Wednesday, January 22, 2025

ఫ్రాన్స్‌తో బలపడిన బంధం

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ఉభయ తారకంగా జరిగింది. అసలే భారత, ఫ్రాన్స్ వ్యూహాత్మక బంధం రజతోత్సవం, ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం కలిసిన సందర్భం. జాతీయ దినోత్సవ సందర్భంగా ఫ్రాన్స్ జరుపుకొన్న బాస్టైల్ డే పరేడ్‌కు కూడా ప్రధాని మోడీ హాజరయ్యారు. అందులో మన సైన్యం కూడా పాల్గొన్నది. పనిలో పనిగా 26 రాఫెల్ జెట్ యుద్ధ విమానాలను, మూడు స్కార్పెన్ క్లాస్ సబ్‌మెరైన్లను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి ప్రధాని మోడీ పచ్చజెండా ఊపి వచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూల్ మాక్రాన్ ప్రధాని మోడీని అత్యంత ఆత్మీయుడుగా పరిగణించి ఘన స్వాగతం పలికారు. ఆ దేశ ప్రధాని ఎలిసబెత్‌తో కూడా మోడీ చర్చలు జరిపారు. ఆర్థిక, వాణిజ్య, ఇంధన, పర్యావరణ, విద్య తదితర రంగాలలో రెండు దేశాల మధ్య సహకారం గురించి చర్చించారు. ఫ్రెంచి సెనెట్ ప్రెసిడెంట్ గెరార్డ్ లార్చర్‌తో కూడా చర్చలు జరిపారు. 2009లో మొదటిసారిగా అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఫ్రాన్స్‌లో ఈ గౌరవం లభించింది. ప్రధాని మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియాన్ పురస్కారంతో ప్రెసిడెంట్ మాక్రాన్ సత్కరించారు. ఈ పురస్కారాన్ని నెపోలియన్ బోనాపార్టే నెలకొల్పారు. సాధారణంగా ఫ్రెంచి జాతీయులకే ప్రకటించే ఈ పురస్కారాన్ని ఫ్రాన్స్ కోసం పని చేసే, దాని ఆశయాల సాఫల్యం కోసం కృషి చేసే బయటి వారికి కూడా ఇస్తారు. భారత ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక సంబంధం రెండవ దశకు చేరుకొన్నదని ఈ సందర్భంగా ఉభయ దేశాలు ప్రకటించడం గమనార్హం. పొరుగునున్న చైనాతో సత్సంబంధాలు లోపించి సరిహద్దు వివాదం రగులుకొంటున్న నేపథ్యంలో భారత దేశం ఆయుధ సంపత్తిని పెంచుకోడానికి అమిత ప్రాధాన్యమిస్తున్నదని ప్రపంచం భావిస్తున్నది. 2015లో పారిస్‌ను సందర్శించిన ప్రధాని మోడీ ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ జెట్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి అంగీకారం కుదుర్చుకొని వచ్చారు. వాటి విలువ అప్పటికే 4.24 బిలియన్ డాలర్లు. ఇప్పుడు 26 రాఫెల్ జెట్లను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. ప్రధాని మోడీ ఫ్రాన్స్‌లో వున్నప్పుడే మన రక్షణ శాఖ న్యూఢిల్లీలో ఈ కొనుగోలుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. వీటి ధర, ఇతర అంశాలపై ఫ్రెంచ్ ప్రభుత్వంతో మంతనాలు జరుపుతామని ఇదే యుద్ధ విమానాలను ఇతర దేశాలకు ఏ ధరకు అమ్ముతున్నారో తెలుసుకొని తగిన నిర్ణయాలు తీసుకొంటామని భారత రక్షణ శాఖ ప్రకటించింది. విమానాలకు మరమ్మతులు వగైరా అంశాల మీద కూడా చర్చిస్తామని వెల్లడించింది. ఫ్రాన్స్‌లో భారత సంతతి విశేషంగా వున్నారు. బ్రిటన్, ఇటలీ, జర్మనీల తర్వాత భారతీయులు అత్యధికంగా వున్న నాలుగవ దేశం ఫ్రాన్స్. భారత విద్యార్థులను, వృత్తి నిపుణులను మరింతగా ఫ్రాన్స్ ఆకర్షిస్తున్నది. భారతీయ సంతతి వారిని ఉద్దేశించి కూడా ప్రధాని ప్రసంగించారు. భారత, ఫ్రాన్స్‌ల మధ్య బహు ముఖీనమైన బంధాన్ని గూర్చి ఈ సందర్భంగా ప్రధాని మోడీ వివరించారు. వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ఇండియాలో పెట్టుబడులు పెట్టవలసిందిగా భారతీయ సంతతికి ఆయన విజ్ఞప్తి చేశారు. భారత్ మాతాకీ జై, వందే మాతరం నినాదాలు ఈ సభలో మిన్నంటాయి. భారతీయ సంతతి ఫ్రాన్స్‌లో సాధిస్తున్న ఘనతరమైన లక్షాలు భారత దేశానికి గర్వకారణమని అన్నారు. అయితే అమెరికాకు గాని, ఫ్రాన్స్‌కు గాని అటువంటి ఏ విదేశానికి మన ప్రధానులు వెళ్ళినా వారికి మనం చేసే మేలే ఎక్కువగా వుంటుంది గాని, అక్కడి నుంచి మనం తెచ్చుకొనేది స్వల్పంగానే వుండడం గమనించవలసిన విషయం. ఇటీవల అమెరికా అధికారిక ఆహ్వానం మీద అక్కడికి వెళ్ళిన ప్రధాని మోడీ దాని నుంచి యుద్ధంలో వినియోగించే డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకొని వచ్చారు. 31 యుద్ధ డ్రోన్లను 3 బిలియన్ డాలర్లకు అంటే 25 వేల కోట్ల రూపాయలకు అమెరికా నుంచి కొనుగోలు చేయడానికి అంగీకారం కుదిరింది. అయితే ఈ డ్రోన్ల ధర విషయంలో వివాదం తలెత్తింది. ఒక్కొక్క డ్రోన్‌కు 880 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇతర దేశాలు మన కంటే నాలుగు రెట్లు తక్కువ ధరకు ఈ డ్రోన్లను అమెరికా నుంచి కొంటున్నాయని, రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో ఫ్రాన్స్‌తో కుదుర్చుకొన్న మాదిరిగానే ఈ డ్రోన్ల విషయంలో ఇండియా నష్టపోతున్నదనే విమర్శ వినవచ్చింది. మన ఆయుధాల అవసరం ఎంతటిదైనప్పటికీ అమెరికా, పాశ్చాత్య దేశాల ముచ్చట్లకు, మురిపాలకు, పొగడ్తలకు పొంగిపోయి వాటికి మాత్రమే లాభసాటి అయిన షరతుల మీద ఆయుధాల కొనుగోలు ఒప్పందాలు చేసుకొంటున్నామనేది నిజమే అయితే అందుకు ఎంతైనా ఆందోళన చెందవలసి వుంది. అమెరికా, దాని మిత్ర దేశాలు ఆయుధాల విక్రేతలుగా ఏనాటి నుంచో ప్రసిద్ధి పొందాయి. వాటి ఆకర్షణలకు లొంగకుండా మన ప్రయోజనాలను కాపాడుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News