Wednesday, January 22, 2025

నిన్న స్వప్నం.. నేటి సత్యం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సమాజం అరవై ఏళ్లు అరిగోస పడ్డది. చరిత్రలో ప్రతి సందర్భంలో దగాకు గురైంది. ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష పాలకులకు పట్టలేదు. కొట్లాడిన ప్రతిసారి సమైక్యశక్తులు, ఢిల్లీ పాలకులు.. ఉద్యమకారుల నెత్తురు ఏరులై పారించిన్రు. కానీ.. తెలంగాణ నిరంతరం నిలిచి పోరాడింది. ఉద్యమాన్ని ఎందరో నాయకులు నడిపించిన్రు. కానీ.. సమైక్య శక్తుల్ని, ఢిల్లీ పాలకుల మాయలో పడ్డరు. నయవంచనకు గురయిన్రు. ప్రతి దశలో ఉద్యమం సజీవంగా కొనసాగింది. రగిలే నిప్పు కణిక లెక్క మండుతూనే ఉంది. ఆ నిప్పు కణికతో కాగడా వెలిగించిన దిక్సూచి, ఉద్యమ నాయకుడు కెసిఆర్. మూడక్షరాల పేరు… మూడు తరాల కొట్లాటకు కొనకు చేర్చారు.

తెలంగాణ వస్తుందో రాదో అనే ఆవేదన రానివ్వమంటూ సమైక్యశక్తుల హేళన. ఢిల్లీకి గులాముల్లాగా పని చేసే కీలుబొమ్మల్లాంటి కాంగ్రెస్ నేతలు. సమైక్య పాలకుల ఏలుబడిలో గోస పడుతున్నాం… మమ్మల్ని దాస్య విముక్తుల్ని చేయండి అంటే ఎవరికీ పట్టలేదు. 1969లో 369 మంది విద్యార్థుల్ని కాంగ్రెస్ సర్కారు బలి తీసుకుంది. ఎప్పుడు తెలంగాణ కోసం ఎవ్వరు గొంతెత్తినా… ఉక్కు పాదంతో అణచివేసింది

ఓ వైపు ఉద్యమం హోరెత్తుతుంటే… పుండు మీద కారం చల్లినట్టుగా హైదరాబాద్ ఫ్రీ జోన్ వ్యవహారం తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా అంగీకరించే ప్రసక్తే లేదని, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని కెసిఆర్ డిమాండ్ చేశారు. ఇక సమైక్య రాష్ట్రంలో తాడోపేడో తేల్చుకోవాల్సిందేని నిర్ణయించారు. 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం తీవ్రమైంది. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది. మళ్లీ సమైక్య శక్తులకు తలొగ్గి డిసెంబర్ 23న వెనక్కి తీసుకుంది. తెలంగాణ సమాజం మళ్లీ తిరుగుబాటు చేసింది.

2004లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్… 2014 వరకు పదేళ్లపాటు నాన్చింది. 12 వందల మంది అమరవీరుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. సకల జనుల పోరాటం, వీరుల త్యాగం, కెసిఆర్ రాజకీయ ఎత్తుగడలతో మన రాష్ట్రం మనకు వచ్చింది. పదేళ్లలో అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. పల్లెలు పట్టుగొమ్మలుగా మారాయి. మన పొలాలకు గంగమ్మ తల్లి గలగలా పారుతూ వచ్చింది. రైతుల ఆత్మహత్యలు, వలసలు ఆగాయి. 2014 గంటల విద్యుత్ అందుతోంది. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగింది. ఐటి నుంచి పారిశుధ్యం వరకు, మెడికల్ కాలేజీల నుంచి మౌలిక సదుపాయాల వరకు ఉక్కు సంకల్పంతో తెలంగాణ దూసుకుపోతోంది. పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకు సంక్షేమం అందుతోంది.

అప్పుడు చీకట్లు… వెలుగులు మన కల. అప్పుడు బీడు నేలలు… పచ్చని పైర్లు మన కల. ఒకనాడు సంక్షోభం… సంక్షేమం మన కల. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం… నిన్న స్వప్నం… నేటి సత్యం. ఇదంతా సాధించిన ఓ మహాత్మా… ఓ మహర్షి…. కెసిఆర్. తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ… నిను మరువదు ఈ గడ్డ. దశాబ్దాల కన్నీళ్లు తుడిచిన నేతవు నువ్వు. అందుకో దీక్షా దివస్ స్ఫూర్తి సంకల్పం. అప్పుడు… ఇప్పుడు… ఎప్పుడూ మీతోనే, మీ వెంటే తెలంగాణ సమాజం. జై తెలంగాణ.

ఇనుగుర్తి సత్యనారాయణ
9704617343

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News