Monday, December 23, 2024

తెలంగాణ బెబ్బులి

- Advertisement -
- Advertisement -
గంగులు రజాకార్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. సోయంగంగులు యవ్వనంలో గోదావరి తీరంలోని వేలేరుపాడు మండలం పేరంటాలపల్లిలో బాలానందస్వామి ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు. కూనవరం, కట్కూరు పరి సరాల్లోని కొండరెడ్డి, కోయ జనులకు విద్యాబుద్ధులు నేర్పుతూ, వారికి తిండి గింజలు పంచిపెడుతూ ఆదుకుంటున్నారు. ఆ స్వామి అనుచరుడైన సింగరాజు మాత్రం ఆదివాసీ యువకులను సమీకరించి రజాకార్లతో పోరాడుతున్నారు.

ప్రపంచ చరిత్రలో ఆదివాసీ పోరాటాలు అనన్యమైనవి. భూమి కోసం, భుక్తి కోసం, పీడన శక్తుల నుండి విముక్తి కోసం, ఆదివాసీలు చేసిన స్వయం పాలన ఉద్యమాలు చరిత్రలో విస్మరించబడటం చూస్తే నేటి పాలకులు, చరిత్రకారుల దౌర్భాగ్యస్థితిని గుర్తుచేస్తున్నాయి. ఇంకా చరిత్ర పుటల్లో చివరి మజిలీగా ఆదివాసీల త్యాగాలు మిగిలాయి.అనామకంగా మిగిలిన తెలంగాణ ఆదివాసీ యోధులలో రాంజీ గోండ్, కుమరం సూరు, రౌట కొండల్ వంటి యోధుల వరుసలో సోయం గంగులు దొర కూడా భవిష్యత్తు తరాలకు గుర్తే లేకుండాపోయారు. ఫ్యూడల్ భూసంబంధాల సమూల మార్పు కోసం తెలంగాణలో 1946 నుండి 1951 వరకు సాగిన మహోజ్వల సాయుధ పోరాటం ఒక సామాన్యుడిని సాహస యోధుడిగా మార్చింది.

మట్టి నుండి మాణిక్యాలు వెలికితీసినట్టు మట్టి మనుషుల నుండి మహా యోధుడిగా ఎదిగిన ఆ భూమి పుత్రుడే గంగులు దొర. కోయ బెబ్బులిగా ప్రసిద్ధి చెందిన గంగులు నిజాం రాజ్యం లోని దట్టమైన పాల్వంచ (పాత తాలూకా) అటవీ పరిధిలో తిరుగులేని నాయకుడు. ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం జమేదారు బంజర అనే కోయగూడెంలో రాముడు, పాపమ్మ దంపతులకు 1918లో జన్మించారు. గంగులు వ్యక్తిత్వం గానీ, పోరాట నాయకత్వం గానీ, శౌర్యపరాక్రమాలు గానీ, కోయగిరిజనులలో ఆయనపైగల అపార ఆదరాభిమానాలు గానీ ఎవరు సమగ్రంగా అందించలేకపోయారు. గంగులు ఉద్యమ జీవితం మూడు దశల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి దశలో గోదావరి తీరాన పేరంటాలపల్లి వద్ద ఆశ్రమం నిర్మించుకున్న బాలానందస్వామి కనుసన్నల్లో సింగరాజు నాయకత్వంలో నడిచిన నిజాం వ్యతిరేక పోరాటంలో గంగులు దళ నాయకుడిగా కీలక బాధ్యత వహించాడు.

