Thursday, January 23, 2025

నగ్నంగా నడయాడింది ఓ.. దేహమే కాదు.. అది నా దేశమే..

- Advertisement -
- Advertisement -

నగ్నత్వం కేవలం ఓ ఆడతనానిదే కాదు అది చుాసి వికటాట్టహాసంతో నవ్విన ఆ.. మార్మికం మరిచి మదమెక్కిన మగతనానిది కుాడా..
ఉరితాడును బిగించే తలారికైనా ఓ క్షణం మనసు చలించక మానదు..ప్రాణం విలువ తెలుసుకాబట్టి
మానం విలువ తెలియని మృగాలకేంతెలుసు
అది అమ్మతనమనీ ..అదొక ఆడతనమనీ ..
అమ్మతనపు ఉమ్మనీరే ఒకప్పుడు ఊపిరయ్యిందనీ ..
ఆ ఆడతనపు లాలనలోనే తన తొలిబడి మొదలైందనీ..
నగ్నదేహం నడిరోడ్డు మీద నడయాడితే గాని జ్ఞప్తికి రాని నగ్నసత్యం …
వేల కళ్ళు సుాదుల్లావచ్చి గుచ్చినప్పుడే తెలిసింది..
ముళ్ళలాంటి విషపు చూపుల తీక్షణెంతో..
ఒంటిమీది ఆ రక్తపు మరకల
జాడ చూసినప్పుడే తెలిసింది…
ఆ కర్కశపు గోళ్ళ పదునేంతో…
విరిగిన ఆ రెక్కల చప్పుడెక్కడో తెలిసింది. ఆ కసాయి గుండెల మాటునే అనీ ..
అవును ……
ఇప్పుడిదేం కొత్త కాదు ఆ నగ్న దేహానికి ..
రెక్కలు విరిచి అంగాంగపు
అగాథాలను ఇనుపరాడ్లతో తొలిచిప్పుడే …
నిర్భయగా నిష్క్రమించింది ఈ దేశంలోనే..
మన భారత దేశంలోనే…
అవును …..
ఇప్పుడు ఇదేం కొత్త కాదు ..
దేవుని గర్భగుడిలో సేద తీరిన పసి మనసును సైతం ఛిద్రం చేసింది ఈ దేశం లోనే
అవును …/ మన భారత దేశంలోనే ..
ఇప్పుడిదేం కొత్తకాదు ….
కొత్త కానే కాదు …/ ఎంతమంది నిర్భయలు
ఎన్ని పసిమనసులు ..
విలువలు లేని సమాజంలో వలువలు లేని ఆ నగ్నదేహాలు
వీధి వీధినా ఊరేగింపుల్లో కోకోల్లలు..
సమయం, సందర్భం.. / దేనికదే ఆరంభం అవును..
ఇప్పుడిదేం కొత్త కాదు..
ఏలికలకు ,పాలకులకు ఓ నగ్నదేహం వీధిన పడితే తప్ప గుర్తుకు రాని
ఓ అమ్మతనం విలువ ..ఓ ఆడతనపు విలువ…
నగ్నత్వం దేహానికే కాదు
మాకేనని ..నిశ్చేష్టులైన వీధులు
సిగ్గుతో కళ్ళు ముాసుకున్నాయి ..
దారెంటా..పడిఉన్న కఠిన పాషాణాలు సైతం ఆ.. కరడుగట్టిన హృదయాలను చుాసి ద్రవించాయి..
ముాసధోరణి విధానాలు ,కల్లబొల్లి కబుర్లు..కత్తి దుాసే మాటలు.. కాలం చెల్లిన సిధ్ధాంతాలు..
ఆ కొరకొరచూపుల ఆ కంపరం
తొలగితే తప్ప ..
నోరెళ్ళబెట్టి చోద్యం చూసే కుళ్ళిన ఆ మెదళ్శ మొదళ్ళు నరికితే తప్ప.. /నాగరిక సమాజం నుంచి
ఈ అనాగరిక పశువుల్ని తరిమితే తప్ప…..
అప్పుడే… సంస్కరణం…..
అదే శ్రాధ్ద కర్మ స్నానం ….
కులగజ్జి వేళు్ళానుకున్నన్నాళు్లా..
మతం నల్ల రంగు పులుముకున్నన్నాళు్లా…
ఆటవికం నగ్నదేహాలపై ఆడుకున్నన్నాళు్ళా ..
ఈ ఊరేగింపులనుా …
ఆ బరితెగింపులనుా.. …
భయపు కిటికీ సందుల్లోంచి బేలగా చూసే ఆ కళ్ళకు ..
ఇప్పుడు ఇదేం కొత్త కాదు
అవును కొత్త కానే కాదు …
ఘటనా సంఘటనల విలుప్తరంగస్థలమిది ..
అందరిదీ ప్రేక్షక స్థానమే ..
కొందరిదీ మంద్రస్థాయి మౌన గానమే …
అధికార యావలో వాగ్దానాలన్నీ నీటి బుడగ ప్రాయములే..
క్షమించు తలి్లీ..నా భారతావనీ..
పరువు రక్షణ పోరాటంలో దునుమాడిన దుశ్సాసన క్రీడలో అలసి సొలసి ఆవిరవుతున్న.. ఆ అరణ్యరోదనలకు
అంతమెప్పుడో..
కరడుగట్టిన కీచకపర్వానికి..
మరణమెప్పుడో ..
కలుషితమైన విలువలను
కణకణమండే కొలిమిలో
పునీతంగావించే తీరు ఎప్పటికో.. మరెప్పటికో..
అరాచక ,ఆకృత్యాలకు నిత్యం బలయ్యే ఆ ఆక్రందనలకు
అంతమెప్పుడో..
అన్యాక్రాంతమవుతున్న అతివమానానికి రక్షణెక్కడో..
ఆ మగహంకారాధిపత్యానికి అంతిమ గీతాగానమెప్పుడో..
‘యత్రనార్యస్తు పుాజ్యంతే రమంతే తత్రదేవతాః‘
ఇవేనా.. మనువాదపు మాటలు ..
వినువీధుల్లో నగ్నత్వం నడిచిన నేల పై సిగ్గుతో తల వంచి దేవతలు సైతం కన్నీరు పెట్టిన వేళ ..

(మణిపూర్‌లో జరిగిన దుస్సంఘట ప్రతి మహిళనుా కుమిలిపోయేలా చేసింది.. దీని మీద నా..కొన్ని మాటలు)

ఉమా రతన్ పాల్కే
9912197473

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News