మనతెలంగాణ/ హైదరాబాద్ : వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న డ్రగ్స్‌ను గుర్తించేందుకు అత్యాధునిక పరికరాలను పోలీసు శాఖలో ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో రాష్ట్ర స్థాయి నార్కోటిక్స్ కో-ఆర్డినేషన్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సోమేష్‌కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారం, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు, ఎక్సైజ్, అటవీ, గిరిజన సంక్షేమం, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తోంది.
రాష్ట్ర స్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ సమావేశాలు త్రైమాసిక సమీక్షలు, నివారణ చర్యలు తీసుకోవడం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గంజాయి సాగు చేస్తున్న రైతులకు రైతుబంధు నిలిపివేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. డ్రగ్స్ వ్యాపారులు, డ్రగ్స్ వాడే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని డిజిపి మహేందర్‌రెడ్డి తెలిపారు. వారిపై పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో డ్రగ్స్‌అండ్ నార్కోటిక్ ప్రివెన్షన్ సెల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, సిఐడి అదనపు డిజిపి గోవింద్ సింగ్, ఎన్‌సిబి జాయింట్ డైరెక్టర్ అరవిందన్, ఉన్నతాధికారులు నాయుడు, ముత్తా అశోక్ జైన్, రిజ్వీ, రాహుల్ బొజ్జా, రాజేష్ కుమార్, ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అధికారులు హాజరయ్యారు.