Thursday, January 23, 2025

పాట నా బాట తెలంగాణ ఉద్యమ పథం

- Advertisement -
- Advertisement -

కాలంతో పోటీపడుతూ కాలప్రవాహానికి ఎదురీదేవాడే కవి. సమాజాన్ని కదిలించడమే కాకుండా, అనేక సంఘటనకు నిత్య చైతన్యసాక్షియై తన కవిత్వం ద్వారా సమస్తం దర్శింపజేస్తాడు. అందుకే సమాజంలో అరుదైన స్థానం కవికి ఉండడంవల్ల ఇంద్ర పదవి కన్నా కవీంద్ర పదవి మిన్న అన్నాడు ఎల్లోరా. రాజు జీవించు రాతి విగ్రహములందు సుకవి జీవించు ప్రజల నాలుకల యందు అంటూ రాజు కన్నా కవి గొప్పవాడు అని చాటి చెప్పాడు మహాకవి జాషువా. ఒక కవి నిత్య చైతన్య శీలి అయినప్పుడు, పలు ఉద్యమాలతో సంబంధాలు కలిగి ఉన్నప్పుడు, తానే పలు ఉద్యమాలకు ఊపిరి పోసినప్పుడు, అనేక అస్తిత్వ స్పృహ చైతన్యాలను తాను పొందడమే కాకుండా ఇతరులకు గూడా దానిని సంక్రమింపజేసినప్పుడు, ఆ కవి కాలంతో పరుగుపెట్టే స్వభావి అయినప్పుడు అతని ప్రభావం సమాజంపై తప్పకుండా ఉంటుంది. సరిగ్గా అలాంటి అరుదైన కవి జూలూరు గౌరీ శంకర్. వీరి ఆత్మకథనాత్మక దీర్ఘ కవితయే ‘జూలూరు పథం’.

ఇది విస్తృతమైన దీర్ఘ కవిత. దీర్ఘ కవిత్వానికి పర్యాయపదంగా జూలూరు గౌరీ శంకర్‌ను చెప్పవచ్చు. గతంలో అనేక దీర్ఘకావ్యాలు రాశారు. ఎలియాస్, పాదముద్ర, పొలికట్టె, ఊరుచావు, నా తెలంగాణ, కాటు, సిలబస్ లో లేని పాఠం, మూడవ గుణపాఠం, ఓం నమశ్శివాయ, మొగిలిచర్ల లాంటి దీర్ఘ కవితలు రాశారు. జూలూరు గౌరీ శంకర్ ఈ కావ్యానికి రాసిన ముందుమాటలో ఇలా అంటారు. ఇందులో కనిపించని దృశ్యాలేమీ ఉండవు. ఇందులో మెరుపులు, చెణుకులేమీ ఉండవు. ఇందులో అనూహ్యాలూ, అసంగతాలూ ఏమి ఉండవు. ఇందులో నా చుట్టూ నేను అల్లుకున్న కలలున్నాయి. నేను నడిచిన దారుల ఎగుడు దిగుడ్లున్నాయి. నా కన్నీళ్లు, నా కేరింతలు, నా పోరాటాలు, నా గాయాలు ఉన్నాయి. ఈ కావ్యాన్ని పరిశీలించడమంటే జూలూరు గౌరీ శంకర్ పడిన బాధలు, పొందిన అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్లు, సంక్షోభాలు, అవరోధాలు అంతిమంగా వారు ఏ విధంగా వాటినన్నింటినీ అధిగమించి విజయాన్ని పొందారనే విషయాల్ని తరచి చూడడమే. తన నాలుగు పదుల సాహిత్య, సామాజిక స్పృహను ఒక్క ఉదుటున తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోంచి అక్షరీకరించిన విధానం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రముఖ కవి సీతారాం అన్నట్లు ఇదొక దీర్ఘపరివేదన , సుదీర్ఘ కవితాత్మక శ్వాస,ఇదొక గుక్క తిప్పుకోకుండా తడబాటు లేకుండా, తొట్రు పడకుండా పొల్లు పోకుండా చరిత్ర ముందు ఒప్ప చెప్పిన అనుభవం. ఇందులో ప్రధానంగా మూడు పాయలు ఉన్నాయి. మొదటి పాయ విప్లవోద్యమ సాహిత్య స్పృహ దృక్పథ సంబంధమైనది, రెండవ పాయ కులపీడిత సమాజంలో కొనసాగుతున్న దౌర్జన్యం,అణచివేతలను, వివక్షలను, అవమానాలను తట్టుకొని నిలబడి ప్రతిఘటించిన తీరును చిత్రించినది, మూడవ పాయ తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ స్పృహకు సంబంధించినది.

