సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్ : విద్యార్థులు తమ తరగతి పుస్తకాలతో పాటు, సమాజాన్ని కూడా చదవి, అనేక రుగ్మతలపై పోరాడాలని సిపిఐ
రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. సోమవారం నాడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ లో ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, సైద్ధాంతిక, రాజకీయ శిక్షణా తరగతులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్ కామన్ నుండి బొమ్మక్ ఆర్ కన్వెన్షన్ వరకు 2 కిలో మీటర్ల మేర విద్యార్థులు ప్రదర్శన భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎఐఎస్‌ఎఫ్ శ్వేత అరుణ పతకాన్ని ఎఐఎస్‌ఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి ఎన్ బాల మల్లేష్ ఎగరవేశారు. అనంతరం ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అద్యక్షుడు మణికంఠ రెడ్డి అధ్యక్షతన శిక్షణ తరగతుల సభ ప్రారంభం కాగా సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్రం పోరాటంలో విద్యార్థులను, యువకులను ఏకం చేసి, బ్రిటిష్ వారిని తరిమిన చరిత్ర ఎఐఎస్‌ఎఫ్‌ది అని తెలిపారు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్) విద్యార్థులకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతుందని, అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన సంఘంలో మీరున్నందుకు గర్వపడాలని అన్నారు. నేడు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, కవులు, కళాకారులు, రచయితలపై, ప్రజలకోసం మాట్లాడే వారిపై ఉపా కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. దేశ ప్రజలతో కుల, మతాల పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారని కూనంనేని ఆరోపించారు.
మరో అతిధి… మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మాదాల రవి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భావి భారత విధాతలని, ఏఐఎస్‌ఎఫ్ శిక్షణా తరగతులను ఉపయోగించుకొని, అన్ని విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. నిరంతరం చదువుతూ ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి బాలమల్లేష్, సిపిఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి సాయిలు గౌడ్, ఎఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్. అశోక్ స్టాలిన్, ఎఐఎస్‌ఎఫ్ పూర్వ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇ. ఉమ మహేష్, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఇటిక్యాల రామకృష్ణ , రెహమాన్, నాగజ్యోతి, నరేష్ ,వెంకటేష్, రఘురాం, క్రాంతి, రాజు, ప్రవీణ్, లెనిన్, రాష్ట్ర నాయకులు ,అన్వర్ , హరీష్ , చిన్న , సందీప్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్ది ప్రతినిదులు పాల్గొన్నారు.