Wednesday, January 22, 2025

అమ్మా, నాన్న నన్ను క్షమించండి!

- Advertisement -
- Advertisement -

చదువులంటే ఒక మంచి జీవితాన్ని అందిస్తుందనేది పెద్దల మాట. ఉన్నత విద్యాభ్యాసంతో మరింత ఉన్నత స్థానాల్లో తమ పిల్లలు ఉండాలన్న ఆకాంక్ష ప్రతీ ఒక్క తల్లిదండ్రులకూ ఉండనే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా విద్యారంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో చిన్నారుల ప్రాణాలు గాలి లో దీపాలైపోతున్నాయంటే అందుకు కారణాలను అన్వేషించాల్సిందే అంటున్నారు మానసిక వైద్యనిపుణులు. విద్యాభ్యాసంతో పాటే శారీరక, మానసిక బలాన్ని అందించే వాటికి ఇప్పటి తరం యువతీ యువకులు మైళ్ల దూరంలో ఉండిపోయారనడంలో ఎటువంటి సందేహం లేదు. దశాబ్ధాల కాలం నాడు చదువుకోవడం అంటే ఒక గొప్ప. ఉన్నత చదువులకు వెళుతున్నారంటేనే ఆ గ్రామం.. మండలం.. జిల్లా స్థాయిలో వారికి ఎంతగానో గౌరవించేవారు. కాలానుగుణంగా సమాజంలో కలిగే మార్పులకు చదువులమ్మ నెమ్మది నెమ్మదిగా తనకు తానే మరణ శాసనాన్ని రాసుకుంటోంది.

ఉన్నత విద్యాభ్యాసంతో ఉత్తమమైన జీవితాన్ని గడపాల్సిన యువతీ యువకులు ఇప్పుడు స్వయం ప్రకటిత ఉరి కొయ్యలపై వేలాడుతుంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలిపోతోంది. ‘అమ్మా, నాన్న నన్ను క్షమించండి! నా వల్ల కావడం లేదు. నాకు ఇంతకు మించి దారి కనిపించడం లేదు అంటూ రాజస్థాన్‌లోని ఐఐటి కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థిని రాసిన చివరి అక్షరాలు. ఉన్నత స్థానంలో తన బిడ్డను చూస్తామనుకున్న ఆ తల్లిదండ్రుల కళ్లెదుట విగత జీవిగా ఉన్న ఆ చిన్నారిని చూస్తుంటే గుండె చెరువైపోవడమే తప్ప మరేమీ లేదు. తన కష్టాన్ని తగిన సమయంలో చెప్పుకోవడానికి భయపడిందే కానీ తన ప్రాణాలు తీసుకోవడానికి మాత్రం భయపడలేదు. అక్కడే పొరపాటు జరిగిపోయింది. జెఇఇ పరీక్షలకు సిద్ధపడుతూ.. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది ఆ చిన్నారి.పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకోడానికి వచ్చినప్పుడు ఆ గదిలోనే సూసైడ్ లెటర్ కనిపించింది. ఇది కేవలం ఓ లేఖ మాత్రమే కాదు.

ఈ సమాజానికి బలవంతపు చదువుల కోసం పిల్లలపై ఒత్తిడి తెచ్చే తల్లిదండ్రులకూ ఓ హెచ్చరిక. ఇలా ఒకరిద్దరు కాదు పదుల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు రాజస్థాన్ కోటాలోని విద్యార్థులు. కోటా ఇదో కలల ప్రపంచం. హైదరాబాద్‌లో మైత్రీవనం అందరికీ తెలిసే ఉంటుందిగా. అలాంటిదే రాజస్థాన్‌లో కోట. వేలాది మంది విద్యార్థులు ఇక్కడ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిప్రేర్ అవుతుంటారు. నిజం చెప్పాలంటే కోటలోని కోచింగ్ సెంటర్ అంటేనే చదువుల ఫ్యాక్టరీ అని అర్థం.ఇక్కడకు వచ్చే ప్రతి విద్యార్థీ ఓ కూలీయే. ఇక్కడ కోచింగ్ తీసుకుంటే చాలు ఏ పోటీ పరీక్షనైనా చాలా సులువుగా క్రాక్ చేసేయొచ్చన్న నమ్మకం తల్లిదండ్రులది. అందుకే ఎంత ఖర్చు అయినా పరవాలేదు. అక్కడికే తమ పిల్లల్ని పంపుతారు. వాళ్ల ఆశలు వాళ్లవి. పిల్లలు పోటీ పరీక్షల్లో రాణిస్తే వాళ్ల భవిష్యత్తు ఎంతో బాగుంటుందని కలలు కంటుంటారు. కలలు కనడంలో తప్పేమీ లేదు.

