Monday, December 23, 2024

భిన్నత్వంలో ఏకత్వం: మా‘నవ’వాదం

- Advertisement -
- Advertisement -

story about unity in diversity

మనం ఉన్నది గురుత్వాకర్షణశక్తి ఉన్న గ్రహం మీద! పైకి వెళ్లిన ప్రతిదీ తప్పక కింది పడాల్సిందే! తప్పదు వస్తువులైనా, మనుషులైనా. కింద అందరినీ కలిపేది మానవత్వం. కింద వున్న వారిని పైకి లేచిన వారినీ పైకి లేచి కింద పడినవారిని అందరినీ. ప్రపంచంలోని అన్యాయాన్ని చూస్తూ వుండకూడదు. అది మన వెలుగుల్ని స్వాహా చేయడాన్ని అసలే ఒప్పుకోకూడదు, సహించకూడదు. ఆ లక్షణమే మనం బతికి వున్నామని చెప్పుకోవడానికి ఒక సాక్షం! అదే మానవత్వ ఆకర్షణ శక్తి!

మనిషిని మనిషీ, దేశాన్ని ఇంకో దేశం దోచే విధానం అంతం కావాలి. సామ్రాజ్యవాదం పేర చలాయిస్తున్న పెత్తనాన్ని అంతం చేయనిదే… మానవ జాతి అనుభవిస్తున్న బాధలు, దోపిడీ నివారించబడవు. దాన్ని అంతం చేయకుండా యుద్ధా లు వద్దని శాంతి కావాలని చెప్పే కబుర్లు ఒట్టి నయవంచనే అని అన్నాడు షహీద్ భగత్ సింగ్. ధనవంతుడు సముద్రం లాంటివాడు. సముద్రంలో ఎన్ని నీళ్లున్నా ఒక్కడి దాహం కూడా తీరదు. ధనవంతుడు కూడా తీర్చలేదు. సంస్కారవంతుడు బావిలాంటివాడు. బావి తన దగ్గరున్న కొద్ది నీళ్లతో అందరి దాహం తీరుస్తుంది. అదే మానవత్వం! మా‘నవ’వాదానికి మరో నిర్వచనం అక్కరలేదు. జాతి, మత, ప్రాంతీయ, వర్గ, వర్ణ విభజనలు చూడకుండా బావి అందరి దాహం తీరుస్తుంది. ఇది మా బావి అనీ, అది మీ బావి అని మానవత్వం లేని వారు బావుల్ని, చెరువుల్ని విభజించుకున్నారు. అది మళ్లీ వేరే విషయం. సరే అక్క పెండ్లికి మంచి బహుమతి ఇద్దామని ఇద్దరు చెల్లెళ్లు కష్టపడి, అతి కష్టం మీద ఐదు వేలు దాచిపెట్టుకున్నారు. ఇంతలో ఫేస్‌బుక్ ద్వారా కరీంనగర్‌లోని న్యూ ఎస్‌టి కాలనీలోని బత్తిని అంజవ్వ గురించి తెలుసుకున్నారు.

ఆమె భర్త చనిపోయాడు. చిన్న పాప వుంది. ఆమెకు కాలేయ వ్యాధి విషయం తెలుసుకున్న ఆ ఆడపిల్లలు వారు దాచి పెట్టుకున్న డబ్బు వెంటనే అంజవ్వకు పంపారు. స్వార్థాన్ని వదులుకుని ఇతరులకు సహాయపడడమే మానవత్వం. ఇలాంటి సంఘటనలు అరుదుగా అక్కడక్కడా జరుగుతూనే వుంటాయి. బొంబాయి వాసి అమన్, రహదారిపై నాలుగు రోజుల పాప ఏడుపు విన్నాడు. నిర్మానుష్యమైన ప్రదేశం.. ఏం చేయాలో తోచక పాపను తనతో తీసుకెళ్లాడు. అయితే ఆ పసిగుడ్డును పెంచేది ఎలాగో అతనికి తెలియదు. వెంటనే ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో పోలీసులు తనను ఆదుకోవాలని అభ్యర్థించాడు. విషయం పోలీసులకు చేరింది. వాళ్లు వెంటనే స్పందించి వచ్చి పాపను ఆసుపత్రిలో చేర్చి, చికిత్స చేయించారు. తరువాత బాలల అనాథాశ్రమంలో చేర్పించారు. అబద్ధాలతో సోషల్ మీడియాను కలుషితం చేస్తున్న వారి సంఖ్య చాలా పెద్దది. అయినా, నిజాల్ని నిజంగా బయటికి తెచ్చే వారి సంఖ్యను మనం పెంచుకుని, ఒక ఉద్యమంగా చేసుకోవాలి.