అనతి కాలంలోనే కమాండర్ స్థాయికి ఎదిగిన గంగులు 1948 మార్చిలో పాల్వంచ ఏరియాలోకి ప్రవేశించిన కమ్యూనిస్టు దళంలో చేరిపోయాడు. గంగులు పార్టీలో చేరిన తర్వాతే కాస్త చదువుకోవడంతో సిపిఐ కమిటీలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు. చురుకైన యువతతో కమిటీలు నిర్మించాడు. కూలీరేట్ల పెంపు, పాలేర్ల జీతాల పెంపు, అక్రమ లెవీ సేకరణకు, అటవీ శాఖ కాజేసే పుల్లర్లకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నడిపాడు. పార్టీలో సెంట్రల్ కమాండర్‌గా ఎదిగాడు.గెరిల్లా దళాల నిర్మాణంలో గంగులు కీలకపాత్ర పోషించడంతో పాల్వంచ జంగల్ పూర్తి కమ్యూనిస్టుల స్థావరంగా మారింది.గంగుల పోరాట ఫలితంగా సువిశాల పాల్పంచ రూపురేఖలు మారాయి. దమ్మపేట కేంద్రంగా ఒక చెట్టు వద్ద ఉద్యమ జెండాను పాతాడు. ఒక ప్రజా కంటక భూస్వామిని అంతమొందించాడు. ఆయన బలీయమైన శక్తులకు భూస్వాములు గూడేలనువదిలి పారిపోయారు.

అటవీ, రెవెన్యూ శాఖల జులుం నశించింది. అన్ని శిస్తులు రద్దయ్యాయి. భూమి, అడవిపై హక్కు లభించింది. స్వాతంత్యానంతరం తొలుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా తెలంగాణ మాత్రం భారత యూనియన్‌లో విలీనం కాలేదు. ఈ నేపథ్యంలోనే 1948, సెప్టెంబర్ 13న యూనియన్ ప్రభుత్వం పోలీ సు చర్య పేరిట నిజాం ప్రభుత్వంపై సైనిక దాడికి దిగింది. ఆధునిక ఆయుధాలతో 50 వేల మంది సైనిక బలగాలు జనరల్ చౌదరి నేతృత్వంలో నిజాం భూభాగాన్ని చుట్టుముట్టడంతో 1948, సెప్టెంబర్ 17న నిజాం సర్కార్ లొంగిపోయింది. తెలంగాణలో వెల్లోడి నేతృత్వంలో సైనిక పాలన విధించబడింది. ఏజెన్సీ గూడేల నుండి భూస్వాములు పారిపోయి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతీకారంగా 1948 నుండి 1951 వరకు యూనియన్ సైనికులు ఇల్లందు, పాల్వంచ, దమ్మపేట, బూర్గంపాడు, వేలేరుపాడు ప్రాంతాల్లోని విప్లవకారులను, సానుభూతిపరులను, సామాన్యులను చిత్రహింసలుపెట్టారు. గంగులును మట్టుబెడితే తప్ప పా ల్వంచ ఏరియాలో ఉద్యమాన్ని అణచలేమని భూస్వాములు, రాజకీయ నాయకులు, పోలీసు, మిలిటరీ భావించింది.

అందుకు ఆంధ్రా సరిహద్దులోని జీలుగుమిల్లి (ప.గో) ఆనుకొని ఉన్న పాలచర్లకు చెందిన గంగులు సమీప బంధువైన వొగ్గెల చంద్రమ్మను పావుగా వాడుకున్నారు. ఆమె ఇచ్చిన జీలుగు కల్లు తాగి గంగులు స్పృహ కోల్పోయాడు. సైన్యం బంధించి రహస్యంగా దాచింది. పార్టీ రహస్యాలు చెప్పమని గంగులును చిత్రహింసలు పెట్టింది. అయినా ఏ విషయం బయటికి పొక్కలేదు. దమ్మపేటలో గంగులు కట్టిన జెండాను విప్పడానికే దమ్ముచాలని సైనికులు పిరికిగా బంధించి రుద్రాక్షపల్లిలోని రావిచెట్టుకు కట్టివేసి, ఆ వీరున్ని 1951, మే12 న కాల్చిచంపి నిస్సిగ్గుగా ఎదురు కాల్పులుగా చిత్రీకరించారు. గంగులు పోరాట చరిత్ర భవిష్యత్తరాలకు పాఠ్యాంశంగా అందించబడితేనే తెలంగాణ చరిత్రకు సార్ధకత.

గుమ్మడి లక్ష్మీనారాయణ
9392488904

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News