Monday, December 23, 2024

ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు

- Advertisement -
- Advertisement -

జిల్లా ఎస్‌పి పుల్లా కరుణాకర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్‌పి పుల్లా కరుణాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం యాంటీ ర్యాంగింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్‌పి పుల్లా కరుణాకర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ ర్యాగింగ్ నేరమని, ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. విద్యార్థులు స్నేహపూర్వకంగా కలిసి మెలిసి విద్యనభ్యసించాలని ఎస్‌పి కోరారు. ర్యాగింగ్‌కు పాల్పడితే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వ్యసనాలకు బానిసై విద్యార్థులు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్‌పి కరుణాకర్ అన్నారు. విద్యార్థులు మొదట తాము చదువుకోవడానికి వస్తున్నామని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సరదాలకు వెళ్ళి కష్టాలను కొని తెచ్చుకోవద్దని, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేస్తూ దోషులుగా నిలవద్దని ఎస్‌పి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు దేవ్ డే, వైస్ ప్రిన్సిపాల్ కె రఘు, చిట్యాల సీఐ వేణుచందర్, గణపురం ఎస్‌ఐ సాంబమూర్తి, డాక్టర్లు రాజేష్, అంజనేయ బాబు, ప్రత్యూష, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News