జెనీవా : దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 14 దేశాలకు విస్తరించిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వొ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ అతిగా స్పందించ వద్దని, కఠిన ఆంక్షలు అవసరం లేదని ప్రపంచ దేశాలకు సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత ఎంత? ప్రస్తుత వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ను సమర్ధంగా ఎదుర్కోగలవా ? తదితర ప్రశ్నలకు సమాధానం అన్వేషించ వలసి ఉందని ఆయన అన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నా ఇప్పటివరకు మరణాలు నమోదు కాలేదని, అయినా కొన్ని దేశాలు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయని, వీటివల్ల వైరస్‌ను నియంత్రించ లేమని ఆయన సూచించారు. పైగా పరిస్థితులు మరింత దిగజారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఒమిక్రాన్ గురించి పూర్తిగా తెలియక ముందే దక్షిణాఫ్రికాపై ఆంక్షలు విధించ వద్దని టెడ్రోస్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్‌పై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్న దక్షిణాఫ్రికా , బోట్సావానా దేశాలకు టెడ్రోస్ కృతజ్ఞతలు తెలిపారు. సరైన పని చేస్తున్నందుకు ఆ దేశాలను ఇతర దేశాలు శిక్షిస్తుండడం ఆందోళకరమన్నారు.