Monday, December 23, 2024

అకస్మాత్తుగా పంట పొలాల్లో పడిన వింత బెలూన్..

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ఓ పారాషూట్, బెలూన్ అకస్మాత్తుగా పంట పొలాల్లో దిగింది. ఈ సంఘటనతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. కాని ప్రజలు మాత్రం ఆందోళనకు గురయ్యారు. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు మర్పలి తహసిల్ధార్ శ్రీధర్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ బెలూన్‌లు ఎక్కడి నుండి వచ్చాయని ఆరా తీశారు.

అయితే టాటా రీసెర్చ్ కన్సల్టెన్సీకి చెందినవిగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని ఈసీఐల్ నుండి ప్రయోగించినట్లుగా చెబుతున్నారు. వాతావరణాన్ని అంచనా వేసి మార్పులు, చేర్పులు కనుగొనేందుకు గాను రీసెర్చ్ చేయడానికి విదిలిన బెలూన్లుగా అధికారులు పేర్కొంటున్నారు. పొలాల్లో దిగిన బెలూన్‌కు కెమెరాలు బిగించి ఉన్నాయి.

ఈ పారషూట్ బెలూన్ వాతావరణాన్ని పరిశీలించేందుకు గాను 35 కిలోమీటర్ల ఎత్తు, హైదరాబాద్ నగరానికి 50కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించే శక్తి ఉంటుందని, కాని అంతకంటే ఎక్కువ ఎత్తులో, నిర్ధేశించిన దూరం కంటే దూరంగా రావడంతో సిగ్నల్ పెయిల్ అయ్యి నిర్వాహకుల కంట్రోల్ తప్పినట్లు తెలిసింది. బెలూన్‌లో హైడ్రోజన్ నింపి పారాషూట్ ద్వారా ప్రయోగానికి పంపినట్లు తెలిసింది. ఇలాంటి పరిశోధనలు చాలా చేసినప్పటికీ ఇది పెయిల్ అయ్యిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నిర్ధేశించిన దూరం కంటే దూరంగా వెళ్ళడంతో టాటా రీసెర్చ్ పరిశోధక అధికారులు ఎవరికీ ప్రమాదం జరగకుండా రైతుల పంట పొలాల్లో నిర్వీర్యం చేసినట్లు టాటా రీసెర్చ్ పరిశోధన అధికారులు ప్రవీణ్‌రెడ్డి, ప్రసాద్, సంపత్‌లు పేర్కొన్నారు. కాగా ప్రసాద్‌రావు అనే రైతు పొలాన్ని ఆనందం అనే రైతు కౌలుకు సాగుచేసుకుంటున్నాడు. కౌలు రైతుకు పంట నష్టపరిహారం చెల్లించే విషయం కంపెనీ అధికారులకు నివేధిక సమర్పించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News