రెండు కనబడ్డాయి.

ఒకటి ఉస్మానియా యూనివర్సిటీకి గోపాల్ టి కె కృష్ణ అనే పూర్వ విద్యార్ధి రూ. 5 కోట్ల భారీ విరాళం ఈయడం, మరోటి అరబ్ ఎమిరేట్స్ లోని ఒక భారతీయ వ్యాపారవేత్త ఫిరోజ్ మర్చంట్ రూ. రెండున్నర కోట్లు వెచ్చించి 900 ఖైదీలకు జైలు నుండి విముక్తి కలిగించడం. ఈ స్థాయి ఆర్థిక స్థితి ఉన్నవాళ్లు ఎందరో ఉన్నా ఇలాంటి ఆలోచన రావడం వారి ‘పుణ్య పురుష’ లక్షణంగా కీర్తించక తప్పదు. ఒయు ఇంజినీరింగ్ కాలేజీలో గోపాల్ కృష్ణ 1968లో బిఇ చదివారు. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడి అక్కడి రాజకీయాల్లో కూడా క్రియాశీలంగా ఉన్నారు. తాను చదివిన ఎలక్ట్రికల్ విభాగం అభివృద్ధి కోసం ఫిబ్రవరి 27 న అక్షరాలా రూ. 5 కోట్లను వర్శిటీ అధికారులకు అందజేశారు. ఎందరో గొప్పవారిని తీర్చిదిద్దిన 106 సంవత్సరాల ఒయు చరిత్రలో ఒక పూర్వ విద్యార్ధి ఇంత భారీ విరాళాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ ధనసాయాన్ని ఆ విభాగానికి ఉపయోగపడేలా ఆధునిక తరగతి గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి వినియోగించనున్నారు. వాటికి ప్రో. వి ఎం. గాడ్గిల్ ఆడిటోరియం అని, ప్రో. అబిద్ అలీ కమ్యూనిటీ హాల్ అని పేర్లు పెట్టాలని కృష్ణ కోరారు. తనకు జరిగిన గౌరవ సభలో ‘ఎంత ఇచ్చినా ఒయు రుణాన్ని తీర్చుకోలేను. ఇక్కడి చదువే నన్ను ఈ స్థాయికి తీసికెళ్ళింది’ అని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లో వారి నివాసం నారాయణగూడలో ఉండేది. కృష్ణ తండ్రి శ్రీనివాసాచారి అబిడ్స్ లోని మెథడిస్ట్ స్కూల్లో టీచర్‌గా పని చేశారు. తక్కువ వేతనంతో ఆయన పిల్లలను పైచదువులు ఇప్పించి తీర్చిదిద్దారు. ఆనాటి నిజాం ట్రస్ట్ చేసిన రూ. 1500 ఆర్థిక సాయం కూడా కృష్ణ అమెరికా చదువులకు తోడ్పడింది. అందుకు ప్రతిఫలంగా ఆయన రూ. 5 లక్షలు నిజాం ట్రస్టుకు తిరిగి ఇచ్చారు. ప్రస్తుతం 77 ఏళ్ల వయసున్న కృష్ణ అయోవాలో సొంత కంపెనీ స్థాపించి ఎందరికో ఉద్యోగాలు కల్పించారు. అయోవా రాష్ట్రానికి మూడు సార్లు చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఆయన ముగ్గురు కొడుకులు సొంత వృత్తుల్లో స్థిరపడ్డారు. కృష్ణ తన ఆస్తిని వారికీ పంచకుండా దాతృత్వానికే ఉపయోగిస్తున్నారు.

మరో అద్భుత దాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో స్థిరపడ్డ భారతీయుడు ఫిరోజ్ మర్చంట్. బంగారం, వజ్రాల వ్యాపారం చేసే ప్యూర్ గోల్డ్ సంస్థకు అధిపతి. 1989 నుండి దుబాయ్‌లో ఉంటూ ప్రముఖ వ్యాపారిగా ఎదిగిన ఆయనకు అరబ్బు దేశాల్లో 125 స్టోర్స్ ఉన్నాయి. తన సంపాదనను వెచ్చించి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఆయన ముందున్నారు. 66 ఏళ్ల ఫిరోజ్ 2008లో ది ఫర్గాటెన్ సొసైటీని స్థాపించి ఇలాంటి సేవలు అందిస్తున్నారు.ఈ మధ్య రూ. రెండున్నర కోట్లు చెల్లించి ఆ దేశంలోని జైళ్లలో ఉన్న 900 ఖైదీలకు విముక్తి ప్రసాదించి వార్తల్లోకి ఎక్కారు. కోర్టులు విధించిన జరిమానాలు, చేసిన అప్పులు చెల్లించలేక జైలు శిక్ష అనుభవిస్తున్నవారిని ఈ రకంగా ఆయన ఆదుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆయన 20 వేల ఖైదీలను ఈ రకంగా బయటికి రప్పించారు.

