Wednesday, January 22, 2025

దళిత జీవన కదంబం

- Advertisement -
- Advertisement -

పురాణాలుగా దైవభక్తికి, ఇతిహాసంగా రాచకీర్తికి సీమితమైన సాహిత్యంలో సామాన్యునికి స్థానం దక్కడం వెనుక ఎంతో శ్రమ కూడుకొని ఉంది. పీడితులు తమ కథలు తామే చెప్పేందుకు, వినేందుకు, రాసుకునేందుకు, చదువుకునేందుకు ఎదురైన అడ్డు తొలగింపుల కోసం కలాల యుద్ధమే జరిగిందనాలి. దళిత సాహిత్యం నిలబడేందుకు ఇప్పటికీ శక్తిని కూడదీసుకుంటోంది. సామాజిక అంతరాల్ని అనుభవిస్తున్న వర్గాల కథలను ’ఇవి మనుషులుగా మనందరికి చెందినవి’ అనే అవగాహనతో కాకుండా బాధితులు రాసుకుంటున్న రచనలుగా చూసే దృష్టిలోపం ఇంకా పోలేదు. వివక్షను ప్రశ్నించే పోరులో ఇతర వర్గాలు వెనుక ఉండి సానుభూతి ప్రకటించడమే దీనికి ఉదాహరణ. మన శాస్త్రాల్లో కష్టాలు కొన్ని కులాలకు, సుఖాలు కొన్ని కులాలకు రాసిపెట్టబడ్డాయి. ఈ శాస్త్రసమ్మతాల కంచెను పెరికివేసే సాహిత్యం బాధిత కులాల నుంచి వస్తోంది. వీటిలో ఓ పదునైన కలం పేరు ’దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి’. ఈయనలో ఒక తాత్వికత ఉంది. ఊర్లో వివక్షను రెండో స్థానానికి జరిపి కలుపుగోలుతనానికి పెద్దపీట వేస్తాడు. దళిత దుఃఖం కన్నా కుల ఔన్నత్యానికి పట్టం కడతాడు.

మాదిగ కుల కట్టుబాట్లు, సంస్కృతి, జీవన సరళిలోని ప్రత్యేకతలను పూస గుచ్చి చెబుతాడు. కష్టాలు కష్టాలే, ఆత్మగౌరవానికి అవి అడ్డుకావు అన్నట్లు పాత్రల మర్యాదకు భంగం రానీయడు. రచన విషయానికొస్తే ఒక రీసర్చ్ స్కాలర్ తన ప్రాజెక్ట్ పై వర్క్ చేసినట్లు అంతా కూలంకషంగా ఉంటుంది. ఒక గ్రామం యూనిట్ గా దళిత కోణంలో నడుస్తున్న కథలో ఊరు జనం పాత్రోచితంగా కలిసిపోవడం ఓ ప్రత్యేక రచనా సరళిగా సాగిపోతుంది.‘గంగ జాతర’ అనే నవలిక ద్వారా మరోసారి ఎజ్రాశాస్త్రి మాదిగ నేపథ్య సామాజిక జీవన చిత్రణను అందించారు. గంగ జాతర అనే శీర్షిక నది ప్రాంతంలో జరిగే జాతరలో పాటు ప్రధాన పాత్రధారి గంగ యొక్క జీవన క్రమాన్ని కూడా సూచిస్తుంది. దళిత క్రైస్తవుల హిందూ జీవన అనుసరణ అడుగడుగునా కనిపిస్తుంది. జాతర కోసం ఏర్పాట్లు, తప్పెట పలకల చప్పుళ్ళు తరతరాలుగా ఆ జాతి బాధ్యతగా వస్తున్నాయి. నెల రోజుల ముందు నుంచే కర్రసాము, వృత్తి విద్దెల తర్ఫీదు ఉంటుంది. ఇంటికొక తప్పెట వాద్యం జాతరలో మోత మోగించాల్సిందే. అంతా మాదిగ పెద్ద వెంకటరత్నం నేతృత్వంలో సాగుతుంది.