కవి జనించటమంటే ఆలోచనల విత్తనం పగలటం/ అది కవిత్వ మొక్కై పెరగటం/ కవి పుట్టుక లోకం పుట్టుక/ కవి పెరగటం లోకం ఎదగటం/ కవి కదలటం చైతన్య చలనం అంటూ కవి విశిష్టతను కావ్య ప్రారంభంలోనే తెలియజేశారు. తెలంగాణ ప్రాంతంలో కవులు కోకొల్లలుగా ఉన్నారని, దట్టమైన అడవి లాగ చిక్కటి కవులు ఉన్నారని, ఎదురుగాలుల్లా, తుఫానులా కవులు విరుచుకుపడతారని, కష్టాల కన్నీళ్లు పూతలాగా పూసి కాయలాగా కాస్తారని చెప్పారు. ఇక్కడి కవులు జీవన సత్యాలను తెలియజేస్తారనే విషయాన్ని స్పష్టపరిచారు. తెలంగాణ ప్రాంత కవులకు సమాజం పట్ల ఉన్న నిబద్ధత గూర్చి తెలియజేశారు. మనకోసం ఏదీ తెరిచి ఉండదు/ తలుపులు పగలగొట్టుకొని పోవాలి/చూస్తూ పోతే ఇంతే/ చేస్తూ పోతేనే చరిత్ర అంటూ అవకాశాలు ఎప్పుడూ మన కోసం ఎదురు చూడవు, మనమే అవకాశాల్ని వెతుక్కుంటూ పోవాలి అంటూ చరిత్ర నిర్మాతలుగా మారాలంటే తెగువ తప్పనిసరి అని చెప్పారు. తెలంగాణ కవుల్ని సోక్రటీసు వారసులుగా ప్రకటించారు. మట్టిని ముద్దాడి మట్టిని ఆలింగనం చేసుకొని బతుకునిచ్చిన మట్టిని ఒంటి నిండా రాసుకొని ఆ మట్టి పంచే జీవికలను అక్షరాలా మట్టి ముద్దలను చేస్తున్నవారే తెలంగాణ కవులని తెలియజేశారు.

నా బువ్వను నాక్కాకుండా చేస్తే అది యుద్ధమే/ నా నేలను నా క్కాకుండా చేస్తే అది యుద్ధమే/నా మాట యుద్ధమే నా నడక యుద్ధమే నా సూపు యుద్ధమే/ అంటూ కవితాక్షిపణుల్ని ప్రయోగించి తెలంగాణ ద్రోహులకు సవాలు విసిరారు. ముగింపు, మొదలుకు మధ్య జీవిత తెరలను ఎత్తగలగటమే కవి అంటే, కవిత్వమంటే అంటూ కవికి, కవిత్వానికి సరికొత్త నిర్వచనమిచ్చారు. మానవత్వం మనుషుల్లో ఏవిధంగా కనుమరుగైపోతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఎవరెస్టు శిఖరంపై జెండాను ఎగరేయవచ్చు, సరిహద్దులు దాటి విధ్వంసం చేయవచ్చు కానీ మనుషుల మధ్య కనుమరుగైపోతున్న మానవత్వాన్ని ఎవరు నాటాలి అని ప్రశ్నిస్తూనే ఆ పని చేసేది కవిత్వమే అని సమాధానమిచ్చారు. తెలంగాణను చైతన్య చలన గీతంగా అభివర్ణిస్తూ రుద్రవీణకు యుద్ధ విద్యలు నేర్పిన కేంద్రం/ తెలంగాణ నిత్య జీవన వేదం/ తెలంగాణ జానపద జ్ఞాన పథం/ జయ జయ ధ్వానాల దగద్దగాయమాన విశ్వరూపం అంటూ తెలంగాణ గొప్పతనాన్ని దృశ్యమానంగావించారు. తాను పుట్టిన నేల అందరిదనీ, ఏ ఒక్కరి సొత్తు కాదనీ, ఈ నేలను చెరపడితే ఎప్పటికీ ఒప్పుకునేదే లేదని కరాఖండిగా చెప్పేశారు. నేలంటే తల్లి కదా/ నేలంటే బతుకు కదా/ నేలంటే సర్వస్వం కదా అంటూ నేలతో తనకు ఉన్నటువంటి బంధం మామూలు బంధం కాదని అది పేగు బంధమని స్పష్టపరిచారు.

