అయోధ్య: ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సోమవారం అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు తమ ఇళ్లు, ఆలయాల వద్ద నుంచి టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామ జన్మభూమి వివాదం చరిత్ర, దాని పరిణామ క్రమం ఈ విధంగా ఉంది.
1528: ముఘల్ సామాజ్రాధినేత బాబర్ సైన్యాధ్యక్షుడు బఖీ ఆధ్వర్యంలో బాబ్రీ మసీదు నిర్మాణం.హిందూ ఆలయాన్ని కూలగొట్టి దాని శిథిలాలపై మసీదును నిర్మించారని హిందువుల విశ్వాసం..అదే శతాబ్దాల వివాదానికి కారణమైంది.
1751: అయోధ్య, కాశీ, మథురను తమకు స్వాధీనం చేయాలంటూ బ్రిటిష్ పాలకులపై మరాఠాలు పోరాటం. ఈ విషయాన్ని బిజెపి ఎంపి బల్బీర్ పుంజ్ తాను రచించిన ట్రిస్ట్ విత్ అయోధ్య: కలనైజేషన్ ఆఫ్ ఇండియా పుస్తకంలో రాశారు.
1858: బాబ్రీ మసీదు రామ జన్మభూమిగా పేర్కొంటూ నిహంగ్ సిక్కుల వాదన. నిహంగ్ బాబా ఫకీర్ సింగ్ ఖల్సా తన 25 మంది నిహంగ్ సిక్కు అనుచరులతో కలసి మసీదులోకి చొరబడి ఇది రాముడి జన్మస్థలంగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు 2019లో వెలువరించిన చారిత్రాత్మక తీర్పులో పేర్కొంది.
1885: వివాదాస్పద బాబ్రీ మసీదు వెలుపల ఒక ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి కోరుతూ మహంత్ రఘుబీర్‌దాస్ ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దాన్ని తిరస్కరించినప్పటికీ వివాదాన్ని సజీవంగా ఉంచేందుకు మార్గం చూపింది. అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం వివాదాస్పద స్థలం చుట్టూ పెన్షింగ్ నిర్మించి హిందువులు, ముస్లింలు వేర్వేరుగా ప్రార్థనలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేసింది. ఇదే పరిస్థితి దాదాపు 90 ఏళ్లు కొనసాగింది.
డిసెంబర్ 22, 1949: బాబ్రీ మసీదు లోపల రామ్ లల్లా విగ్రహాలు కనిపించడంతో వివాదాస్పద స్థలంపై మతమనోభావాలు రెండు పక్షాలలో పెరిగిపోయి న్యాయపోరాటానికి దారితీశాయి. మసీదు లోపల రామ్ లల్లా విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయని, ఈ స్థలం తమదేనని హిందువుల వాదన. వివాదాస్పద స్థలంపై హక్కుల కోసం మొదటిసారి ఆ ఏడాది కోర్టులో పిటిషన్ దాఖలు.
1950-1959 వరకు కోర్టులో పెరిగిన పిటిషన్లు: రామ్‌లల్లా విగ్రమాలను పూజించడానికి హక్కులు కోరుతూ నిర్మోహి అఖారా కోర్టులో పిటిషన్లు. స్థలం తమకే చెందాలంటూ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు కోర్టుళో పిటిషన్లు.
ఫిబ్రవరి 1, 1986: హిందూ భక్తుల కోసం వివాదాస్పద స్థలం గేటు తాళాలు తీయాలని ప్రభుత్వానికి స్థానిక కోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఆగస్టు 14, 1989: వివాదాస్పద కట్టడం విషయంలో యథాపూర్వ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
డిసెంబర్ 6, 1992: శ్రీరాముడి జన్మస్థలంలో నిర్మించిన కట్టడంగా అత్యధిక శాతం హిందువులు విశ్వసించే 16వ శతాబ్దానికి చెందిన బాబ్రీ మసీదును కూల్చివేసిన కరసేవకులు.
ఏప్రిల్ 3, 1993:వివాదాస్పద స్థలంలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి కేంద్రం అయోధ్య చట్టాన్ని ఆమోదించింది.
ఏప్రిల్ 2002: వివాదాస్పద స్థలం అసలు యజమాని ఎవరో నిర్ధారించడానికి అలహాబాద్ హైకోర్టు విచారణ ప్రారంభం.
సెప్టెంబర్ 30, 2010: సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లా మధ్య వివాదాస్పద స్థలాన్ని మూడు ముక్కలుగా పంచాలని 2:1 మెజరాఇటీతో అలహాబాద్ హైకోర్టు తీర్పు.
మే 9, 2011: అయోధ్య స్థల వివాదంపై హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు.
జనవరి 2019: కేసు విచారణ కోసం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు.
ఆగస్టు 6, 2019: అయోధ్య స్థల వివాదంపై రోజువారీ విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు.
అక్టోబర్ 16, 2019: సుప్రీంకోర్టులో విచారణ పూర్తి..తీర్పు రిజర్వ్.
నవంబర్ 9, 2019: అయోధ్యలోని వివాదాస్పద స్థలంలోని మొత్తం 2.77 ఎకరాల భూమి రామ్ లాల్లాకు కేటాయిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు..కేంద్ర ప్రభుత్వ రిసీవర్‌కు భూమి అప్పగించాలని ఆదేశం. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని ప్రధాన ప్రాంతంలో ముస్లింలకు 5 ఎకరాలు కేటాయించాలని కూడా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం.
ఫిబ్రవరి 5, 2020: అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభలో ప్రకటన.
ఆగస్టు 5, 2020: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.
జనవరి 22, 2024: ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య రామాలయం ప్రారంభం.