వరంగల్ : మద్యం షాపు పరిసరాల్లో ఎవరైనా బహిరంగంగా మద్యం సేవించి ప్రజలను ఇబ్బందులు పెట్టిన వారితో పాటు మద్యం షాపు యజమానిపై కఠిన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా సీపీ రంగనాథ్ మాట్లాడుతూ రాత్రి సమయాల్లో మద్యం దుకాణాల పరిసరాల్లోని ఇతర వ్యాపార సంస్థల ముందు ఇష్టానుసారంగా మందుబాబులు బహిరంగంగా మద్యం త్రాగుతూ పరిసర ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు మద్యం దుకాణాల ముందు వాహనాలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం వలన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
ఇప్పటి నుంచి మద్యం దుకాణాల పరిసరాల్లో బహిరంగంగా ఎవరైనా మద్యం సేవిస్తూ, మద్యం దుకాణాల ముందు పార్కింగ్ చేసినా, వాహనాల వలన ప్రజలు ఏదైన ఇబ్బందులు గురవుతున్నట్లు మీ దృష్టికి వస్తే తక్షణమే ప్రజలు సెల్‌ఫోన్ ద్వారా ఫొటో, వీడియోను తీసి వరంగల్ పోలీస్ కమిషనర్ వాట్సప్ నెంబర్ 8712685100 నెంబర్‌కు పంపించాలని, వీటి ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మద్యం దుకాణ యజమానులు మద్యం దుకాణాల పరిసరాల్లో ఎవరూ మద్యం సేవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చే వారి వాహనాలను సరైన క్రమంలో మద్యం షాపు ముందుగా పార్కింగ్ చేయించేందుకు ప్రత్యేక వ్యక్తులను నియమించుకోవాలని, ఎవరైనా ప్రజలను ఇబ్బందులు కలిగిస్తూ మద్యం షాపుల పరిసరాల్లో మద్యం సేవించినట్లయితే సేవించిన వారితో పాటు దుకాణ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.