Monday, December 23, 2024

ఏప్రిల్ 3న బిసిల ఛలో ఢిల్లీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : చట్టసభల్లో 50 శాతం బిసి రిజర్వేషన్ల కోసం ఆందోళనా కార్యక్రమాలను ఉధృతం చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం నిర్ణయించింది. డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏప్రిల్ 3న ఛలో ఢిల్లీకి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆదివారం బిసి భవన్‌లో జాతీయ బిసి సంక్షేమ సంఘం కోర్ కమిటి సమాశేవం జరిగింది.గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కోర్ కమిటి నిర్ణయాలను ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 3న పార్లమెంటు వద్ధ భారీ ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఆందోళనా కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుండి బిసిలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బిసిలకు అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం టికెట్లు ఇవ్వాలనిడిమాండ్ చేశారు.

బిసిలకు అన్యాయం చేసే పార్టీల భరతం పడతామని హెచ్చరించారు. రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా అన్ని పార్టీలు బిసిలకు అన్యాయం చేస్తూ వస్తున్నాయని విమర్శించారు. రాజకీయ రంగంలో బిసిల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వారా తెలిసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాల్లో, లోకసభ, రాజ్మసభ, రాష్ట్రాల అసెంబ్లీ కౌన్సిల్స్ లలో 75 సంవత్సరాల బిసిల ప్రాతినిధ్యం సర్వే చేసి లెక్కించగా 14 శాతం దాటలేదంటే బిసిలకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తూనే ఉందని అన్నారు. బిసిలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఉన్నా రాజకీయ రిజర్వేషన్లు మాత్రం లేవని పేర్కొన్నారు. సామాజిక వర్గాలను విభజించి పాలిస్తున్నారని అన్నారు. బిసిలకు రాజకీయ అన్యాయం జరుగుతోందన్నారు. దేశంలోని 16 రాష్ట్రాల నుండి ఒక్క బిసి పార్లమెంటు సభ్యుడు లేరని, లోకసభలో 96 మంది మాత్రమే బిసి ఎంపీలు ఉన్నారని తెలిపారు.

తెలంగాణ లో 119 మంది ఎంఎల్‌ఎలు ఉంటే బిసిలు కేవలం 22 మంది మాత్రమేనని, 33 జిల్లాలకు గాను 20 జిల్లాల నుంచి ఒక్క ఎంఎల్‌ఎ లేరని కృష్ణయ్య తెలపారు. 129 బిసి కులాల్లో 120 కులాలు ఇప్పటి వరకు అసెంబ్లీ గడప దొక్కలేదన్నారు. 56 శాతం ఉన్న బిసిలకు రాజకీయ రంగంలో 14 శాతం, ఉద్యోగ రంగంలో 9 శాతం, పారిశ్రామిక రంగంలో ఒక శాతం, ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలలో 5 శాతం ప్రాతినిధ్యం లేదంటే చట్ట సభల్లో బిసిలకు జనాభా దమాషా ప్రకారం వాటా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్పష్టమవుతోందన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బిసిలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని, ఇందు కోసం పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి ఆమోదించుకోవాలని, బిసిల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని,

త్వరలో జరగబోయే జనగణనలో కులాల వారి లెక్కలు తీయాలని, బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని, బిసిలకు పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా ఇవ్వాలని, కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని 2 లక్షల కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పథకాన్ని ప్రవేశ పెట్టాలని, కోర్ కమిటి తీర్మానాలు ఆమోదించింది. ఈ కార్యక్రమంలో బిజి జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, అంజి, అనంతయ్య, నందగోపాల్, భూపేష్ సాగర్, రాజ్‌కుమార్, నిమ్మల వీరన్న, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News