అయిదు వందల పేజీల నవల చదివిన తరువాతఅబ్బే, ఏముంది ఇందులో అనుకోవలసిన సందర్భాలు ఎదురౌతుంటాయి. కాని మునిపల్లెరాజు కథల్లో ఏది చదివినా అబ్బో ఇందులో ఎంత జీవితంచిత్రించాడీ రచయిత అనిపిస్తుంది. కథ అనే కెరటానికి వెనుక నుంచి అనంతమైన జీవన సముద్రఘోష వినిపిస్తుందంటారు ప్రముఖ రచయిత మధురాంతకం రాజారాం గారు మునిపల్లె రాజుగారి కథలకు చేసిన వ్యాఖ్యానం అక్షరసత్యం.మ్యాజిక్ రియలిజంతో కథలు రాసిన గొప్ప కథకుల్లో మునిపల్లెరాజు ఒకరు. శత వసంతాలు దాటిన తెలుగు కథా ప్రయాణంలో సాధించిన పరిణతి అత్యంతావశ్యకరం. గురజాడ వారు ఏర్పరచిన నవీనమైన రూప రేఖావిలాసాలతో కథ నవ్య పోకడలు పోయింది- పోతున్నది. వీరి తరువాత నాలుగైదు తరాల కథకులు నాలుగు కాలాల పా టు గుర్తుంచుకోదగ్గ కథలను రాసిశిల్ప, వస్తుపరం గా సుసంపన్నం చేసారు. పరిపక్వమైన జీవన గాంభీర్యంతో మానవ జీవితాన్ని అత్యంత సహజంగా చిత్రించి సహస్రముఖాలుగా కథను ఆవిష్కరించిన గొప్ప ‘కథలరారాజు’ మునిపల్లెరాజు.
ఓ తరం కథకుల కథలకు ఆయనో ప్రతినిధి. అత్యంత వేగంగా మారుతున్న మానవ సమాజ ముఖచిత్రంతో విభిన్నమైన గమన మార్పులను రాజుగారి కథలు ఆవిష్కరించిన వైనం- ఘనం. జీవితపు శతాబ్ధా ల శిథిలావస్థల చివరి మెరుపులు ఒక భావోద్వేగాన్ని, ఒక కరుణను, ఒక నిర్వేదాన్ని, ఒక ప్రశాంత వాతావరణాన్ని, ఒక వీడ్కోలు దృశ్యపు ఆర్ధ్రానుభూతిని కలిగిస్తూ, దృశ్యా దృశ్యంగా ఉదయ కాలపు మంచుతెర కరిగిపోతున్నట్టు, సాయం సంధ్యాసమయ నిశ్శబ్ధం నిశీధిలో లీనమవుతున్నట్టు కాలం తన ప్రయాణాన్నిమౌనంగా చేతిలో ఇసుకలో జారిపోతున్న చిత్రాలుమనిషి జీవితానికి అన్వయిస్తూ కొనసాగే రాజుగారి కథలు మరో కొత్త సమాజపు దారులకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి.మునిపల్లె రాజుగారిది గుంటూరు జిల్లా పొన్నూ రు మండలం మునిపల్లె స్వగ్రామం. కాకమాను మం డలం గరికపాడులో 1925 మార్చి 16న జన్మించా రు. ఈయన అసలు పేరు బక్కరాజు. తండ్రి హనుమంతరావు, తల్లి శారదమ్మ. మనిపల్లె, తెనాలి, పొన్నూరు, నిడుబ్రోలు ప్రాంతాలలో ఆయన విద్యాభ్యాసం సాగింది.
తెలుగు పండితులు జమ్మలమడక రామమూర్తి గారి వలన సాహిత్యంలో అభిలాషను పెంచుకున్నారు. 1943 నుండి 1983 వరకు భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగ్ విభాగంలో సర్వేయర్‌గా పనిచేసారు. దేశంలో వివిధ ప్రాంతాలు తిరిగారు. జీవిత భాగస్వామి సులోచనాదేవి. అరవై తొమ్మిది కథలు, పూజారి అనే నవల రచించారు. ఈ నవలనే ‘పూజా ఫలం’ అనే చలనచిత్రంగా బిఎన్.రెడ్డి సినిమాగా తీసారు. 2004 గోపిచంద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు, 2006 కేంద్ర సాహి త్య అకాడమీలతో పాటు మరెన్నో పురస్కారాలు రాజుగారి కీర్తి కిరీటంలో ఒదిగిపోయాయి. తమ విలువను పెంచుకున్నాయి. రాజుగారి కథల్లో అర్థమైన హృదయార్ధ్ర రీతిన సృజనా కథా చిత్రా లు కనిపిస్తాయి. తన చుట్టూ ప్రపంచంలోని మనిషి ఉనికి, అస్తిత్వ పోరాటాల నడుమ ప్రవృత్తులను, పోరాటాలను అద్భుతం గా, అక్షరబద్ధం చేసారు. ముఖ్యంగా సామాన్యులే.
