Saturday, December 28, 2024

మన ప్రాజెక్టులపై ఒత్తి’ఢీ’

- Advertisement -
- Advertisement -

కృష్ణా జలాల తరలింపునకు వెలిగొండ ప్రాజెక్టును సిద్ధం చేసిన ఎపి
గ్రేటర్ రాయలసీమకు శ్రీశైలం ద్వారా 43 టిఎంసిలు వచ్చే సీజన్ నుంచి నీటి విడుదల ప్రారంభం

తెలంగాణ ప్రాజెక్టులకు తప్పని నీటి తిప్పలు

మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీ జలాల తరలింపునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సిద్ధం చేసింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నల్లమల అభయారణ్యం మీదుగా గ్రేటర్ రాయల సీమ ప్రాంతానికి కృష్ణా తరలించేందుకు ఉద్దేశించిన ఈ పాజెక్టులో అత్యంత కీలకమైన సోరంగ మార్గాల పనులు పూర్తయినట్టు ఎపి ప్రభుత్వం మంగళవారం నాడు ప్రకటించింది. అంతే కాకుండా వచ్చే జూన్ నుంచి ప్రారంభమయ్యే వర్షాకాలంలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. కృష్ణానదీ వరద జాలాలపై ఆధారపడి నిర్మించిన వెలిగొండ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొత్తం 43.50టిఎంసిల నీటిని తరలించనున్నారు.

కృష్ణానది జలాలపై ఆధారపడి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులు నిర్మించారు. ఉమ్మడి ఎపిలో అప్పటి ప్రభుత్వాలు వదర జలాలు, మిగులు జాలాల పేరుతో రాయల సీమ నెల్లూరు ప్రాంతాలకు నీటిని తరలించేందుకు తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా సుజల స్రవంతి తదితర ప్రాజెక్టులు నిర్మించారు. తాజాగా వెలుగొండ ప్రాజెక్టును కూడా వరద జలాలపై ఆధారపడే చేపట్టారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులపై మరింత నీటివత్తిడి పడనుంది. ఇప్పటికే నికర జలాలకూడా అందక ఆయకట్టు కటకటలాడుతోంది.

ఈ ఏడాది యాసంగిలో సాగర్ ఆయకట్టకు నీరు లేక పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. తొలుత కృష్ణానదీ వరద నీటి ప్రవాహంలో 45 రోజుల్లో 43.50 టిఎంసిల నీటిని తరలించాలని వెలిగొండ టన్నల్స్‌ను , వరద కాలువను డిజైన్ చేశారు. అయితే ఆ తర్వాత డిజైన్లు మార్చి కేవలం 30 వరద రోజుల్లోనే లక్షం మేరకు నీటిని తరలించేందుకు వీలుగా పనులు పూర్తి చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ప్రకాశం , నెల్లూరు కడప జిల్లాల్లో 4.60లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు ఈ జిల్లాల పరిధిలోని 30 మండలాల్లో 16లక్షల మందకి తాగునీటి అవసరాల తీర్చనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు వెలిగొండ ఈఈ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకు అనువుగా అత్యంత సంక్లిష్టమైన టన్నల్ పనులకు సంబంధించిన అడ్డంకులు కూడా తొలగిపోయాయి.