ఇటీవలి కరోనా కాలంలో ఒక సంఘటన జరిగింది. అది మా‘నవ’వాదానికి బలాన్నిచ్చింది. అనంతపురంలో ఒక బ్రాహ్మణుడు కరోనాతో చనిపోయాడు. చూడడానికి గానీ, అంత్యక్రియలు జరిపించడానికి గానీ అతని బంధుమిత్రలూ, స్నేహితులు ఎవరూ రాలేదు. రంజాన్ ఉపవాసంలో వున్న కొందరు ముస్లింలు అక్కడికి వచ్చారు. ఎవరి నుండీ ఏ స్పందనా రాకపోవడంతో వారే పాడె ఏర్పాటు చేశారు. పాడె మోశారు. అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వం ముందు మతం ఎప్పుడూ ఓడిపోతూనే వుంటుందని ప్రకటించకనే ప్రకటించారు. కొన్ని జీవన సత్యాల్ని మనం పిల్లలకు, యువకులకు అందిస్తూ వుండాలి. ఎందుకంటే అవి తెలుసుకోవడానికి మన తరంలో సగం జీవితం అయిపోయింది కదా? తర్వాత తరాలకు అంత సమయం ఎందుకు పట్టాలి. మన తరం వారు చాలా ఆలస్యంగా నేర్చుకున్నవి, రాబోయే తరాలు సత్వరం నేర్చుకోవాలి. దాని వల్ల సమాజ పురోగతి సత్వరం సాధ్యమవుతుంది. మానవత్వానికి సంబంధించిన విషయాలు ఊరికే మూర్ఖులతో వాదిస్తూ సమయం వృథా చేసుకోకూడదు. వాళ్లకు వాళ్ల మత విశ్వాసాలు, భ్రమలే ముఖ్యం. వాటిని నిలబెట్టుకోవడానికి అడ్డదిడ్డంగా మాట్లాడుతూ అరుస్తూ వుంటారు. మనోభావాలు దెబ్బతిన్నాయని బూతులు మాట్లాడుతుంటారు తప్పించి, నిజాలేమిటో, వాస్తవాలేమిటో అన్నది వారెంత మాత్రమూ పట్టించుకోరు.

2014 అసోం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పాసయి జ్యోతి అనే అమ్మాయి అసిస్టెంట్ ఇన్‌కంటాక్స్ కమిషనర్ ఉద్యోగం సంపాదించింది. ఆ అమ్మాయి 2013లో కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ తీసుకుని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసింది. కూతురు ఉద్యోగం సంపాదించిన విషయం తెలుసుకుని ఆమె తండ్రి సోబెరన్ ఆనందంలో కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. ఒక జీవిని, ఒక జీవితాన్ని నిలబెట్టిన మానవత్వపు విజయరేఖ అతని కళ్లలో కనిపించింది. అతి సామాన్యుడే అయినా, ఎంతో మంది గొప్పవాళ్ల కంటే గొప్పవాడు సోబెరన్! అతను తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకునే చిన్నపాటి వ్యాపారి. అతి కష్టం మీద కూతుర్ని చదివించి పెద్ద చేశాడు. అతను గతాన్ని గుర్తు చేసుకుని ఓ మాట చెప్పాడు. “నాకు చెత్తకుండీలో అమ్మాయి దొరకలేదు. బొగ్గు గనిలో ఒక వజ్రం దొరికింది” అని! ఆమె ఎవరి బిడ్డో అతనికి తెలియదు. కానీ తల్లీ, తండ్రీ అన్నీ తానై ఒక ప్రాణిని బతికించాడు. ఒక జీవితాన్ని నిలబెట్టాడు.

