Saturday, December 28, 2024

కాంగ్రెస్‌తో కలసి దేశ ప్రతిష్ఠను హిండెన్‌బర్గ్ దెబ్బ తీసింది: కేంద్ర మంత్రి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హిండెన్‌బర్గ్ రీసర్చ్ కాంగ్రెస్‌తో కుమ్మక్కై దేశాన్ని అపఖ్యాతి పాల్జేసిందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సోమవారం ఆరోపించారు. ఆ యుఎస్ షార్ట్ సెల్లర్ సంస్థపై ‘అత్యంత కఠిన చర్య’ తీసుకోనున్నట్లు మంత్రి ప్రకటించారు. మార్కెట్‌ల క్రమబద్ధీకరణ సంస్థ సెబీ చైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్ శనివారం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం విదితమే. అదానీ అక్రమ ద్రవ్య తరలింపు కుంభకోణంలో ఉపయోగించిన బోగస్ ఆఫ్‌షోర్ ఫండ్లలో ఆమెకు, ఆమె భర్త ధావల్‌కు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.

కానీ ఆ దంపతులు ఆ ఆరోపణలను నిరాధారమైనవిగా తోసిపుచ్చడమే కాకుండా తమ ఆర్థిక వనరులు లోపాయికారీ కానివని స్పష్టం చేశారు. అదానీ గ్రూప్ కూడా తాజా ఆరోపణలను దురుద్దేశపూరితమైనవని పేర్కొన్నది. ఢిల్లీలో ఒక కార్యక్రమం సందర్భంగా విలేకరులతో మాట్లాడిన గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, జైరామ్ రమేష్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘దేశం పరువు తీస్తున్న ముఠా ఇది.

రాహుల్ (గాంధీ), జైరామ్ రమేష్, హిండెన్‌బర్గ్ మమ్మల్ని అపఖ్యాతి పాల్జేస్తున్నారు. దేశానికి జరుగుతున్న ఈ అవమానాన్ని మేము సహించబోం. వీరు దేశానికి శత్రువులు. హిండెన్‌బర్గ్‌పై ఇప్పుడు అత్యంత కఠిన చర్య తీసుకుంటాం’ అని గిరిరాజ్ చెప్పారు. రాహుల్ గాంధీని ‘బడే బాప్ కా బేటా’ అని గిరిరాజ్ పేర్కొంటూ, ‘రాహుల్‌కు రాష్ట్రం, దేశ పథం గురించి ఏమీ తెలియదు’ అని విమర్శించారున. అయోమయాన్ని, భయాన్ని సృష్టించజూస్తున్న అటువంటి వ్యక్తుల పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. హిండెన్‌బర్గ్ వ్యవహారంపై జెపిసి దర్యాప్తు కోసం కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ల గురించి ప్రశ్నించగా, ‘హిండెన్‌బర్గ్ వెనుక కాంగ్రెస్ ఉంది. భారత్‌ను నాశనం చేసే ఉపకరణం హిండెన్‌బర్గ్. రాహుల్ గాంధీ వంటి వారికి దీనిలో ప్రమేయం ఉంది’ అని గిరిరాజ్ సింగ్ సమాధానం ఇచ్చారు.

జెపిసికి డిమాండ్ లక్షం దేశాన్ని బలహీనపరచడమే: బిజెపి
కాగా, సెబీ చైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణపై జెపిసి దర్యాప్తు జరిపించాలన్న కాంగ్రెస్ డిమాండ్‌ను బిజెపి సోమవారం తోసిపుచ్చింది. భారత ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడం, దేశంలో పెట్టుబడులను నాశనం చేయడం లక్షంగా సాగిస్తున్న కుట్ర అది అని బిజెపి ఆక్షేపించింది. బిజెపి నేత మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ, ‘ప్రజలు తిరస్కరించిన తరువాత కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు, దాని సన్నిహిత మిత్ర సంస్థ ఉపకరణం భారత్‌లో ఆర్థిక అరాచకాన్ని, అస్థిరతను తీసుకురావడానికి కలసి కుట్ర పన్నాయి’ అని ఆరోపించారు.

2004, 2014 మధ్య కాంగ్రెస్ పది సంవత్సరాల పాలన పలు కుంభకోణాల మయం అని ప్రసాద్ విమర్శించారు. అటువంటి విమర్శనాత్మక నివేదికలను అప్పుడు ఎందుకు వెలువరించలేదని ఆయన ప్రశ్నించారు. ‘ఈ బోగస్ నివేదిక ఆధారంగా ఆర్థిక అరాచకం సృష్టిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పాత్ర ఉన్నది’ అని ఆయన ఆరోపించారు. మదుపరులు ఈ ‘కుట్ర’ను గ్రహించారని, మార్కెట్‌ను దెబ్బ తీసే ప్రయత్నాలను తిరస్కరించారని ప్రసాద్ నొక్కిచెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News