పూడూరు: వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని చీలాపూర్ సమీపంలో ఉన్న కేశవరెడ్డి రెసిడెన్సియల్ పాఠశాలలో యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా మొయినాద్ మండలంలోని చిన్న మంగళారం గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమారుడు కార్తీక్(8) కేశవరెడ్డి పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాడు. గత నెల 26వ తేదిన ప్రమాదవశాత్తు తను పడుకునే రెసిడెన్సీ యల్‌లోని బెడ్‌పై నుంచి కిందపడ్డాడు. దింతో అతనికి చెయ్యి విరిగింది. పాఠశాల యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్షం చేశారు. సరైన వైద్యం చేయించకుండా రెండు మూడు రోజుల పాటు ఆలస్యం చేసి తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే మెరుగైన వైద్యం కోసం విద్యార్థిని తల్లిదండ్రులు నగరంలోని సిటిజన్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే బాలుడి చేయ్యి నుంచి ఇన్‌ఫెక్షన్ బాడీ మొత్తం పాకడంతో అతను చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు. కాగా తమ కుమారుడు పాఠశాల యాజమాన్యం నిర్లక్షం కారణంగానే చనిపోయాడని తల్లిదండ్రులు చన్‌గోములు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం విద్యార్థి చావుకు కారణాలు చెప్పడం లేదని ఆందోళన చెందారు. పాఠశాలను ముట్టడించి ధర్నా, నిరసనలు చేశారు. ఎన్‌ఎస్‌యూఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, పూడూరు సొసైటీ చైర్మన్ పట్లోళ్ల సతీష్‌రెడ్డి విద్యార్థి సంఘం నాయకులతో కలిసి పాఠశాలలో ధర్నా చేశారు. గతేడాది ఆగస్టు నెలలో కూడా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనా పట్టించుకోలేదని, అంతకు ముందే ఒకరిద్దిరు విద్యార్థులు చనిపోయినా యాజమాన్యం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, ఉన్నత స్థాయి విద్యాశాఖ స్పందించి కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పరిగి డిఎస్పి కరుణసాగర్‌రెడ్డి, సిఐ వెంకట్రామయ్య, ఎస్‌ఐ విఠల్‌రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులను చెదరగొట్టారు. ఇరువర్గాలను సందాయించి ఒప్పందం చేశారు. పాఠశాల యాజమాన్యం తప్పని తెలిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వికారాబాద్ డిఈఓ రేణుకాదేవి అక్కడికి వచ్చి వివరాలను తెలుసుకున్నారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్షమని తెలిస్తే ఉన్నతాధికారులకు చర్యలు తీసుకునేలా నివేధికలు పంపిస్తామన్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పందించారు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని కేశవరెడ్డి పాఠశాలలో చదువుతున్న మూడవ తరగతి విద్యార్థి కార్తీక్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి సమగ్ర విచారణ చేపట్టాలని పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీ దేవసేనను ఆదేశించారు.విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైనా చర్యలు తీసుకుంటామని వెల్ల్లడించారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ను సూచించారు. విద్యార్థి మృతి అత్యంత బాధకరమని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.