అందుకు, అందరూ అతణ్ణి అభినందించాల్సిందే! కొన్నేళ్ల క్రితం బండి తోపుకుంటూ వెళుతున్నప్పుడు ఒక నిర్జన ప్రదేశంలో చెత్తకుప్ప మీద ఏడుస్తూ ఒక ఆడ శిశువు కనిపించింది. వెనకా, ముందూ ఏమీ ఆలోచించకుండా పరుగెత్తి ఆ శిశువును చేతుల్లోకి తీసుకున్నాడు. అంతే! భారతీయ సమాజంలో ఆదరణ లేక అవకాశాల్లేక.. అవకాశాలివ్వక..ఎన్నో జాతులు శతాబ్దాలుగా నిర్లక్షం చేయబడ్డాయి. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాలి! మానవత్వాన్ని మేల్కొల్పాలి!! ఒక కూరలమ్ముకుని బతికే వాడికి వున్న ఔదార్యం ప్రభుత్వాలకూ, కార్పొరేట్లకూ లేకపోతే ఎలా?
చాలా మంది సీతా సాహూ అనే మహిళ పేరు విని వుండకపోవచ్చు. ఒకప్పుడు విన్నా, మరిచిపోయి వుండొచ్చు. మన

మీడియా ఇలాంటి వారిని పట్టించుకోదు కదా? సీతా సాహూ ఈ దేశానికి రెండు ప్రత్యేక ఒలింపిక్ మెడల్స్ తెచ్చిన మహిళ. జీవిక కోసం ప్రస్తుతం పానీపురి అమ్ముకుని బతుకుతూ వుంది. కొందరికి అప్పనంగా ప్రజల సొమ్ము కోట్లకు కోట్లు కట్టబెట్టే మన ప్రభుత్వాలకు కళ్లూ, చెవులూ రెండూ లేనట్లేనా? ఉత్త పున్యానికి భారత రత్న పొంది కోట్లకు కోట్లు సంపాదించిన క్రికెట్ ఆటగాడు సచిన్ పేరు చెబితే దేశం యావత్తూ గుర్తు పడుతుంది. అతనేమో ఉచితంగా వచ్చిన తన ఫెరారీ కారుకు రాయితీ కావాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటాడు. అలాంటి వారిని నెత్తిన మోసే ప్రభుత్వాలు సీతా సాహూ లాంటి వారిని ఎందుకు పట్టించుకోవూ? ఇలాంటి అంశాలు ఎత్తి చూపడం ఎందుకంటే దేశంలో అసమానతలు, వివక్షలు వుండకూడదని! దీనికి జస్టిస్ చంద్రచూడ్ 2018 ఆగస్టు 30న ఒక మంచి వివరణ ఇచ్చారు “ప్రజాస్వామ్యానికి అసమ్మతి అనేది ఒక ‘సేఫ్టీ వాల్వు’ లాంటిది. దాన్ని అనుమతించకపోతే, ఏకంగా ప్రజాస్వామ్య ప్రెజర్ కుక్కర్ పేలిపోతుంది!” అని. కేవలం మన దేశంలోనే ప్రపంచంలో ఎక్కడా జరగని చిత్ర, విచిత్రలు జరుగుతుంటాయి.

కరోనా వ్యాక్సిన్‌లు అందరితో కలిపి కాకుండా, తమ ‘అగ్రవర్ణం’ వారికి విడిగా వేయాలని కొందరు డిమాండ్ చేస్తారు. ఆసుపత్రిలోని పేషంట్లు కొందరు, తమ ‘కులపోడి’ రక్తమే కావాలని డిమాండ్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కేరళ రాష్ట్రంలో ఒక అద్భుతం జరిగింది. అక్కడ 1.24 లక్షల మంది విద్యార్థులకు కులం లేదు. కేరళ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చేరే విద్యార్థులు తాము ఏ కులానికీ, ఏ మతానికీ చెందమని స్పష్టం చేశారు. “ప్రతి సంవత్సరం ఇలాంటి చిన్నారుల సంఖ్య తమ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతూ వుందని” అసెంబ్లీలో కేరళ విద్యామంత్రి సి.రవీంద్రనాథ్ ప్రకటించారు. దేశంలో ఈ మార్పు ఎంతో ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు స్ఫూర్తి నిస్తోంది. కులం మతం కాలమ్స్ వదిలేసి విద్యార్థులు ఇస్తున్న డిక్లరేషన్ సంచలనం సృష్టిస్తోంది. ముందు ముందు ఆ కాలమ్స్ అప్లికేషన్లలో ప్రింట్ చేయకుండా ఉండే పరిస్థితి రావాలని కోరుకుందాం!

