మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైదరాబాద్ నగరంలో గురువారం ధర్నాలతో దద్దరిల్లింది. పెంచిన పెట్రోలు, డీజిల్ , గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టిఆర్‌ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది. నగర వ్యాప్తంగా టిఆర్‌ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ నిరననలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇందులో భాగంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని సివిల్ సప్లైయి కమిషనర్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ధర్నాల్లో హోమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవితతో పాటు సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం టిఆర్‌ఎస్ ఇంఛార్జీ తలసాని సాయి కిరణ్ యాదవ్‌తో పలువురు కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ఈ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఎమ్మెల్సీ కవిత, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు కట్టెల పోయిపై వంట చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవిత తల్లి ప్రేమను ప్రదర్శిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందంటూ దుయ్యబట్టారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.
వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు:
కేంద్రం పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలిని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు. ఇందులో భాగంగా సిపిఐ, సిపిఎంల ఆధ్వర్యలో రాస్తారోకోలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్ ఆధ్వర్యంలో యాప్రాల్ బస్టాండ్ వద్ద సిపిఐ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాలమల్లేష్ మాట్లాడుతూ మోడీ సర్కార్ పెట్రోల్ , డిజీల్ ధరలను పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని వేసిందని దుయ్యబట్టారు. 5నెలల కాలంలో గుర్తుకు రాని ముడి చమురు ధరల్లో మార్పులు 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక మోడీ సర్కార్‌కు గుర్తుకు రావడం పచ్చి మోసపూరిత విధానాలకు అద్దం పడుతుందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు కె.సహదేవ్, డి.జంగయ్య, పి. చంద్రయ్య, విజయ్, అంబేడ్కర్ సంఘం నాయకుఉల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ(ఎం) సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు.