Sunday, January 19, 2025

డిఫాల్టర్లకు భారీ వడ్డన

- Advertisement -
- Advertisement -

గడువులోగా సిఎంఆర్ బియ్యం ఇవ్వని మిల్లర్లపై 25% పెనాల్టీ

పూరిస్థాయిలో మిల్లర్ల నుంచి బియ్యాన్ని తీసుకోవాల్సిందే
డిఫాల్ట్ చేసుకుని కార్పొరేషన్ కు ఇస్తామంటే కుదరదు
25శాతం ఫెనాల్టీ వసూలు చేస్తాం
అవసరానికి మించి గన్నీ సంచుల సేకరణపై విచారణ
అదనపు కలెక్టర్ల సమావేశంలో పౌరసరఫరాల కమీషనర్

మనతెలంగాణ/హైదరాబాద్:  ఏది ఏమైనా సరే… ఈ నెల 31వ తేదీలోగా గత ఏడాది వానాకాలం సీజన్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను మిల్లర్ల నుంచి పూర్తిస్థాయిలో సేకరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమీషనర్ డి.ఎస్.చౌహాన్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి నుంచి డిఫాల్ట్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైసు మిల్లర్ల నుంచి బియ్యాన్ని సేకరించి ఎఫ్ సిఐకి అప్పగించడానికి కేవలం 13 రోజుల సమయం మాత్రమే ఉందని ఈ సమయంలో అందరం సమిష్టిగా, సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్, డిఫాల్ట్ మిల్లర్ల నుంచి ఫెనాల్టీ వసూలు, పిడిఎస్ బియ్యం నాణ్యత, పాత గన్నీ సంచుల సేకరణ, వినియోగం తదితర అంశాలపై ఎంసిఆర్ హెచ్ ఆర్డీలో గురువారంనాడు అడిషినల్ కలెక్టర్లు, డిసిఎస్ వోలు, డిఎంలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమీషనర్ డి.ఎస్. చౌహాన్ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా ఎఫ్‌ఎస్‌ఐకి బియ్యం ఇవ్వకుండా డిఫాల్ట్ చేసుకుని 31వ తేదీ తర్వాత గతంలో మాదిరిగా పాత పద్ధతిలో పౌరసరఫరాల సంస్థకు బియ్యం ఇస్తామంటే కుదరదని, ఎట్టిపరిస్థితులోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రజా పంపిణీకి కార్పొరేషన్ దగ్గర అవసరమైనంత బియ్యం నిల్వలు ఉన్నాయని, ఆ పరిస్థితిలో ప్రతి బియ్యం గింజను కూడా ఎఫ్ సిఐకి అప్పగించాల్సిందేనని అన్నారు.

ప్రతిసారి డిఫాల్ట్ కావడం తర్వాత కార్పొరేషన్‌కు బియ్యం ఇవ్వడం ఒక అలవాటుగా మారిందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాత పద్ధతులను పక్కన పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ కాదనే విషయాన్ని ప్రతిఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. డిఫాల్ట్ అయిన మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో డిఫాల్ట్ అయిన మిలర్ల నుంచి 25శాతం ఫెనాల్టీని వసూలు చేస్తామని ఈ విషయంలో ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. బియ్యం సేకరణ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారని వెల్లడించారు. సిఎంఆర్ డెలివరీలపై ఇప్పటికే మంత్రి కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత డెలివరీలలో కాస్తా వేగం పెరిగిందని ఇందుకు కృషిచేసిన జిల్లా కలెక్టర్లకు అభినందనలు తెలియజేశారు.రాష్ట్రంలో మిల్లింగ్ సామర్థ్యం ప్రకారం మిల్లింగ్ జరగడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజుకు ఒక షిఫ్ట్ ప్రకారం 71వేలు, రెండు షిఫ్ట్ల ప్రకారం 1.40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లింగ్ చేసే సామర్థ్యం ఉన్నా, ఏ ఒక్కరోజు కూడా సామర్థ్యం ప్రకారం మిల్లింగ్ జరగడంలేదన్నారు.
పిడిఎస్ బియ్యం నాణ్యత మెరుగుపడాలి :
ప్రజాపంపిణీ ద్వారా పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం నాణ్యత చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉందని, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకూడదని అధికారులను చౌహాన్ ఆదేశించారు. కొంత మంది అధికారులు ఉద్దేశపూర్వకంగా అవసరానికి మించి అధిక మొత్తంలో గన్నీ సంచులను సేకరిస్తున్నారని,ఇందులో 20 శాతం, 30 శాతం కూడా వినియోగించని జిల్లాలు ఉన్నట్లు తన దృష్టికి రాగానే విచారణకు అదేశించడం జరిగిందన్నారు. వచ్చే సీజన్ నుంచి ఇటువంటి విధానాలకు స్వస్తి పలకాలని పౌరసరఫరాలశాఖ కమీషనర్ డి.ఎస్.చౌహాన్ హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News