హైదరాబాద్ : త్వరలో ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క సారక్క జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈసారి జాతరలో సాంకేతికతను మరింతగా ఉపయోగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రోజుకు 3లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని దానికి తగ్గట్టుగా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్టు ఆమె తెలిపారు. సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి శాసనమండలి సమావేశ మందిరంలో మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. మేడారం జాతరకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఫిబ్రవరి 18వ తేదీన వస్తారన్న సమాచారం ఉందని మంత్రి పేర్కొన్నారు.
జాతరలో మెడికల్ శిబిరాలు, మాస్కుల పంపిణీ
ఇప్పుడు సమక్క సారక్క దేవస్థానం పర్యాటక స్థలంగా మారిందని మంత్రి సత్యవతి తెలిపారు. కరోనా కారణంగా భక్తులు ముందుస్తు దర్శనం కోసం భారీగా తరలి వస్తున్నారన్నారు. జంపన్నవాగు విషయంలో కొంత విమర్శలు వచ్చాయని ఇప్పుడు ఎలాంటి సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. జాతరలో మెడికల్ శిబిరాలు, మాస్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. షిప్ట్‌వైజ్‌గా దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేయబోతున్నట్లు ఆమె తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం బయోటాయిలెట్లు- రెగ్యులర్ టాయిలెల్స్ అందుబాటులో ఉంచినట్లు ఆమె పేర్కొన్నారు. భక్తులు గంటలపాటు క్యూ లైన్లలో నిల్చోకుండా అరగంటలో దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు ఆమె వెల్లడించారు. విఐపి పాసులపై టైమింగ్ స్లాట్ ఇవ్వబోతున్నట్లు ఆమె తెలిపారు.
1100 ఎకరాల రైతులకు నిధులు
సమ్మక్క జాతరకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రాలేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా కేంద్రాన్ని అడుగుతున్నామన్నారు. జాతర సందర్భంగా ఎకరానికి 6 వేల చొప్పున రైతులకు నిధులు ఇస్తున్నామని, ఇలా మొత్తం 1100 ఎకరాలకు ఇస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. జాతరకు దగ్గరలో భూమి కొనేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసిందన్నారు. జాతరకు వచ్చే భక్తుల దాదాపు 8 వేల బస్సులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.