కానీ అది పిల్లలకు ఇష్టమేనా? అసలు వాళ్లు ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడగలరా? వాళ్ల మనసులో ఏముంది? అనేది తెలుసుకుంటున్నారా లేదా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఓ పదేళ్ల క్రితం చదువులు వేరు. ఇప్పుడు వేరు. ప్రతిదీ పోటీయే. ఫీజులు వసూలు చేయడం దగ్గర నుంచి అన్ని ర్యాంకులొచ్చాయ్, ఇన్ని ర్యాంకులొచ్చాయ్ అని ప్రకటనలు చేసేంత వరకూ అంతా కమర్షియల్ అయిపోయింది. దానికి తోడు బయట కాంపిటీషన్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఏదో పాస్ అయితే చాల్లే ఉద్యోగం వచ్చేస్తుందనుకునే రోజులు ఎప్పుడోపోయాయి. అత్తెసరు చదువులకు కాలం చెల్లింది. అందరూ మేధావులను నిరూపించుకుంటే తప్ప మార్కెట్లో వాల్యూ ఉండడం లేదు.

అందుకే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి గత పదేళ్లలో ఎప్పుడూ లేనంత డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్‌తో పాటు విద్యార్థులపై ఒత్తిడి కూడా బాగా పెరిగింది. మెరిట్ అని చెప్పి అసలు చదువుల్లోని స్పిరిట్‌నే దూరం చేస్తున్నారని కొందరు వాదిస్తున్నా ‘ఇవి వాదించుకోడానికి మాత్రమే బాగుంటాయ్’ అని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఈ రెండు వాదనల మధ్య నలిగిపోతోంది విద్యార్థులే. ఇప్పుడీ చర్చంతా ఎందుకంటే కొన్నేళ్లుగా కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్యని చూస్తుంటే వెన్నులో వణుకుపుడుతోంది. కాకపోతే గతేడాది వీటిపై ఎక్కువగా చర్చ జరిగింది. అందుకు కారణం గతేడాదే ఎక్కువ మంది సూసైడ్ చేసుకోవడం. ‘అసలు కోటాలో ఏం జరుగుతోంది’ అని దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రభుత్వం అప్రమత్తమై కొన్ని చర్యలూ తీసుకుంది.

ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు పెరుగుతుండడంతో రాజస్థాన్లోని కోటా పోలీసులు ఓ డేటా విడుదల చేశారు. 2015 నుంచి ఇక్కడి కోచింగ్ తీసుకుంటూ ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థుల సంఖ్యని వెల్లడించారు. ఈ గణాంకాలు చూస్తే 2015లో 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తరవాత 2016లో 16, 2017లో ఏడుగురు, 2018లో 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2019లో 8 మంది, 2020లో నలుగురు బలన్మరణానికి పాల్పడ్డారు. ఇక 2021లో 15, 2022లో 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది అత్యధికంగా 29 మంది ప్రాణాలు తీసుకున్నారు. గత నాలుగేళ్లలో ఈ సూసైడ్స్ సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగింది. నిజానికి 1990 నుంచే కోటాకి విద్యార్థుల తాకిడి మొదలైంది. కానీ అప్పటికి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఈ స్థాయిలో లేవు. కానీ అప్పట్లో ఉన్న కోర్సులు చేయడానికి కోటాయే హబ్‌గా ఉండేది. అతి కొద్ది కాలంలోనే ఎడ్యుకేషన్ హాట్‌స్పాట్‌గా మారింది. ప్రస్తుతానికి కోటాలోని ప్రధాన కోచింగ్ సెంటర్లన్నీ కలుపుకుంటే కనీసం లక్షా 70 వేల మంది విద్యార్థులు ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. 4 వేలకు పైగా హాస్టళ్లు, 40 వేల పిజిలు అందుబాటులో ఉన్నాయని అంచనా. ఇన్ని లక్షల మందిలో హాయిగా నవ్వుకుంటూ ఇంటికి తిరిగి వెళ్లేవాళ్లు కొంతమందే.చాలా మంది పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేక నిరాశ చెందుతున్నారు. మళ్లీ మొదటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెడుతున్నారు. ఇదే వాళ్లని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. చదివిందే మళ్లీ చదవాలన్న అసహనం, తమతో పాటు చదువుకున్న వాళ్లు ఉత్తీర్ణత సాధించడం లాంటివి వాళ్లపై తెలియకుండానే మరింత మానసిక బరువు పెంచేస్తున్నాయి.బయటికి కనిపించని భారాన్ని మోస్తూ మోస్తూ అలిసిపోయి చివరకు హాస్టల్ గదుల్లోనే ప్రాణాలు తీసుకుంటున్నారు.