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ లో మేఘా బ్రేక్ త్రూ మంగళవారం జరిగింది. దీనితో ఈ ప్రాజెక్టులో రెండు టన్నెల్స్ నిర్మాణం చిన్న చిన్న పనులు మినహా పూర్తయినట్టే. టన్నెల్ బోరింగ్ మెషిన్ ద్వారా రెండు టన్నెల్స్ నిర్మాణాన్ని మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్ ) పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ టన్నెల్స్ తవ్వకం 15 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. 2020లో తొలి టన్నెల్ లో 3.6 కిలోమీటర్లు, రెండో టన్నెల్ లో ఏడున్నర కిలోమీటర్ల పనులు చేపట్టి విజయవంతంగా వాటిని పూర్తి చేసింది. టన్నెల్స్ తవ్వకాన్ని పూర్తి చేసిన అధికారులు , కాంట్రాక్టు సంస్థ, సిబ్బందిని ప్రభుత్వం అభినందించింది. తొలి టన్నెల్ ను 2021 జనవరి నెలలో పూర్తి చేసింది. 13 నెలల్లోనే మూడున్నర కిలోమీటర్ల తవ్వకం పనులు పూర్తి చేసి ఈ టన్నెల్‌ను పూర్తి చేసింది. తొలి టన్నెల్ పనులు ప్రారంభమైన 12 సంవత్సరాల తరువాత బ్రేక్ త్రూ ఐంది. రెండో టన్నెల్ లో ఏడున్నర కిలోమీటర్ల తవ్వకం పనులను టి బి ఎం ద్వారా మంగళవారం పూర్తి చేసింది. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ భాగంలోని కొల్లం వాగు వరకు రెండు టన్నెల్స్ తవ్వకం పనులను జల వనరుల శాఖ చేపట్టింది. తొలి టన్నెల్ ఏడు డయా మీటర్ల వ్యాసార్ధంతో, రెండో టన్నెల్ 9 . 2 డయా మీటర్ల వ్యాసార్ధంతో తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో టన్నెల్ పొడవు 18. 82 కిలోమీటర్లు. తొలి టన్నెల్ నుంచి మూడు వేల క్యూసెక్కులు, రెండో టన్నెల్ నుంచి 8500 క్యూసెక్కులు చొప్పున్ రోజుకు ఒక టిఎంసి నీటిని తరలించేలా వీటిని డిజైన్ చేశారు. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పనులు చేపట్టింది. తొలి టన్నెల్ పనులు చేపట్టిన 13 నెలల కాలంలో మిగిలిన 3. 6 కిలోమీటర్ల తవ్వకాన్ని పూర్తి చేసి బ్రేక్ త్రూ సాధించింది. ఆ తరువాత రెండో టన్నెల్ పనులు ప్రారంభించి ఈ రోజు బ్రేక్ త్రూ సాధించింది.ఈ టన్నెల్స్ పూర్తి అయ్యి శ్రీశైలం జలాశయం నుంచి నీటి తరలింపు ప్రారంభము అయితే ప్రకాశం జిల్లాలో 3. 5 లక్షల ఎకరాలు, నెల్లూరు లో 80 వేల ఎకరాలు, కడప జిల్లాలో 30 వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. ఈ మూడు జిల్లాల్లోని 30 మండలాలకు చెందిన 16 లక్షల మంది ప్రజలకు తాగు నీరు అందుతుంది.

వెలుగొండ టన్నెల్ లో ఆసియాలోనే అతిపెద్ద కన్వేయర్ బెల్ట్ ను ఉపయోగించారు. ఇది 39 మీటర్ల పొడవు ఉంది. టన్నెల్ తవ్వకం సమయంలో వచ్చే రాళ్లు, మట్టిని ఇది బయటకు తీసుకొస్తుంది. ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, ఇనప సామగ్రి , యంత్రాలను కర్నూల్ జిల్లా సంగమేశ్వరం నుంచి 125, 800 టన్నుల బరువును మోయగలిగే రెండు పంట్ల ద్వారా కొల్లం వాగు వరకు తరలించి, అక్కడి నుంచి వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి తరలించింది. పనిచేసే కార్మికులు సిబ్బందికి అవసరమైన మంచినీటిని కూడా మరబోట్ల ద్వారా తరలంచాల్సిన క్లిష్టమైన పరిస్థితి నెలకొన్నా వాటన్నింటిని అధిగమించి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశామని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఎం ఈ ఐ ఎల్ మేనేజర్ పీ. రాంబాబు తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ పనులు జరిగే ప్రాంతం అభయారణ్యంలో ఉంది. ఇక్కడ వన్యప్రాణులకు ఇబ్బంది కలిగించేలా ఎలాంటి పనులు చేపట్టకూడదు. ప్రతి రోజూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోగానే పనులు చేపట్టాలి. ఆ తరువాత ఎలాంటి వాహన, యంత్ర కదలికలు ఉండకూడదు. ఈ ప్రాజెక్ట్ అంతా నీలం సంజీవరెడ్డి పులుల అభయారణ్యం పరిధిలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. ప్రతి సంవత్సరం వచ్చే భారీ వర్షాలు, వరదల ప్రభావం కూడా పనులపై పడకుండా చర్యలు చేపట్టింది . జలవనరుల శాఖ ఈ ఈ .జనార్ధన రెడ్డి వెలుగొండ టన్నెల్ బ్రేక్ త్రూ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టతరమైన వెలుగొండ ప్రాజెక్ట్ పనులను ఇష్టం తో చేసి పూర్తి చేశామన్నారు. పులుల అభయారణ్యంలో ఈ ప్రాజెక్ట్ ఉన్నా నిబంధనలు పాటించి పనులు పూర్తి చేశామని, వచ్చే సీజన్లో టన్నెల్స్ ద్వారా నీటిని విడుదల చేస్తామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News