రాజుగారి కథల్లో ప్రధాన పాత్రలు కావటం విశేషం. ఈయన రచనల్లో పల్లెలోని ప్రశాంతత, రాజరికపు రాజసము కనిపిస్తాయి. ఆయనకున్న భాషపైన అధికారం, అపారమైన జీవితానుభవం, విస్తారమైన ప్రయాణ విజ్ఞానం, కథన కౌశలం, కథా శిల్ప మర్మజ్ఞత వంటివి ఆయన రచనల యొక్క విశిష్టతకు ప్రత్యేకాంశాలుగా నిలుస్తాయి. జర్నలిజం గురించి వ్రాసిన వ్యాసాలలో సహితం కథనం చదువరులను ఆశ్చర్యచకితులను చేయటం గమనించవచ్చు. కథలు, నవలలో తన చుట్టూ ఉన్న వ్యక్తులనే పాత్రలుగా ఆయన మలుచుకున్నారు. తాత గారు, అమ్మనాన్న, పెద్దనాన్న, స్నేహితులు అంతా ఆయన బంధుగణమే. తనకు తెలియని వ్యక్తుల గురించి తను కథ రాయలేనంటారు ప్రముఖ కథకులు పాలగుమ్మి పద్మరాజు. ఈ రాజుగారిది కూడా ఇదే ఒరవడి. అయితే తన మనోపథంలో చిత్రించుకున్న చిత్రానికి తనకు నచ్చిన వర్ణాలనద్దుకోవడంలో ఏ చిత్రకారుని ప్రత్యేకత వారిదే. మునిపల్లె రాజుగారి కథన కౌశలం అద్భుతమైన వర్ణచిత్రాల సౌందర్యం.
మానవ జీవితాలలో ప్రతి ఒక్కరికి తనదైన అనుభవ అంతరంగిక జీవితం కనిపిస్తుంది. అతడు అభిమానించే విలువలు పాటించాలని ఆశించే జీవన విధానమూ ఏవిధంగా ఉంటాయో సామాజిక జీవనానికి కూడా ఉదారభావ సాముదాయిక ఆదర్శ జీవన మూల్యాలు ఉంటాయి. ఆ సున్నితమైన మనఃప్రవృత్తిలను, ఆర్తిని ప్రాథమిక చిత్తవృత్తులను, మానవుడి మనుగడను సార్ధకము స్తుతి పాత్రమూ చేసే విలువలను ఆవిష్కరించడమే గొప్ప కథకుడి గొప్పతనమంటారు అక్కిరాజు రమాపతిరావు. మునిపల్లె రాజు గొప్ప కథకులు. ప్రతీ మనిషి జీవితంలో చిక్కుముళ్ళూ అనేకముంటాయి. వీటిని విడదీసుకుంటూ ముందుకు సాగటమే జీవిత పరమార్థమనే వారిలో మానవత్వ కరుణా ప్రపూర్ణమైన దృక్పథమున్న రాజుగారు ప్రథమ వరుసలోని వ్యక్తి.
వీరి శ్రీరాజుగారు కథలలో కవిత్వముంది. వెన్నెలలో మబ్బులు ఎంతందంగా కనిపిస్తాయో ఆనందాన్నిస్తాయో ఈయన కథల్లో వర్ణనలూ అంతేస్థాయి రసస్ఫూర్తిని కలిగిస్తాయి. రాజుగారి కథలు పాత్రల అంతరంగ, బహిరంగ మూర్తిత్వాలు బలంగా, స్ఫుటంగా జీవస్సంబంధ బంధురంగా కనిపిస్తాయి. ఆ విధమైన చిత్రణ ఆయన ప్రత్యేకత. తెలుగు కథలలో సైనిక వృత్తి జీవితాల మీద వచ్చిన కథలు చాలా తక్కువ. ఆ లోటును తీరుస్తూ సైనిక పటాలాల్ కు టుంబ, వ్యక్తిగత, వృత్తిగత సంవేదనలను, ప్రతిస్పందనలను విలక్షణ రీతిలో చిత్రించారు రాజుగారు.
ఆయన కలం నుంచి ఏ కథవచ్చినా దానికొక సాహిత్యయోగం, ప్రయోజనం ఉండాలనేది ఆయన ఆశయం. మరో ముఖ్యమైన విషయం ఆయన కథలలో కనిపిస్తుంది. అదేమిటంటే దేశీయ వైవిధ్యంలో చెక్కుచెదరక నిలిచిన సాంస్కృతిక మూలాల ప్రస్థావన ఈ కథలలో దృశ్యమానమవుతుంటుంది. పల్లెను చిత్రించినా, ముంబాయి వంటి నగరాలను వర్ణించి నా వాటి తత్వాలను’ సాధికారికంగా చెప్పగల గొప్పసాహితీ మూర్తి. ఉత్తమ సాహిత్యాభిలాష గలిగిన వారికి మునిపల్లె రాజుగారి కథలు సేదతీరుస్తాయి. తన చుట్టూ ఉన్న సమాజం, ఆ సమాజాన్ని నడిపించే సమూహాలను కథా రచయితగా రాజుగారు అధ్యయనం చేసారు. అందుకే ఆయన కథలలో జీవిత చేవ పరిపుష్టంగా కనిపిస్తుంది. అదో ఆకర్షణీయమైన వైవి ధ్యం ఆయన రచనలకు. మునిపల్లె రాజుగారు గొప్ప మానవతావాది. ఆయనకు మనిషి ముఖ్యం. నిండైన మానవీయతల, విశ్వజనీనత ఆయన రచనల లక్ష్యం.
(మార్చి 16 మునిపల్లె రాజుగారి శతజయంతి)
ఎం.లక్ష్మి