కాలాన్ని కంప్యూటర్లలో కాకుండా కావ్యంలో చూసుకుంటానని, కవి సమాజానికి అద్దం లాంటివాడని తెలియజేశారు. గతానికి వర్తమానానికి గీటురాయి కవే అంటూ సమాజంలో కవికి ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలియజేశారు. కవులు చాలా మంది ఉంటారు. కాని కాలం బూజు దులిపిన వాడే నిజమైన కవి అని అంటారు. కవిత్వం యొక్క విస్తృత ప్రయోజనాలను గూర్చి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇలా తెలియజేశారు. కవిత్వాన్ని పల్లె గోరింటాకు చేయాలి/ కవిత్వాన్ని గ్లోబల్ పటంగా మార్చాలి/ కవిత్వాన్ని ఐటి చేయాలి/ఐటి నడిబొడ్డులో విప్లవాలు పూయించి/ కవిత్వంగా కాత కాయించాలి/ కవిత్వం ఎందులోనైనా ఒదుగుతుంది. కవిత్వమే ఈ ప్రపంచమనీ, కవిత్వ పాదాలే జీవన వేదాలనీ, కవిత్వం ఏకంగా ఒక రాష్ట్రాన్ని సాధించి పెట్టిందని చెబుతూ కవిత్వం యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు.

జై తెలంగాణ అంటుంటే జన్మ ధన్యమైంది/ఈ జన్మకు ఇంతకంటే గొప్పదేముంటది/ఈ భూగోళం మీద ఇదే పెద్ద అవార్డు అని తెలంగాణ పట్ల, తెలంగాణ ఉద్యమం పట్ల,తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలనే ఆకాంక్ష పట్ల ఈ కవికి ఎంత అనురక్తి ఉన్నదో పై కవితా పంక్తుల ద్వారా అర్థమవుతుంది. కవి ఎప్పుడూ ప్రజల పక్షమే ఉండాలని, ఎలాంటి కుతంత్రాలకు తావు లేకుండా ఉండాలని కోరారు. ఎక్కడ తలవంచకుండా, తలదించకుండా నన్నునేను నరుక్కుని/ నాకు నేను నరుక్కుని/ నాకు నేనుగా మొలకెత్తా అంటూ తన త్యాగనిరతిని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో సమస్త తెలంగాణ ప్రజలు ఆ ఉద్యమానికి మద్దతు తెలిపి, ఆ ఉద్యమంలో ఎలా పాల్గొన్నారనే విషయాన్ని కవిత్వీకరించిన విధానం బాగుంది. తెలంగాణ నేలంతా సమ్మె రూపు ఎత్తింది / తల్లి సంకలో బిడ్డ పాలు తాగుతూ పిడికిలి బిగించింది. తల్లి సంకలోని బిడ్డ సైతం పాలు తాగుతూ పిడికిలి బిగించిందని చెప్పడం ఉద్యమ తీవ్రతను తెలియజేయడమే.

