మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: అత్యధికశాతం జనాభా నివసిస్తున్న గ్రామాల్లో ప్రజల జీవనం విస్తరిస్తేనే ఆర్ధిక వ్యవస్థ బలపడుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆగ్రోస్ సంస్థ సహకారంతో మేనేజ్ సంస్థ ద్వారా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు 45రోజుల పాటు శిక్షణ పొందిన 30 మంది అభ్యర్ధులకు ఒక్కొక్కరికీ రూ.10లక్షల చొప్పున నాబార్డు, మేనేజ్ సంస్థలు , స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో 36శాతం సబ్సిడిపై రుణాలు అందజేసే కార్యక్రమం జరిగింది. శుక్రవారం నాడు మంత్రుల నివాస ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి లబ్ధిదారులకు శిక్షణ ధృవపత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విజయం వెనుక కష్టం ఉంటుందన్నారు. ఏ రంగంలోనైనా కష్టపడితేనే గుర్తింపు లభిస్తుందన్నారు.
వివిధ అవసరాల మీద వచ్చే రైతులతో , వినియోగదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని లబ్ధిదారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గతానికి, ఇప్పటికీ ప్రజల అవసరాల్లో చాలా మార్పులు వచ్చాయని వివరించారు. పట్టణీకరణతో నగర జీవితంలో ఎన్నోరకాల వత్తిళ్లు పెరిగాయన్నారు. గ్రామాల్లో ప్రజల అవసరాలను గుర్తించి వ్యాపారాలను ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆగ్రోస్ సంస్థ అందించే శిక్షణ కార్యాక్రమాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని సూచించారు. నాణ్యమైన సేవలు ,నాణ్యమైన వస్తువులు ప్రజలకు అందిస్తామనే నమ్మకం కలిగించాలన్నారు. కొంచెం కొత్తగా ఆలోచిస్తే వ్యాపారంలో రాణించడం పెద్ద సమస్యేమి కాదని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ సంస్థ ఎండి రాములు తదితరులు పాల్గొన్నారు.