ఈ క్రమంలో తప్పెట డప్పును ఎలా తయారు చేస్తారో వెంకటరత్నం ద్వారా రచయిత చెప్పిస్తారు. గంగ జాతర వర్ణన కంటికి ఆనేలా ఉంది. యాదవరాజులే దీనికి పూజారులు. వారి సహకారంతో మాదిగలు, వారి ఉపకులాలు ఈ జాతరను జరుపుకుంటారు. మాదిగ ఉపకులాల కళా ప్రదర్శనల వర్ణన ఇందులోని మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రతి యేడు గ్రామానికి వచ్చి మాస్టినోల్లు, ఆసాది, బైండ్లు, చిందోళ్లు తమ విద్యలను ప్రదర్శించి మాదిగల ఆదరణను పొందుతుంటారు. జాంబవపురాణం, పోలేరమ్మ ఒగ్గు కథ ఎప్పుడూ ఉండేదే.మాదిగలకు గంగ జాతర, క్రిస్టమస్ రెండు ఒకటే అని చెప్పిస్తాడు రచయిత. క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొని రైతులు, యాదవులు, ఊర్లోని అష్టాది వర్ణం క్రిస్మస్ చెట్టుకు, యేసయ్య చిత్రపటానికి మొక్కుకొని పంటల్లో మొదటి ఫలాన్ని సమర్పిస్తారని రాశాడు. మొదటి రోజు క్రీస్తు జననం నాటకమేస్తే రెండో రోజు సత్య హరిశ్చంద్ర ఆడుతారు. మతం మారక ముందటి ఆచారవ్యవహారాలు సగౌరవంగా పాటింపబడటం జీవన వైవిధ్యంగా చూడవచ్చు. మాదిగ పెద్ద వెంకటరత్నం కూతురు గంగ. ఆమె తల్లి రాహేలమ్మ. పిల్లల కోసం వాళ్ళు గంగమ్మ దేవతని మొక్కితే పుట్టిందే గంగ. బిడ్డని స్కూల్లో చేర్చేప్పుడు పిల్ల పేరు మార్గరెట్ అని రాయనా అని టీచర్ అడిగితే ’ససేమిరా వద్దమ్మా! మాయమ్మీ గంగమ్మ అంసిన పుట్టింది’ అంటుంది తల్లి.

గంగ చదువు ఆపించి ఆశీర్వాదంతో పెళ్లి జరిపిస్తారు. బతుకుదెరువు కోసం ఆ జంట కైకలూరు చేరుతుంది. రైల్వేలో కూలిగా చేస్తున్న రాముడు సాయంతో ఓ చెట్టు కింద చెప్పులు కుట్టే పని మొదలుపెడతాడు ఆశీర్వాదం.అలా సాగే జీవితంలో గంగ జీవితం నదిలానే ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. చుట్టూ పదునాలుగూర్లు తాగునీటిలో ఉన్న ఫ్లోరైడ్ శాతం తగ్గించేందుకు పాలేరుకు కట్ట కట్టడమే పరిష్కారం. నవలిక కథా వస్తువు అదే. అందుకు మాదిగల వైపు నుండి ఉద్యమం అంటే మిగితా కులాలు సహకరించరు. ’ఇది జగమెరిగిన సత్యం’ అంటాడు రచయిత. చివరకు గంగమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణమే లక్ష్యంగా గంగ, సంజీవి తదితర ప్రధాన పాత్రలు ఉపక్రమిస్తాయి. ఎజ్రాశాస్త్రి రచన నేల మీదే నడుస్తుంది. మాదిగల ఉన్నతిని కోరే క్రమం అంతర్లీనంగా ఉంటుంది. పాత్రల మధ్య పరస్పర సహకారం, ప్రేమానుబంధాలు పెనవేసుకొని ఉంటాయి. వర్గాల మధ్య వైరుధ్యాలు విడమరచి చెప్పినా శత్రుత్వాన్ని ఎగదోయనితనం చూడవచ్చు. మతాలు, పండుగలు, జాతరలు మనుషులందరూ సామరస్యంగా బతకడానికి అనే సందేశం ఉంటుంది. నిమ్నత అనేది మనిషికి కాకుండా మనిషి గుణానికి చెందిన పదం అని నిరూపించే ప్రయత్నం ఆయన రచనల్లో కనిపిస్తుంది.

గంగ జాతర (నవలిక),
రచన : దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి,
పేజీలు 76,
వెల :రూ.100/-
నవమల్లెతీగ ముద్రణలు, విజయవాడ,
ప్రతులకు: ఫోన్- 7013975274.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News