తెలంగాణ రాష్ట్రం సాకారం కోసం ఆనాటి ఉద్యమంలో పసిపిల్లల నుండి పండు ముసలుల వరకు ఏ విధంగా పనిచేశారో మనకు తెలుసు. ఆనాటి ఉద్యమ నాయకుడైన కెసిఆర్ గురించి ఆయన ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారనే విషయాన్ని ఇలా ప్రస్తావించారు. అతని మాట ఒక సమ్మోహనాస్త్రం / అతని మాట ఒక విజయ విన్యాసం/ ఆయన మాట యుద్ధ ఫిరంగుల మోత అంటూ కెసిఆర్ నాయకత్వబలం, అమరుల త్యాగఫలం వల్ల రాష్ట్రం సాకారమయ్యిందన్న విషయాన్ని స్పష్టపరిచారు. తెలంగాణ పదమే ఆధునిక జీవనవేదం అని అభివర్ణించడంలో తెలంగాణ పట్ల వీరికి ఎంతటి గౌరవభావం ఉందో, ఉద్యమం పట్ల ఎంత నిబద్ధత ఉందో తెలుస్తుంది.

హైదరాబాదు అనేది ఒక విశ్వ నగరం. ఈ నగర వీధుల్లో సంచరిస్తే విశ్వసంచారం చేసి వచ్చినట్లే. మనిషితనం చెరిగిపోకుండా ఉండే సంస్కృతి ఈ నేలది. మసీదులు, మందిరాలు, సిలువలు అన్నీ పక్కపక్కనే కలిసి ఉంటాయి.భిన్న సంగీత రాగాల సాగర తీరం గంగా జమునా తహజీబ్ సంస్కృతి నిలయం.హైదరాబాదు మానవీయ మహాలయం, సమతల మమతల కేంద్రం అని తెలియజేస్తూ ఈ నగరం రోజూ రారమ్మని ఆహ్వానించే భూపాలరాగం / ఈ నగరం రోజూ హుషారు ఎక్కించే జానపద గేయం అంటూ నగరం ప్రత్యేకతను ఆవిష్కరించిన విధానం బాగుంది. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ తన జీవితాంతం తెలంగాణ కోసం చేసిన కృషిని ఇలా చెప్పారు. ఆధిపత్యాన్ని అడ్డంగా నరికిన భావజాల ఖడ్గం జయశంకర్/ పెనుగులాట ఉన్నంతకాలం మౌనరుద్రుడు స్వేచ్ఛకు పర్యాయపదం అంటూ జయశంకర్ సార్ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో పాట ప్రధాన ఆయుధం అయ్యింది.

ఒక విధంగా చెప్పాలంటే పాటే తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి కారణమైంది. అటువంటి పాట గురించి ఇలా చెప్పారు. పాట బోరున కురిసే వర్షం/ పాట ఒక పొద్దుపొడుపు/ పాట ఒక విముక్తి మహాప్రళయ గీతం/ పాట శాంతిని కోరే ప్రశాంత గీతం/ కాలం పాటతో పుట్టి పాటతో పెరిగి పాటగా కనుమూసి పాటగా ఉదయిస్తుంది/ పాట కాలక్రమం మానవ పరిణామ క్రమం. ఇలా ఏమాత్రం తడుముకోకుండా అలవోకగా పదాలను ప్రయోగించి కవిత్వానికి ఒక ఊపును, తూపును అందించగలిగే విలక్షణ శైలి జూలూరు సొంతం. కవిత్వం ఏం చేస్తుందంటే ఒక రాష్ట్రాన్ని సాధించి పెడుతుంది అని చెప్పడంలో తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి కవిత్వం గొప్ప పాత్ర పోషించిందనే విషయాన్ని తెలియజేశారు. ఇలా కవిత్వం ద్వారా ఏదైనా సాధించవచ్చు అనే విశ్వజనీనమైన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. మొత్తం పదమూడు భాగాలుగా విస్తరించిన గౌరీశంకర్ భావోద్వేగమే కాకుండా తెలంగాణ ఉద్యమ ప్రస్థానానికి నిలువుటద్దం ఈ దీర్ఘకావ్యం. గౌరీ శంకర్ కవిత్వం వెన్నెల్లో ఆడపిల్లలు ఆడుకున్నంత సున్నితంగా, నెమలీకలతో బుగ్గల మీద స్పర్శించినట్లుగా ఉండదు, చెంప మీద చెల్లున కొట్టినట్లు ఉంటుందిఅంటూ ఈ కావ్యానికి మరో ముందుమాట రాసిన వంశీకృష్ణ మాటల్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

డాక్టర్ తండు
కృష్ణ కౌండిన్య
9704731346

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News