నార్వేలో ఒక మంచి పద్ధతి వాడుకలో వుంది. ఉదాహరణకు ఒక మహిళ మరో ఇద్దరిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లిందనుకుందాం. ముగ్గురికి మూడు మీల్స్ అని డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. ఆమె ఇతర నిస్సహాయులకు సహాయపడాలనుకుంటే మరో రెండు భోజనాలకు అదనంగా డబ్బు చెల్లిస్తుంది. ‘ఫైవ్ మీల్స్, టూ సస్పెండెడ్‌” అని అంటుంది. ఐదు భోజనాలకు డబ్బు చెల్లించి, మూడు మాత్రమే తీసుకుంటుంది. ఎవరైనా అతిదీన స్థితిలో వుండి, డబ్బు చెల్లించి భోజనం చేయలేని వాళ్లు వచ్చి అడిగితే రెస్టారెంట్ వాళ్లు వారికి భోజనం పెడతారు!’ ఎనీ సస్పెండెడ్ మీల్స్’ అని అడిగిన వారికి “ఎనీ సస్పెండెడ్ కాఫీ” అని అడిగిన వారికి రెస్టారెండ్ సహకరిస్తుంది. అదేదో దానం చేస్తున్నట్టు కాక, కస్టమర్స్ గౌరవభావంతో డొనేట్ చేస్తారు. అంతే గౌరవభావంతో రెస్టారెంట్ వాళ్లు, పేదలకు అందిస్తారు.

మానవీయ విలువలు గల హుందాతనంతో అలా ముక్కూ మొహం తెలియకుండా కూడా గౌరవభావంతో చేసే ఆ సహాయం ఎంత గొప్పది? ‘డబ్బులు అదనంగా వస్తున్నాయి కదా? వెనకేసుకుందాం’ అనే వ్యాపార ధోరణి, కక్కుర్తీ ప్రదర్శించకుండా నిజాయితీగా ప్రజలకు సేవ చేసే మంచి మనసు కూడా రెస్టారెంట్ యాజమాన్యానికి వుంటుంది. విషమ పరిస్థితులు ఎదురై ఆర్థికంగా దిగజారిన వారు కూడా, మానసికంగా కుంగిపోక హుందాగా ‘ఎనీ సస్పెండెడ్ మీల్స్’ అని అడగడమే కాదు, తాము కూడా ప్రయోజకులై సస్పెండెడ్ కాఫీ, టిఫిన్, మీల్స్‌కు డబ్బు చెల్లించాలని ఉబలాటపడతారు కూడా! అందుకే తెలుగు కవి ఆలూరి బైరాగి అంటారు… “కత్తిరించిన ఒత్తులే/ వెలుగుతాయి దివ్యంగా బాధా దగ్థ కంఠాలే పలుకుతాయి శ్రావ్యంగా” అని! అందుకే మనకిప్పుడు ఎవరి అవసరం వుందో తెలుసు? ఈ సమాజంలో ఆర్థిక, సాంఘిక, ప్రాంతీయ అసమానతలు వుండకూడదని మానవజాతి అంతా ఒకటే అని నినదిస్తూ రచనలు చేసే రచయితలు కావాలి. గళమెత్తే గాయకులు కావాలి. ఆ భావాన్ని ప్రతిబింబించే చిత్రకారులూ, శిల్పులూ కావాలి. ఆచరణలో పెట్టగల కార్యకర్తలు, సమాజ సేవకులు కావాలి! ‘సేవ’ అనే ముసుగు ధరించి రాజకీయాలు చేసే ముసుగు వీరులు వృథా! వృథా!! సమాజాన్ని పాతరాతి యుగంలోకి ఈడ్చుకుపోయే ప్రభుత్వాలు అంతకన్నా వృథా.

డా. దేవరాజు- మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News