ఈ సంవత్సరంలో ఫిరోజ్ మూడు వేల మంది ఖైదీలకు విడుదల చేయించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు 900 మంది విముక్తి పొందారు. ఈ ఏడాది ఫిరోజ్ లక్ష్యం నెరవేరడానికి ఇంకో రూ. 8 కోట్లయినా వెచ్చించక తప్పదు. రంజాన్ కానుకగా వారు ఇళ్లకు చేరాలని ఆయన ఆశ. ఇలా జైలు నుంచి బయటికి వచ్చినవారు తమ సొంత దేశానికి, ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా ఏర్పాట్లు, ఇతర ఖర్చుల బాధ్యత తానే చూసుకుంటున్నారు. ముంబైలోని బెండి బజార్ లో పుట్టిన ఫిరోజ్ తండ్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పని చేసేవాడు. ఆయనది చాలీచాలని సంపాదన. ఒకే గదిలో ఎనిమిది మంది ఉండే స్థితి. పదకొండేళ్ల వయసులో ఆర్థిక ఇబ్బందులతో ఫిరోజ్ చదువు ఆపేసి తండ్రికి తోడుగా పనిచేసేవాడు. బతుకుతెరువు కోసం దుబాయ్ వచ్చి ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లోని అత్యంత ధనికుల జాబితాలో చేరిపోయాడు.

ఈ ఇద్దరు దాతలు పేదరికంలోంచి ఎదిగివచ్చినవారే. ఉస్మానియా యూనివర్శిటీ ఎందరికో విద్యనందించి వారిని ప్రజాప్రతినిధులుగా, ఉన్నతాధికారులుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దింది. యూనివర్శిటీ మెట్లు ఎక్కి ఖాళీ చేతులతో వెళ్ళినవారు అరుదుగా ఉంటారు. అయితే కృష్ణ లాగా తన విద్యాలయానికి తిరిగి కొంతైన ఇవ్వాలనే ఆలోచన వచ్చినవారు తక్కువే. ఈ రకంగా ఆ అమెరికా వాసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కోట్లు ఇవ్వలేకున్నా లక్షలు, వేలు ఇచ్చే స్తోమత ఉన్నవారు లేరనలేము. ఒక్క ఒయు అనే కాదు, ఎన్నో విధాలుగా చేతనైనంతలో తాము చదివిన బడి, పుట్టిన ఊరు ఋణం తీర్చుకొనే ఆలోచన ఆవశ్యకం.

ఇక విచారణ ఖైదీల విషయానికొస్తే మన దేశంలోనూ కోర్టు విధించిన జరిమానా చెల్లించలేక జైళ్లలో కొనసాగుతున్నవారి సంఖ్య తక్కువేమి లేదు. ఇప్పటికే ఢిల్లీ, యుపి ప్రాంతాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు జరిమానాలు చెల్లించి ఖైదీల విడుదలకు సహకరిస్తున్నాయి. 2019లో ఉత్తరప్రదేశ్‌లో కొన్ని సంస్థలు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన సందర్భంగా రూ. 19 లక్షలు చెల్లించి 131 మంది జరిమానా ఖైదీలను బయటకు రప్పించాయి. అదే విధంగా ఆగ్రాకు చెందిన సత్యమేవ జయతే అనే స్వచ్ఛంద సంస్థ రూ. 5.4 లక్షలు చెల్లించి 20 మంది ఖైదీలకు బయటకు తెచ్చింది. ఇలా ఆ అభాగ్యులను ఆదుకోవాలని ఉంటే ఏ జైలుకెళ్లినా వారి జాబితా ఇచ్చి అధికారులు సహకరిస్తారు. గోపాల్ టి కె కృష్ణ, ఫిరోజ్ మర్చంట్ లాగా కోట్లు దానం చేయలేకపోవచ్చు. ఒకరు చిన్నగా ఆరంభిస్తే నలుగురు తోడై అదే పెద్ద సహాయానికి బాట పడవచ్చు.

బి.నర్సన్ 9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News