పోటీ పరీక్షల సిలబస్‌కి, అకాడమిక్ సిలబస్‌కి తేడా ఉంటుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కూడా విభిన్నంగా ఉంటుంది. అంతా వేగమే. కాస్త వెనకబడినా ఏమీ అర్థం కాదు. అలా ప్రిపేర్ అవ్వకపోతే వాటిని క్రాక్ చేయలేమన్న బలమైన ముద్ర అందరిపైనా పడిపోయింది. ఈ వేగానికి తగ్గట్టుగానే కోటాలోని కోచింగ్ సెంటర్లు షెడ్యూల్ తయారు చేస్తున్నాయి. రోజుకి కనీసం 12 గంటల పాటు ప్రిపరేషన్ ఉంటుంది. పైగా ఒక్క రోజు కూడా గ్యాప్ ఉండదు. వారం రోజుల పాటు ఇలా 12 గంటలు చదవాల్సిందే. ఇవి కాకుండా వారం వారం టెస్ట్‌లు ఉంటాయి. వీటి ఆధారంగానే విద్యార్థులు ఎంత వరకూ ప్రిపేర్ అవుతున్నారు? ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నారో తెలుసుకుంటాయి కోచింగ్ సెంటర్లు. ఇది అవసరమే కావచ్చు. కానీ అసలు సమస్య ఇది కాదు.

ఆ వీక్లీ టెస్ట్ల ఫలితాలను పబ్లిక్‌గా బోర్డులలో పెట్టేస్తారు. ఫలితాలు బానే వస్తే పర్లేదు. కానీ అందులో వెనకబడిన వాళ్లు అంత మంది ముందు తమ ఫలితాన్ని చూసుకుని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. తమను తాము తక్కువ చేసుకుంటున్నారు. ఎవరు ఏమనుకుంటారో అనే ఇన్ఫీరియారిటీతో మరింత ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా ఆందోళన చెందే వాళ్లు కొందరైతే అసలు ఎగ్జామ్ రాయకుండానే టెన్షన్‌పడే వాళ్లు మరి కొందరు. ‘ఎలా రాస్తానో ఏమో? ఎలాంటి ప్రశ్నలు వస్తాయో? టైమ్‌కి పూర్తి చేస్తానో లేదో’ అని కంగారు పడుతుంటారు. పైగా తల్లిదండ్రుల కలని నెరవేర్చాలన్న ఒత్తిడి తోడవుతోంది. ఇదే వాళ్లను అయోమయానికి గురి చేస్తోంది. చివరకు ప్రాణాలు తీసుకునే వరకూ కుంగదీస్తోంది. ఇదంతా తెలిసినప్పుడు షెడ్యూల్ మార్చేయొచ్చు కదా.. అని ప్రశ్నించవచ్చు.

కానీ ఈ విషయంలో ‘మేం ఏమీ చేయలేం’ అని చెబుతున్నాయి కోచింగ్ సెంటర్లు. కొంత మంది ఎక్కువగా మనసుకు తీసుకుని ఒత్తిడికి గురవుతున్నారని, వాళ్లు ఆత్మహత్యలకు కేవలం తమనే నిందించడం సరికాదని బుకాయిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి, విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఏయే చర్యలు తీసుకోవాలే ఈ కమిటీ పలు సూచనలు చేసింది. వారానికి కచ్చితంగా ఓ రోజు వీకాఫ్ ఉండాలని, రోజువారీ షెడ్యూల్లో ఓ పూట చదువుకుంటే మరో పూట ఆటపాటలతో గడిపేలా ప్రోత్సహించాలని సూచించింది.

ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు ఓ రెండు నెలల పాటు టెస్ట్‌లు పెట్టకూడదని చెప్పింది. అయితే ఈ సూచనలన్నింటినీ అన్ని చోట్లా అమలు చేస్తున్నారా లేదా అన్నది మాత్రం స్పష్టత లేదు. సైకియాట్రిస్ట్‌లతో కౌన్సిలింగ్ అవసరం అని నిపుణులు తేల్చి చెబుతున్నా అదీ ఎన్ని చోట్ల అమలవుతోందో తెలియడం లేదు. అందుకే ఇంకా ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇది కేవలం రాజస్థాలోని కోటా కోచింగ్ సెంటర్‌లో ఉన్న పరిస్థితి మాత్రమే అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. ఈ వాతావరణం దేశంలోని ప్రధాన నగరాలలో నిర్వహిస్తున్న బడాబాబుల కోచింగ్ సెంటర్లలో కొనసాగుతున్న మానసిక కారాగార శిక్షలే. దేశంలోని అన్ని కోచింగ్ కేంద్రాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడితేనే నిండు నూరేళ్లు బంగారు జీవితాన్ని అనుభవించాల్సిన చిన్నారులను కాపాడుకోవడానికి వీలుపడుతుంది.

వివి వెంకటేశ్వర రావు
6300866637

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News