Wednesday, January 22, 2025

కరెంట్ మీటర్ రీడర్ల సమ్మె

- Advertisement -
- Advertisement -

‘గృహజ్యోతి’ వివరాలు నమోదు చేయం
30 రోజులు పని కల్పించాలి.
కనీస వేతనాలు ఇవ్వాలి
ఆర్టిజన్లుగా గుర్తించాలి

మన తెలంగాణ / హైదరాబాద్: కరెంటు మీటర్ రీడర్లు సమ్మె బాట పట్టారు. సుదీర్ఘకాలంగా తమ సమస్యల్ని అధికారులకు మొర పెట్టు కుంటున్నా పట్టించుకోవట్లేదని, గత్యంతరం లేక సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందని మీటర్ రీడర్లు అంటున్నారు. పీస్ రేట్ వర్కర్లుగా పనిచేస్తున్న కరెంటు మీటర్ రీడర్లకు నెలలో కేవలం 15 రోజులు మాత్రమే పని ఉంటుంది. ఒక మీటరు రీడింగ్ తీస్తే వారికిచ్చేది కేవలం రూ.2.51 పైసలు. దానిలో కాంట్రాక్టర్లు 50 నుంచి 60 పైసలు మినహాయించుకొని మిగిలిన సొమ్మును వారికి చెల్లిస్తున్నారు. ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పనిచేశాక, మిగిలిన రోజుల్లో ఖాళీగా ఉండాల్సి వస్తున్నది. మిగిలిన 15 రోజుల పనికూడా తమకు కల్పించాలని పలుమార్లు విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సంస్థల్లోని అనేక విభాగాల్లో వీరి సేవల్ని వినియోగించుకొనే అవకాశాలు ఉన్నా, యాజమాన్యం వారికి పని ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయట్లేదు. సుదీర్ఘకాలంగా ఈ సమస్యపై వారు పలురూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. 15 రోజులు కరెంటు మీటర్ రీడింగ్ చేస్తే పీస్ రేట్ ప్రకారం వారికి వచ్చే వేతనం కేవలం రూ.5 వేల నుంచి రూ.6 వేల లోపు మాత్రమే దీనిలోనే రవాణా ఖర్చులు కూడా భరించాలి. రాష్ట్రవ్యాప్తంగా రెండు డిస్కంల్లో దాదాపు 2,200 మంది మీటర్ రీడర్లు కాంట్రాక్టర్ల ద్వారా పనిచేస్తున్నారు. తమకు 30 రోజులు పని కల్పించి, కనీస వేతనాలు ఇస్తూ ఆర్టిజన్లుగా గుర్తించాలనేది వారి ప్రధాన డిమాండ్. అనేక పోరాటాల ఫలితంగా వీరికి పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించారు. అయితే కాంట్రాక్టర్లు పీఎఫ్ సొమ్మును సక్రమంగా చెల్లించట్లేదు.
‘గృహజ్యోతి’తో తిప్పలు
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మీటర్ రీడింగ్ తో పాటు వినియోగదారుల ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఆహార భద్రతా కార్డు నెంబర్లు (రేషన్ కార్డు )కూడా నమోదు చేయాలని కాంట్రాక్టర్లు మీటర్ రీడర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఒక్కో మీటర్కు సంబంధించి వివరాల నమోదుకు 15 నుంచి 20 నిముషాల సమయం పడుతున్నదనీ, దీనివల్ల నిర్ణీత గడువులోపు తమకు అప్పగించిన మీటర్ల రీడింగ్ తీయలేకపోతున్నామని వారు చెప్తున్నారు. రీడింగ్ ఆలస్యం అయితే వినియోగదారుల శ్లాబ్ రేట్లు మారిపోయి, కరెంటు బిల్లులు అధికంగా వచ్చే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని కాంట్రాక్టర్లకు చెప్తే పట్టించుకోవట్లేదు. దీనితో ఈనెల 6, 7 తేదీల్లో మీటర్ రీడర్లు రాష్ట్ర వ్యాప్తంగా తమ వద్ద ఉన్న మీటర్ రీడింగ్ యంత్రాలను కాంట్రాక్టర్లకు అప్పగించేశారు. యాజమాన్యంతో మాట్లాడి తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. అయితే దీనికి కాంట్రాక్టర్లు అంగీకరించలేదు. ’మీ సమస్యలు పరిష్కారమైతే, మా ఆదాయం పోతుంది’ అంటూ రీడింగ్ యంత్రాలు స్వాధీనం చేసుకొని సైలెంట్ అయిపోయారు. ఫలితంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆరు గ్యారెంటీల్లో ముఖ్యమైన గృహజ్యోతి, మహాలక్ష్మి స్కీంలకు సంబంధించిన డేటా ఎంట్రీ నిలిచిపోయింది, ఈ రెండు స్కీంలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేయనున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తమ సమస్యల్ని పరిష్కరించాలని మీటర్ రీడర్లు కోరుతున్నారు.
మమల్ని పీస్ రేట్ వర్కర్లుగా చూడవద్దు: చిరంజీవి
ఉన్నత చదువులు చదువుకున్నాము,ఇదే సంస్థను నమ్ముకొని 22 ఏండ్ల నుంచి పనిచేస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మీటర్స్ యూనియన్ దక్షిణ డిస్కం ప్రధాన కార్యదరి జి. చిరంజీవి అన్నారు.నెలకు 30 రోజులు పనికల్పించి, ఆర్టిజన్లుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. సిఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన్ని కలిసి మా కష్టాలు చెప్పుకున్నామని, అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వానికి సహకరిస్తాం కే శేఖర్, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
సిఎం రేవంత్ రెడ్డి మా సమస్యలను పరిష్కరించాలి
సుదీర్ఘకాలంగా చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోలేక నానా అవస్థలు పడుతున్నామని,మా సమస్యల్ని సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరించాలని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. శేఖర్ విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వానికి సహకరించేందుకు మేం సిద్ధంమని, మమ్మల్ని ఉద్యోగాల్లోంచి తీసేస్తామని కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారని,మాకు 30 రోజులు పని కల్పించాలన్నారు.
కనీస వేతనం ఇవ్వాల్సిందేఃఈ. శ్రీధర్ ఇనుగాల శ్రీధర్, 327 యూనియన్ సెక్రటరీ జనరల్   కార్మిక చట్టాల ప్రకారం పీస్డ్ వర్కర్లు అయినా వారికి కనీస వేతనం చెల్లించాల్సిందే అని కానీ అది అమలు కావడం లేదని 327 యూనియన్ సెక్రటరీ జనరల్ ఈ శ్రీధర్ డిమాండ్ చేశారు. మీటర్ రీడర్లు చాలాకాలం నుంచి తమ సమస్యల్ని యాజమాన్యాల దృష్టికి తీసుకెళుతున్నారని, దీని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ ) సిఎండితో చర్చించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News